తొలిరోజే తాట తీసే పాయింట్లు భారీగా ప‌డ్డాయ్

Update: 2017-08-02 04:39 GMT
రోడ్ల మీద‌కు వ‌చ్చిన వాహ‌న‌దారులు అడ్డ‌దిడ్డంగా.. ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రించే వైఖ‌రికి బ్రేకులు వేసేందుకు వీలుగా పాయింట్ల విధానాన్ని తెర మీద‌కు తీసుకొచ్చిన సంగ‌తి తెలిసిందే. నిన్నటి (మంగ‌ళ‌వారం) నుంచి ఈ పాయింట్ల విధానాన్ని తీసుకొచ్చిన హైద‌రాబాద్ పోలీసులు తొలిరోజునే భారీ ఎత్తున పాయింట్ల‌ను వేశారు.

మొద‌టి రోజున 1450 మందిని త‌నిఖీ చేసి వారికి 1912 పెనాల్టీ పాయింట్ల‌ను వేశారు. అయితే.. సాఫ్ట్ వేర్ లో  త‌లెత్తిన లోపాల కార‌ణంగా పాయింట్ల‌ను పెనాల్టీగా విధించే విధానాన్ని కాస్త ఆల‌స్యంగా స్టార్ట్ చేశారు. ట్రాఫిక్ నిబంధ‌న‌ల్ని ఉల్లంఘిస్తున్న వారికి జ‌రిమానాలు విధిస్తున్నా.. దాన్ని ప‌ట్టించుకోని నేప‌థ్యంలో.. వాహ‌న‌దారుల్ని దారికి తేవ‌టం క‌ష్టంగా మారింది.

దీంతో.. అలాంటి వారిని దారికి తెచ్చేందుకు వీలుగా.. స‌రికొత్త పెనాల్టీ విధానాన్ని అమ‌ల్లోకి తీసుకొచ్చారు. తొలిరోజు త‌నిఖీల్లో అత్య‌ధికంగా ఉన్న వారిలో హెల్మెట్ లేకుండా వాహ‌నం న‌డుపుతున్న వారు.. బీమా.. పొల్యూష‌న్ స‌ర్టిఫికేట్లు లేని వారే ఎక్కువ‌గా ఉన్న‌ట్లు చెబుతున్నారు.

దేశంలోనే తొలిసారిగా అమ‌లు చేస్తున్న ఈ పాయింట్ల విధానంలో తొలి రోజున తొలిపాయింట్ వేయించుకున్న వ్య‌క్తిగా మ‌ల‌క్ పేట‌లో హెల్మెట్ లేకుండా బైక్ న‌డుపుతున్న ప‌రశురాములుగా నిలిచారు. పాయింట్ల విధానంలో ఆయ‌న‌కు ఒక పాయింట్‌ను పెనాల్టీగా విధించారు.  

తాజా పాయింట్ల విధానంలో రెండేళ్ల వ్య‌వ‌ధిలో ఉల్లంఘ‌న‌ట ద్వారా 12 పాయింట్ల దాటితే వారికి డ్రైవింగ్ లైసెన్స్ ల్ని ర‌ద్దు చేస్తారు. ఇలా ర‌ద్దుచేసిన లైసెన్స్ ను ఏడాది పాటు తిరిగి ఇవ్వ‌రు. రెండోసారి డ్రైవింగ్ లైసెన్స్ పొందిన త‌ర్వాత కూడా మ‌రోసారి 12 పాయింట్లు ప‌డితే.. రెండేళ్ల పాటు డ్రైవింగ్ లైసెన్స్ ను ర‌ద్దు చేస్తారు. పాయింట్ల విధానంపై భారీ ఎత్తున ప్ర‌చారం చేసి.. ప్ర‌జ‌ల్లో పూర్తి అవ‌గాహ‌న క‌లిగిన త‌ర్వాతే పాయింట్ల ప‌నిష్ మెంట్ స్టార్ట్ చేసిన‌ట్లుగా డీజీపీ చెబుతున్నారు.
Tags:    

Similar News