నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్ లు పూర్తయితే దక్షిణ తెలంగాణ సస్యశ్యామలమే!

Update: 2020-08-14 07:30 GMT
అటు తెలంగాణ.. ఇటు ఏపీకి రెండింటి మధ్యనున్నది కృష్ణా నది. ఇప్పుడు ఈ నీరే దక్షిణ తెలంగాణకు, రాయలసీమకు వరప్రదాయినీ. భవిష్యత్తులో కృష్ణా జలాలను శ్రీశైలం, నాగార్జున సాగర్ ఆధారంగా రెండు తెలుగు రాష్ర్టాలు సద్వినియోగం చేసుకునే విధంగా ప్రాజెక్ట్ లు నిర్మించడం ద్వారానే నీటి వృధాని అరికట్టి వెనుకబడిన దక్షిణ తెలంగాణ, రాయలసీమ ప్రాంతాలను అభివృద్ధి చేయడం సాధ్యమవుతుందని ఇంజనీరింగ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో సంగమేశ్వరం రాయలసీమ ఎత్తిపోతల పథకం చేటప్టడం ద్వారా తెలంగాణకు ముఖ్యంగా మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని తెలంగాణలోని కొన్ని రాజకీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రెండు రాష్ర్టాల్లోను వినియోగం, నిర్మాణం, ప్రతిపాదనలో ఉన్న ప్రాజెక్ట్ లను పరిశీలిస్తే నీటి వినియోగం రాష్ర్టాలకు న్యాయాలు, అన్యాయలు అవగతం అవుతాయి.

అదే సమయంలో తెలంగాణలో నిర్మాణంలో ఉన్న కృష్ణా ఆధారిత వరదనీటి వినయోగ, కేటాయింపులు ఉన్న ప్రాజెక్ట్ లను త్వరితగతిన పూర్తిచేయడం ద్వారానే దక్షిణ తెలంగాణ సస్యశ్యామలం సాధ్యమవుతుంది. కృష్ణాలో తరచూ వరద నీరు వృధాగా సముద్రం పాలవుతోంది. అదే సమయంలో రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో ఆయకట్టుకు సక్రమంగా నీరందని పరిస్థితి నెలకొంది. మరోవైపు పోలవరం ప్రాజెక్ట్ పూర్తయితే గోదావరి జలాలు కృష్ణాకు అక్కడి నుంచి పెన్నాకు చేరతాయి. ఇలోగా కృష్ణా నదిపై నిర్మాణంలో, ప్రతిపాదనలో ఉన్న ప్రాజెక్ట్ లను రెండు రాష్ర్టాలు సయోధ్యతో రాజకీయాలకు అతీతంగా నిర్మిస్తేనే ప్రయోజనం ఉంటుంది.

రాయలసీమ ఎత్తిపోతల నిర్మించడం వల్ల తెలంగాణకు నష్టం వాటిల్లే అవకాశాలు లేవు. ఏపికి కేటాయించిన నీటిని పూర్తిస్థాయిలో వినియోగించకపోవడం వల్లనే జలాలు వృథా  అవుతున్నాయి. ఈ పరిస్థితిలో పోతిరెడ్డిపాడు నీటిని కలిపే విధంగా సంఘమేశ్వరం వద్ద ఎత్తిపోతల పథకం చేపట్టాలని ఏపి ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై ఎన్జీటి విచారణ జరిపి తొలుత స్టే విధించినప్పటికీ ఆ తర్వాత టెండర్లు పిలుచుకునేందుకు అనుమతించింది. అదే సమయంలో కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ నుంచి అనుమతి అవసరమా లేదా అనేది తేల్చాలని కోరింది. దీనిపై కేంద్ర మంత్రిత్వ శాఖ ఒక కమిటీని నియమించింది.  ఈ కమిటీలో తెలంగాణ ప్రభుత్వానికి చెందిన నిపుణులు కూడా ఉన్నారు. కమిటీ అధ్యయనం చేసి ఈ ప్రాజెక్ట్ ఏ మాత్రం కొత్తది కాదని పైగా పర్యావరణ, అటవీ అనుమతులు అవసరం లేదని తేల్చిచెప్పింది. కృష్ణా నుంచి ఏపీకి (రాయలసీమ) నీటిని కేటాయించగా ఆ నీటిని ప్రతి ఏడాది వినియోగించుకోలేకపోతున్నారు.

శ్రీశైలం నుంచి రాయలసీమకు తెలుగు గంగ (29 టిఎంసీలు), ఎస్.ఆర్.బి.సి (19), గాలేరు-నగరి-జిఎన్ఎస్ఎస్ (39), చెన్నైకి తాగు నీరు (15), టిబిపిహెచ్ ఎల్ సి (10), తాగు నీటి అవసరాలు- ఆవిరి నష్టాలు (3 టిఎంసీలు) కలిపి మొత్తం 114 టిఎంసీల నీటిని వినియోగించుకోవాలి. ఇందుకోసం శ్రీశైలం జలాశయం వెనుకభాగంలో అప్రోచ్ కాలువను నిర్మించి అక్కడి నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరి ద్వారా శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్ (ఎస్ ఆర్ ఎంసి) ద్వారా జలాశయంలో 841 అడుగుల పైన నీరు చేరిన తరువాత విడుదల చేయాలి. ఎస్ఆర్ఎంసి నుంచి నీరు బంకిచెర్లా క్రాస్ రెగ్యులేటరీ ద్వారా తెలుగు గంగ (ఎడమవైపు), కెసి కాలువ (మధ్యలో) - ఎస్ ఆర్బిసి (కుడివైపు)కాలువలకు నీటిని విడుదల చేస్తారు. ఇందుకోసం రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1246 క్యుమెక్స్ లేదా 44 వేల క్యూసెక్కులు నీటిని విడుదల చేసే విధంగా సామర్థ్యాన్ని గణనీయంగా పెంచారు. అంతకు ముందుతో పోలిస్తే దీని సామర్థ్యం పెంచిన తరువాత సీమలో శ్రీశైలం వరద జలాల వినియోగం గణనీయంగా పెరిగింది. అందుకు గత సంవత్సరం 179.30 టిఎంసిల నీటిని రాయలసీమతో పాటు నెల్లూరు - చెన్నై నగరాలకు మళ్లించారు.

శ్రీశైలం జలాశయం నుంచి రాయలసీమకు పోతిరెడ్డిపాడు ద్వారా 114 టిఎంసిల నీటిని వినియోగించాల్సి ఉండగా గత రెండు సంవత్సరాలు మినహాయిస్తే మిగిలిన ఏ ఏడాది కూడా సగం నీటిని కూడా సీమ ప్రాజెక్ట్ లకు మళ్లించలేకపోయారు. 2004-05 నుంచి 2019-20 వరకు నీటి వినియోగాన్ని పరిశీలిస్తే ఆ విషయం స్పష్టమౌతుంది. 2004-05లో మొత్తం 56.51 టిఎంసిలు వినియోగిస్తే 2005-06లో 78.49, 2007-08లో 48.05, 2009-10లో 60.14 టిఎంసిలు (ఈ సంవత్సరం కృష్ణాకు చారిత్రాత్మక స్థాయిలో భారీ వరద వచ్చింది) మాత్రమే వినియోగించారు. 2012-13లో అతి తక్కువగా 22.49 టిఎంసిలు, 2014-15లో 59.17 నీటిని ఉపయోగించారు. 2015-16లో అతి తక్కువగా కేవలం 0.95 అంటే ఒక టిఎంసి నీటిని కూడా విడుదల చేయలేదు. ఆ తర్వాత వరుసగా నాలుగేళ్ళు గత ఏడాది వరకు 67.44, 91.70, 115.40, 179.30 టిఎంసిల చొప్పున లభించాయి.

తెలంగాణకు వచ్చేసరికి కల్వకుర్తి, శ్రీశైలం ఎడమగట్టు, పాలమూరు రంగారెడ్డి, డిండి ఎత్తిపోథల, కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు ప్రాజెక్ట్ లు నిర్మాణం, వినియోగంలో ఉన్నాయి. వీటిల్లో శ్రీశైలం ఎడమగట్టు కాలువ మూడు దశాబ్దాల క్రితం చేపట్టినా ఇప్పటికీ పూర్తి కాలేదు. నిర్మాణంలో ఉంది. 40 టిఎంసీల నీటిని వినియోగించుకోవడం ద్వారా 4 లక్షల ఎకరాలు సాగులోకి తీసుకురావచ్చు. పాలమూరు రంగారెడ్డి పథకం ద్వారా మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు ప్రయోజనం చేకూరుతుంది. 90 టిఎంసీల నీటిని వినియోగించుకోవడం ద్వారా 12.30 లక్షల ఎకరాలు సాగులోకి తీసుకురావచ్చు.

 తెలంగాణ ముఖ్యమంత్రికి నీటి పారుదలపై అవగాహన ఎక్కువ, మక్కువ కూడా. ఇంజనీరింగ్ నిపుణుడి తరహాలో ఆయన ఆలోచనలు ఉంటాయి. అందువల్లనే కాళేశ్వరం లాంటి ప్రపంచంలోనే పెద్దదైన బహుళ ఎత్తిపోథల పథకాన్ని మూడేళ్ళలో పూర్తిచేశారు. అదే విధంగా దక్షిణ తెలంగాణలోని ప్రాజెక్ట్ లను కూడా ఆయన చిత్తశుద్ధితో పూర్తిచేయగలరని అదే జరిగితే రాయలసీమ ఎత్తపోథల పథకం వల్ల దక్షిణ తెలంగాణ కు అన్యాయం జరిగే పరిస్థితే రాదని వారు విశ్లేషిస్తున్నారు.  అదే విధంగా డిండి ఎత్తిపోథల పథకం 30 టిఎంసీల సామర్థ్యంతో చేపట్టారు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో ఉంది. ఇప్పుడు ఇది పూర్తయితే 3.42 లక్షల ఎకరాలు సాగులోకి వస్తుంది. అదే విధంగా దిగువన కృష్ణా జలాల ఆధారంగా ఉదయ సముద్రం ఎత్తిపోథల పథకాన్ని నల్గొండ జిల్లా ప్రయోజనం కోసం చేపట్టారు. ఈ పథకం ద్వారా లక్ష ఎకరాలు కొత్తగా సాగులోకి వస్తుంది.

తెలంగాణలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్ లు ఏళ్ళ తరబడి నత్తనడకన నడుస్తున్నాయి. శ్రీశైలం ఎడమగట్టు కాలువ 1983లో ప్రారంభించినప్పటికీ ఇప్పటికీ పూర్తి కానేలేదు. నాగార్జున సాగర్ ఎగువ భాగం నుంచి ఈ ప్రాజెక్ట్ కు నీరు తీసుకుంటుండగా కొత్తగా శ్రీశైలం నుంచి కూడా ప్రాజెక్ట్ కు నీరు తీసుకునే విధంగా నిర్మాణ పనులు చేపట్టారు. మరో ప్రధానమైన ప్రాజెక్ట్ పాలమూరు రంగారెడ్డి. ఈ ప్రాజెక్ట్ లో 5 ఎత్తిపోతల కేంద్రాలతో పాటు 6 జలాశయాలు నిర్మించాలి. మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలు ప్రయోజనం పొందుతాయి. అయితే ఈ పనులు అప్పగించి ఐదేళ్ళు గడిచిపోయినా నత్తనడకన జరుగుతున్నాయి. మొత్తం 21 ప్యాకేజీలుగా పనులు విభజించినప్పటికీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు జరుగుతున్నాయి.  ప్రధానంగా నిధుల కొరత వల్లనే ఈ పరిస్థితి ఎదురయ్యింది. అదే విధంగా డిండి ఎత్తిపోథల పథకం కూడా.

రాయలసీమ ఎత్తపోథల పథకం నిర్మాణం పూర్తయినప్పటికీ ఆ రాష్ర్టానికి కేటాయించిన నీటిని మాత్రమే వినియోగించుకోవడం సాధ్యమవుతుందని, అది కూడా వరదల సమయంలోనే అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఏపీ వైపు వినియోగంలో ఉన్న, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్ లు, శ్రీశైలం జలాశయంలో 850 అడుగుల సరాసరికి ఉన్నప్పుడు మాత్రమే వినియోగించుకోవడం సాధ్యమవుతుంది. కానీ తెలంగాణలో నిర్మాణంలో ఉన్న, పూర్తయిన ప్రాజెక్ట్ లు శ్రీశైలంలో నీటి మట్టం కనీసానికి పడిపోయినప్పుడు కూడా పంపింగ్ చేయడం సాధ్యమవుతుంది. అందువల్ల రాయలసీమ ఎత్తిపోథల పథకం వల్ల తెలంగాణకు ఏమాత్రం నష్టం లేదనేది నిపుణుల విశ్లేషణ. పైగా కేంద్ర జల మంత్రిత్వ శాఖ అధీనంలోని ఉన్న కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ వాటర్ బోర్డు పర్యవేక్షణలో నీటి వినియోగాన్ని అమలు చేయాలి. అదే సమయంలో బ్రిజెష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు అమల్లోకి వస్తే మహారాష్ర్ట, కర్నాటకలు ఇప్పటికన్నా 254 టిఎంసీలు ఎక్కువగా వాడుకునే హక్కు లభిస్తుంది. దాంతో రెండు తెలుగు రాష్ర్టాలు 369 టిఎంసీలను వినియోగించుకోవాలి. ఈ లెక్కన నీటి లభ్యత తగ్గిపోతుంది (వరదలు లేనప్పుడు). ఈ పరిస్థితిలో పోలవరం పూర్తి చేయడం ద్వారా కృష్ణాకు నీటి సమస్య ఎదురుకాకుండా చూసుకోవచ్చు.

భవిష్యత్తులో నాగార్జున సాగర్ కృష్ణా డెల్టా ఆయకట్టుకు పోలవరం వినియోగించుకున్నపుడు ఎగువన శ్రీశైలం కేంద్రంగా రెండు రాష్ర్టాలు ముందుగానే అంటే వరదలు రాకముందే నీటిని వినియోగించుకునే ప్రణాళిక కూడా రూపొందించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా వాస్తవాలను శాస్ర్త, సాంకేతిక పద్ధతిలో నిపుణుల నివేదికల ఆధారంగా సయోధ్యతోనే పరిష్కరించుకోవాలనేది నిపుణులు సూచన..

    

Tags:    

Similar News