ఇదో చిత్రమైన వ్యవహారం. అది ప్రభుత్వ కార్యాలయం. అయితే.. దానికి కాపలాగా.. ఒక వ్యక్తిని నియమిం చారు. ``జాగ్రత్త సుమా.. కీలకమైన ఫైళ్లు ఉన్నాయి. వేలకువేలు విలువ చేసే.. బీరువాలు ఉన్నాయి. లక్ష ల కొద్దీ వెచ్చించి కొనుగోలు చేసిన ఫర్నీచర్ కూడా ఉంది. జాగ్రత్తగా ఉండు..`` అని .. ఒక ప్యూన్(ఇతను కూడా ప్రభుత్వ ఉద్యోగే)కు అప్పగించారు. అయితే.. అతను ఏం చేశాడంటే.. ఫుల్లుగా.. అవన్నీ అమ్మేశాడు. ఇక.. అమ్మకుండా మిగిల్చింది.. మొండి గోడలు మాత్రమే. తలుపులు కూడా అమ్మేయడం.. బహువిచిత్రం!!
ఏం జరిగిందంటే..
మద్యానికి బానిసైన ఓ వ్యక్తి మందు కోసం తాను పని చేసే ఆఫీస్లోని వస్తువులనే అమ్మేశాడు. ఈ ఘటన ఒడిశాలోని గంజామ్ జిల్లా విద్యా శాఖ అధికారి-డీఈఓ కార్యాలయంలో జరిగింది. నిఘా ఉంచమని బాధ్యత అప్పచెబితే అతడు తన చేతివాటాన్ని చూపించాడు. దాదాపు రెండేళ్లలో తలుపులతో సహా మొత్తం ఆఫీస్నే ఖాళీ చేశాడు.
ఒడిశాలోని గంజామ్ జిల్లాలో రెండేళ్ల క్రితం డీఈఓ కార్యాలయాన్ని అధికారులు కొత్త భవనానికి మార్చారు. అవసరమైన సామగ్రిని కొత్త ఆఫీస్కు మార్చారు. కొన్ని ఫైల్స్తో పాటు లక్షలు విలువ చేసే ఫర్నీచర్ను పాత ఆఫీస్లోనే ఉంచారు. ఆఫీస్కు కాపలాగా ఉండమని ప్యూన్ పీతాంబర్కు(గవర్నమెంట్ ఫోర్త్ క్లాస్ ఉద్యోగి) బాధ్యతలు అప్పజెప్పారు. ఆ తర్వాత దాదాపు రెండేళ్లు ఆ బిల్డింగ్ వైపు చూడలేదు విద్యా శాఖ అధికారులు.
ఇదే అదునుగా చేసుకుని పీతాంబర్ ఆఫీస్లో ఉన్న వస్తువులన్నింటినీ ఒక్కొక్కటిగా మాయం చేసుకుం టూ వచ్చాడు. అలా 20కి పైగా అల్మరాలు(బీరువాలు), 10 సెట్ల కుర్చీలు, బల్లలు, పాత ఫైల్స్ను అమ్మేశాడు. కొన్ని కిటికీలను సైతం మాయం చేశాడు. పోలీస్ స్టేషన్కు సమీపంలోనే ఆ బిల్డింగ్ ఉన్నప్పటికీ ఇవన్నీ చోరీకి గురవడం విశేషం. ఇంత జరుగుతున్నా.. జిల్లా విద్యాశాఖ అధికారులు ఎవరూ అటువైపు రాకపోవడం వల్ల పీతాంబర్కు మరింత ధైర్యం పెరిగింది. ఇదే సరైన సమయంగా భావించి తలుపులతో సహా అన్నింటినీ సర్దేశాడు ఆ ప్యూన్.
అయితే.. డీఈఓ ఆఫీస్కు పాత ఫైల్స్ కోసం ఓ సీనియర్ అధికారి ఇటీవల వచ్చారు. తీరా చూస్తే ఆయనకు ఖాళీ గది , మొండి గోడలు తప్ప ఏమీ కనపడలేదు. షాక్కు గురైన ఆ అధికారి పోలీసులకు తమ ఆఫీస్లో దొంగతనం జరిగిందని ఫిర్యాదు చేశారు. వారు పెద్దగా కష్టపడకుండానే.. దొంగ ఇట్టే దొరికిపోయాడు. ఇదీ.. సంగతి.. !!
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.