లోకేష్ మీద గెలిచావ్‌.. ప్ర‌జ‌ల‌కు ఏమ‌న్నా చెయ్యండి సార్..!

Update: 2021-12-15 07:30 GMT
ప్ర‌జ‌ల ఓట్ల‌తో గెలిచిన ఎమ్మెల్యేలంటే.. ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో జ‌నాల‌కు అందుబాటులో ఉంటూ వాళ్ల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాలి. ఇక త‌మ పార్టీనే అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు అయితే అభివృద్ధి ప‌నుల్లో వేగం చూపించాలి. త‌మ నియోజ‌క‌వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు ఏ ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి.

కానీ అస‌లు ఎమ్మెల్యేగా ప్ర‌జ‌ల‌కు సేవ చేయాల‌న్న సంగ‌తే మ‌ర్చిపోయి.. కేవ‌లం ప‌బ్లిసిటీ కోసం వివిధ ర‌కాల ఫోటోలు సామాజిక మాధ్య‌మాల్లో పోస్టు చేస్తే ఎలా ఉంటుంది? ఆ నాయ‌కుడిపై ప్ర‌జ‌ల‌కు మండుతుంది. ఇప్పుడు ఏపీలోని మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ఆల్ల రామ‌కృష్ణా రెడ్డిపై కూడా ఆ నియోజ‌క‌వ‌ర్గ జ‌నాల‌కు అలాంటి కోప‌మే ఉంది. ఆయ‌న అభివృద్ధి ప‌నులు ప‌ట్టించుకోవ‌డం లేద‌నేది వాళ్ల ఆగ్ర‌హానికి కార‌ణం.

2014 ఎన్నిక‌ల్లో వైసీపీ నుంచి మంగ‌ళ‌గిరిలో తొలిసారి ఆర్కే ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పుడు కేవ‌లం 12 ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్య‌ర్థి గంజి చిరంజీవిపై నెగ్గి ఊపిరి తీసుకున్నారు. తొలిసారి ఎమ్మెల్యేగా ఉత్సాహంతో నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌న అభివృద్ధి ప‌నులు ప‌రిగెత్తించారా? అంటే లేద‌నే స‌మాధానాలే వినిపిస్తున్నాయి.

పోనీ అప్పుడు టీడీపీ అధికారంలో ఉంది క‌దా అనుకుందాం. ఇక 2019 ఎన్నిక‌ల్లో టీడీపీ అధినేత చంద్ర‌బాబు తన‌యుడు నారా లోకేష్‌పై ఆర్కే విజ‌యం సాధించారు. అదే మంగ‌ళ‌గిరిలో అప్పుడు 5,337 ఓట్ల తేడాతో లోకేష్‌ను ఓడించారు. స్వ‌యంగా టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లోకేష్ బ‌రిలో దిగ‌డంతో ఆ ఎన్నిక‌లపై అంద‌రి దృష్టిని ఆక‌ర్షించాయి.

గెలుపును రెండు పార్టీలు ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకున్న ఆ నియోజ‌క‌వ‌ర్గంలో చివ‌ర‌కు వైసీపీదే పైచేయి అయింది. లోకేష్‌పై గెలిచార‌ని ఆర్కే పేరు మార్మోగింది. కానీ ఆ త‌ర్వాత మ‌ళ్లీ పాత క‌థే.

ఈ సారి వైసీపీ ప్ర‌భుత్వ‌మే ఉంది. కానీ అధికార ఎమ్మెల్యే ఆర్కే మాత్రం నియోజ‌క‌వ‌ర్గంలో ఎలాంటి అభివృద్ధి ప‌నులు చేయ‌డం లేద‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. ఎంత‌సేపు సొంత ప‌బ్లిసిటీ కోసం పాకులాడుకోవ‌డ‌మే త‌ప్ప ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను పట్టించుకోవ‌డం లేదంటూ జ‌నాలు ఆయ‌న‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

పొలం ప‌నులు చేస్తూ, రోడ్డు ప‌క్క‌న టీ తాగుతూ ఆ ఫోటోల‌ను సామాజిక మాధ్య‌మాల్లో పోస్టు చేసుకుంటున్న ఆయ‌న‌కు ప్ర‌చార యావ త‌ప్ప మ‌రొక‌టి లేద‌ని అంటున్నారు. ఇప్ప‌టికైనా జ‌నం గురించి ప‌ట్టించుకుంటూ.. అభివృద్ధి ప‌నులు చేస్తూ ఆ ఫోటోలు పోస్టు చేసి నిరూపించుకో అని ఆయ‌న‌కు జ‌నాలు చుర‌క‌లంటిస్తున్నారు.

ఇప్ప‌టికే కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో త‌మ ఎమ్మెల్యేల ప‌నితీరు స‌రిగ్గా లేద‌ని జ‌గ‌న్కు నివేదిక‌లు అందుతున్న‌ట్లు స‌మాచారం. మ‌రి ఈ నేప‌థ్యంలో జ‌నాల్లో త‌న‌పై వ‌స్తున్న ఆగ్ర‌హాన్ని ఆర్కే త‌గ్గించుకుంటారో లేదో చూడాలి.
Tags:    

Similar News