కొడాలి నానికి ప్రజాప్రతినిధుల కోర్టు ఝలక్‌!

Update: 2023-03-03 13:13 GMT
ప్రత్యర్థి పార్టీల నేతలపై తీవ్ర విమర్శలు చేసేవారిలో గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని ఒకరు. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్‌ లపై కొడాలి నాని వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తారనే విమర్శలు ఉన్నాయి.

కాగా గుంటూరు, పల్నాడు జిల్లాల వైసీపీ రీజినల్‌ కోఆర్డినేటర్‌ గా ఉన్న కొడాలి నానికి విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు ఝలక్‌ ఇచ్చింది. ఆయనపై అరెస్టు వారెంట్‌ అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

కొడాలి నానిపై జారీ చేసిన అరెస్టు వారెంట్‌ 2023 జనవరి 5 నుంచి పెండింగ్‌ లో ఉండటంతో గవర్నర్‌ పేట సీఐ సురేష్‌ కుమార్‌  విజయవాడలోని ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు. నానిపై అరెస్టు వారెంట్‌ పెండింగ్‌ లో ఉందని.. దాన్ని అమలు చేయాలని న్యాయమూర్తి గాయత్రీదేవి సీఐకి ఆదేశాలు జారీ చేశారు.

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడానికి ప్రయత్నించడం లేదంటూ పోలీసు ఉత్తర్వులు ఉల్లంఘించి 2016 మే 10న మాజీ మంత్రి కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యే కొడాలి నాని, మరికొందరు విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి వన్‌వేలో ర్యాలీ చేశారని అభియోగాలు ఉన్నాయి. ఈ ర్యాలీ సందర్భంగా ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారన్న ఆరోపణలతో అప్పట్లో విజయవాడ గవర్నర్‌ పేట పోలీసుస్టేషన్‌ లో కేసు నమోదైంది.

వాయిదాలకు కొడాలి నాని  రాకపోవడంపై విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టుకు హాజరుకాకపోవడంతో ఆయనపై న్యాయమూర్తి అరెస్టు వారెంట్‌ జారీ చేశారు. దాన్ని వెంటనే అమలు చేయాలని సీఐని జస్టిస్‌ గాయత్రీదేవి ఆదేశించారు.

దీంతో న్యాయస్థానం ఆదేశాలతో కొడాలి నానికి షాక్‌ తగిలినట్టయింది. కోర్టు అరెస్టు వారెంట్‌ ను వెంటనే అమలు చేయాలని ఆదేశించడంతో పోలీసులు ఆయనను అరెస్టు చేయకతప్పదంటున్నారు. లేదా హైకోర్టును ఆశ్రయించి కొడాలి నాని అరెస్టు కాకుండా ఉత్తర్వులు తెచ్చుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.       



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News