‘సన్నాసి’ మాట ఇంత బూతుగా అనిపిస్తే.. ‘పప్పు’ మాటలో బూతు లేదా?

Update: 2021-09-29 08:30 GMT
తెలుగు నాట దూకుడు రాజకీయాలు మొదలై దాదాపు ఒకటిన్నర దశాబ్దానికి పైనే అయ్యింది. ఎప్పుడైతే దివంగత మహానేత వైఎస్ ముఖ్యమంత్రి అయ్యారో.. ఆ తర్వాత నుంచి తెలుగు నేల మీద దూకుడు రాజకీయాలు మొదలయ్యాయి. రాజకీయ ప్రత్యర్థుల విషయంలో విరుచుకుపడటమే కాదు.. మీడియా మీద ఇష్టారాజ్యంగా మాట్లాడటం.. వారు రాసే ప్రతి రాతలోనూ ‘రాజకీయ’ కోణాన్ని ఎత్తి చూపే అలవాటు మొదలైంది. గడిచిన పదహారేళ్లలో అది అంతకంతకు ఎక్కువైందే కానీ తక్కువ కాలేదు.

ఇప్పుడు మరింత దారుణంగా మారి.. తమ ప్రత్యర్థులు ఎవరైనా సరే.. సభ్య సమాజంలో మాట్లాడలేని మాటల్ని.. ప్రెస్ మీట్ పెట్టేసి అనేసే దుర్మార్గమైన పరిస్థితికి తెర తీసింది. జనసేన అధినేత కమ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మొన్నటి రిపబ్లిక్ మూవీ ప్రీరిలీజ్ ఫంక్షన్ లో ఏపీ మంత్రిని ఉద్దేశించి ‘సన్నాసి’ అన్న మాటపై అటు ఇండస్ట్రీలోని కొందరు.. ఇటు రాజకీయ వర్గాలకు చెందిన వారు స్పందించిన తీరు చూస్తే విస్మయానికి గురి కాలేదు.

ఈ ఎపిసోడ్ లో మధ్యలో ఎంట్రీ ఇచ్చిన పోసాని.. పట్టపగ్గాల్లేకుండా మాటలు అనేసే తీరు చూస్తే.. సభ్యత.. సంస్కారం అన్నది  ఏకోశాన అయినా ఉన్నదా? విచక్షణ అన్నది ఉందా? అన్న సందేహాలు కలుగక మానదు. వెనుకా ముందు లేకుండా మాటలు అనేయటం.. మధ్య మధ్యలో మంత్రి పదవిలో ఉన్న వ్యక్తిని అన్నేసి మాటలు అంటారా? అంటూ లా పాయింట్లు తీసిన వైనానికి నవ్వు వచ్చే పరిస్థితి. ఇక.. పవన్ వీరాభిమానులకు మాత్రం రక్తం మరిగిపోతున్న దుస్థితి.

పోసాని మాటలకు లాజిక్కులు వెతకటం అనవసరం.. ఆయన తీరే కాస్త భిన్నంగా ఉంటుంది.. పట్టించుకోవాల్సిన అవసరం లేదని కొందరు తాపీగా వినిపించే మాటలు విన్నప్పుడు ఒక సందేహం కలుగక మానదు.. పిచ్చి కుక్కు రోడ్డు మీదకు వచ్చి దారిన పోయే వారందరిని ఇష్టారాజ్యంగా కరిచేస్తుందనుకోండి.. దాన్ని చూసి.. జాలిగా.. ఒకప్పుడు బాగానే బతికింది.. ఇప్పుడే ఇలా అయ్యిందని సమర్థించుకుంటూ మాట్లాడతారా? లేక.. సదరు పిచ్చి కుక్కు జనాల్ని కరవకుండా తగిన చర్యలు తీసుకుంటారా? అన్నది ప్రశ్న.

వ్యక్తి ఎలాంటి వాడైనా ఫర్లేదు.. విచక్షణ వదిలేసి ఇష్టారాజ్యంగా మాట్లాడుతుంటే.. చూస్తూ ఊరుకోవటం కూడా ప్రోత్సహించినట్లే అవుతుంది. ఇలాంటి మాటలు అన్న వెంటనే.. తెర మీదకు వచ్చే వాదన ఏమంటే.. మరి అట్లా అయితే పవన్ కల్యాణ్ మాటలు సరైనవా? ఒక మంత్రి పదవిలో ఉన్న అసామిని పట్టుకొని ‘సన్నాసి’ అంటారా? అంటూ లా పాయింట్ ను వినిపించేటోళ్లు బోలెడంత మంది ముందుకు వస్తారు. అలాంటివారంతా ఉత్సాహంగా వాదనలు వినిపించే ముందు.. తమ ముందు ప్రభుత్వంలో నారా లోకేశ్ మంత్రిగానే ఉండేవారు కదా? మరి.. ఆయన్ను ‘పప్పు’ అంటూ అవమానించినప్పుడు ఈ నోళ్లు ఏమైపోయాయి? సన్నాసి అన్న మాటలో ఇంత బూతు ఉంటే.. పప్పు అంటూ హేళన చేసినప్పుడు.. అదే మంత్రి పదవిని చులకన చేసిన వారిపై ఇప్పుడు నీతులు చెప్పే గురివిందలు నోరు పెగలకుండా ఉన్నారెందుకు? అన్నది మరో ప్రశ్న.

సన్నాసి మాటలో బూతు కనిపించినప్పుడు రియాక్టు అవుతున్న వారంతా.. ఈ తరహా భాషకు మూలం ఏమిటన్న దానిపైనా కాసింత ఆలోచించాల్సిన అవసరం ఉంది కదా? నువ్వు ఒకటంటే..ఇంకోడు రెండు అంటాడు.. పవన్ కాస్త పద్దతిగా మాట్లాడితే బాగుండేది కదా? అన్న లెక్చర్లు దంచేవారు కొందరుంటారు. మరి.. ఇన్ని నీతులు చెబుతున్న బాబాయ్ లు.. ఈ తరహా ఘాటు వ్యాఖ్యలను షురూ చేసినోళ్ల మీద ఎందుకు కస్సుమనరు. అంత దాకా ఎందుకు.. ప్రెస్ క్లబ్ లో పవన్ మీద పోసాని చేసిన వ్యాఖ్యలకు నీతులు చెప్పిన బ్యాచులు నోరు పెగిలితే మంచిదన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. 
Tags:    

Similar News