మోడీ నియోజకవర్గంలో కౌన్సిలర్‌ను కట్టేసిన ప్రజలు

Update: 2020-11-23 14:30 GMT
ఎన్నికల్లో ఎన్నెన్నో హామీలిస్తారు నాయకులు. సమస్యలు ఏవి తమ దృష్టికి వచ్చినా తీర్చేస్తామని వాగ్దానాలు చేస్తారు. కానీ గెలిచాక సమస్యలు పట్టవు. ఆ నాయకులను అడిగే ధైర్యం జనాలకు కూడా ఉండదు. ఓట్లు అడగడానికి వచ్చినపుడు కొందరు నిలదీసే ప్రయత్నం చేస్తారు కానీ.. మామూలు సందర్భాల్లో అయితే నాయకుడిని గట్టిగా అడగడానికి భయపడతారు. అలాంటిది తమ సమస్యను పరిష్కరించనందుకు ఒక నాయకుడిని రోడ్డు మీద కుర్చీకి కట్టేసి నిరసన వ్యక్తం చేయడం లాంటి ఉదంతాన్ని ఊహించడానికి కూడా కష్టమే. ఐతే ప్రధాని నరేంద్ర మోడీ ప్రాతినిధ్యం వహించే వారణాసి నియోజకవర్గంలోని ఓ వార్డులో ఈ సంచలన ఉదంతం చోటు చేసుకోవడం విశేషం.

గత కొన్ని నెలలుగా కురుస్తున్న వర్షాలకు వారణాసిలో వీధులన్నీ జలమయం అయ్యాయి. ఐతే మురుగు నీరు పోయేందుకు మార్గం లేక వర్షాలు ఆగాక కూడా వీధుల్లో అలాగే నీళ్లు నిలిచి ఉన్నాయి. వాటి నుంచి వచ్చే దుర్గంధానికి జనాలు తాళలేకపోతున్నారు. ఈ సమస్య గురించి రాజకీయ నాయకులకు చెప్పినా, అధికారులకు చెప్పినా ఫలితం లేకపోయింది. దీంతో విసుగెత్తిపోయిన జనాలు.. తమ వార్డు కౌన్సిలర్‌ను నిలదీశారు. తర్వాత అతణ్ని తీసుకొచ్చి కుర్చీ వేసి ఆ మురుగు నీళ్లలోనే కూర్చోబెట్టారు. ఆ కుర్చీకి అతణ్ని తాళ్లతో కట్టి పడేశారు. అతడి సమక్షంలోనే సమస్య తీవ్రతను తెలియజేస్తూ నిరసన వ్యక్తం చేశారు. సంబంధిత ఫొటోలు, వీడియోలు నిన్నట్నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాజకీయ నాయకులకు భయపడకుండా సమస్యల గురించి ఇలా నిలదీసే చైతన్యం అందరిలోనూ రావాలని నెటిజన్లు ఈ ఫొటోలు, వీడియోలు చూసి స్పందిస్తున్నారు.
Tags:    

Similar News