కోవిడ్ వ్యాక్సిన్ల‌ను ఎంత‌శాతం భార‌తీయులు న‌మ్ముతున్నారు?

Update: 2021-09-04 03:02 GMT
ఇది ఆస‌క్తిదాయ‌క‌మైన ప్ర‌శ్నే! వ్యాక్సిన్ విశ్వ‌స‌నీయ‌త ఎంత‌? అనేది ఇప్పుడు ఒక మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. కోవిడ్-19 ప్ర‌భావాన్ని త‌గ్గించ‌డానికి భారీ ఎత్తున ఇస్తున్న వ్యాక్సిన్ల ప్ర‌భావాన్ని అంచ‌నా వేయ‌డానికి బోలెడ‌న్ని శాస్త్రీయ అధ్య‌య‌నాలు జ‌రుగుతున్నాయి. వాటిల్లో ఒక్కోటి ఒక్కో మాట చెబుతున్నాయి. కొన్నేమో వ్యాక్సిన్ల స‌మ‌ర్థ‌త అంతంత మాత్ర‌మే అంటుంటే, మ‌రి కొన్ని అధ్య‌య‌నాలు వ్యాక్సిన్లు క‌నీసం ఆరు నెల‌ల పాటు వ్యాధి నిరోధ‌క‌త‌ను ఇస్తాయ‌ని అంటున్నాయి. ఆరు నెల‌ల‌కు ఒక‌సారి వ్యాక్సిన్ వేయించుకోవ‌డం వ‌ల్ల కోవిడ్-19 ప్ర‌మాదాన్ని త‌గ్గించుకోవ‌చ్చ‌ని కొన్ని అధ్య‌య‌నాలు చెబుతున్నాయి.

అయితే మ‌రి కొన్ని అధ్య‌య‌నాలు ఏమో.. కొంత శాతం మందిలోనే వ్యాక్సిన్లు మంచి ఫ‌లితాల‌ను ఇస్తున్నాయ‌ని, 90 శాతం మందిపై వ్యాక్సిన్లు సానుకూల ఫ‌లితాల‌ను ఇస్తున్నాయ‌ని అంటున్నాయి. ఇంకొంద‌రేమో అస‌లు వ్యాక్సిన్లే అవ‌స‌రం లేద‌ని వాదిస్తున్నారు. ఒక‌సారి కోవిడ్-19కు గురై తేలిక పాటి వైద్యంతో కోలుకున్న వారికి స‌హ‌జంగానే ఇమ్యూనిటీ ఉన్న‌ట్ట‌ని, అలాంటి వారికి మ‌ళ్లీ వ్యాక్సిన్లు ఎందుకు? అని కొంద‌రు ప్ర‌శ్నిస్తున్నారు. అయితే ఒక‌సారి కోవిడ్ కు గురై కోలుకున్న వారు కూడా వ్యాక్సిన్ వేయించుకుంటే వారిలో డ‌బుల్ ఇమ్యూనిటీ పెంపొందిన‌ట్టుగా అవుతుంద‌ని కొన్ని అధ్య‌య‌నాలు చెబుతున్నాయి. మొత్తానికి కోవిడ్ వ్యాక్సిన్ల గురించి ఇంకా ల్యాబ్ రిపోర్ట్ ల మీదే ఆధార‌ప‌డాల్సి వ‌స్తోంది. ఇంత‌కీ వ్యాక్సిన్ల స‌మ‌ర్థ‌త ఎంత‌? ఇవి ప్ర‌జ‌ల్లో ఇమ్యూనిటీని పెంపొందించి కోవిడ్ కు లాంగ్ టైమ్ చెక్ పెట్ట‌గ‌ల‌వా? అనే ప్ర‌శ్న‌ల‌కు ముందు ముందు స‌మాధానాలు దొరుకుతాయి.

ఒక‌వేళ వ్యాక్సిన్ల వ‌ల్ల హెర్డ్ ఇమ్యూనిటీ పెరిగి.. కోవిడ్-19 వ్యాప్తి త‌గ్గిపోత వ్యాక్సిన్లు విజ‌య‌వంతం అయిన‌ట్టే. ఆ సంగ‌త‌లా ఉంటే.. ఇంత‌కీ సామాన్య ప్రజ‌లు వ్యాక్సిన్ గురించి ఏమ‌నుకుంటున్నార‌నే అంశం గురించి స‌ర్వేను చేప‌ట్టింది ఒక సంస్థ‌.  ప్ర‌శ్న ఒక్క‌టే.. వ్యాక్సిన్ ను మీరు న‌మ్ముతున్నారా? అది స‌మ‌ర్థ‌వంతం అనుకుంటున్నారా?  వ్యాక్సిన్ వేయించుకుంటే క‌రోనా ప్ర‌మాదం త‌గ్గిపోయిన‌ట్టే అనుకుంటున్నారా? అనే దీర్ఘ‌మైన ప్ర‌శ్న‌ను వారి ముందు ఉంచారు. విశేషం ఏమిటంటే..ఇండియాలో జ‌రిగిన ఈ స‌ర్వేలో మెజారిటీ భార‌తీయులు వ్యాక్సిన్ ప‌ట్ల విశ్వాసాన్ని వ్య‌క్తం చేశార‌ట‌.

ఈ స‌ర్వే ప్ర‌కారం.. 72 శాతం మంది భార‌తీయులు వ్యాక్సిన్ల‌పై విశ్వాసాన్ని వ్య‌క్తం చేశారు. వ్యాక్సిన్లు సేఫ్, ఎఫెక్టివ్ అంటూ ఇంత మంది చెప్పార‌ట‌! వీరిలో ఆల్రెడీ వ్యాక్సిన్లు వేయించుకున్న వాళ్లు, త‌మ ట‌ర్న్ వ‌చ్చిన‌ప్పుడు వేయించుకోవ‌డానికి రెడీ ఉన్న వారే. ఇలా భార‌తీయులు వ్యాక్సిన్ విశ్వ‌స‌నీయ‌మైన‌వే అని మెజారిటీ మంది భావిస్తున్నారు.  కేవ‌లం 8.8 శాతం మంది మాత్రం వ్యాక్సిన్లు వేయించుకోవ‌డానికి అనాస‌క్తిని చూపుతున్నార‌ట‌. మిగిలిన వారు త‌మ‌కంటూ ప్ర‌త్యేక‌మైన అభిప్రాయాన్ని క‌లిగి లేరు.

అయితే.. కొంత‌మంది చెప్పేదేమిటంటే.. వ్యాక్సిన్ వ‌ల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయేమో అని! వీరి శాతం 24గా ఉంది. వ్యాక్సిన్ వ‌ల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయ‌ని వీరు భ‌య‌ప‌డుతున్నారు. వీరిలోనే 8.8 శాతం మంది అస్స‌లు వ్యాక్సిన్ వ‌ద్దంటున్నార‌ట‌. కానీ వీరిలో చాలా మంది చెబుతున్న‌ది ఏమిటంటే.. వ్యాక్సిన్ పై ప్ర‌జ‌ల్లో లేదా త‌మ‌లో మ‌రింత అవ‌గాహ‌న క‌లిగించాల‌ని, అప్పుడే వ్యాక్సినేష‌న్ కు అంతా ముందుకు వ‌చ్చే అవ‌కాశాలున్నాయ‌ని వారు కోరుతున్నార‌ట‌. దాదాపు తొమ్మిది ల‌క్ష‌ల‌కు మించి అభిప్రాయాల‌తో ఈ స‌ర్వే జరిగిన‌ట్టుగా తెలుస్తోంది.
Tags:    

Similar News