బందరులో పవన్‌ సభ అందుకే: పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు!

Update: 2023-03-14 12:06 GMT
జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభ కృష్ణా జిల్లా మచిలీపట్నం (బందరు)లో జరగనున్న సంగతి తెలిసిందే. మార్చి 14న సాయంత్రం 5 గంటలకు సభ ప్రారంభమవుతుంది. కాగా దీనికోసం జనసేనాని పవన్‌ కల్యాణ్‌ మూడు రోజుల క్రితమే మంగళగిరి పార్టీ ఆఫీసుకు చేరుకున్నారు. బీసీ సంఘాల నేతలతో, కాపు సంఘాల నేతలతో పవన్‌ సమావేశమయ్యారు. కాగా ఆవిర్భావ సభకు యధావిధిగా పోలీసులు ఆంక్షలు విధించారు. కృష్ణా జిల్లా అంతా పోలీస్‌ యాక్ట్‌-30 ఉందని.. అందువల్ల ర్యాలీలు, సభలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ జాషువా హెచ్చరించారు.

మరోవైపు వైసీపీ నుంచి పవన్‌ పై విమర్శల దాడి మొదలైపోయింది. పవన్‌ పై విమర్శలు అనగానే అందరికంటే ముందుగా వచ్చే వ్యక్తి పేర్ని నాని. అందులోనూ ఈసారి పేర్ని నాని ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న బందరులో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభ జరుగుతుండటంతో పేర్ని నానిపై పవన్‌ మాటల తూటాలు ఖాయమని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ముందుగానే పేర్ని నాని.. పవన్‌ పై విమర్శలకు దిగారు.

చంద్రబాబు కోసమే పవన్‌ జనసేన పెట్టారని మాజీ మంత్రి పేర్ని నాని దుయ్యబట్టారు. ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడుతూ వైఎస్‌ జగన్‌ ను తిట్టేందుకే పవన్‌ ఆవిర్భావ సభ పెడుతున్నారని ధ్వజమెత్తారు. సీఎంను తిట్టడమే తప్ప పవన్‌కు  వేరే అజెండా లేదని మండిపడ్డారు.

మనం ఏం చేశాం.. మనలో లోపాలేంటి అనేది చర్చించుకోవడం రాజకీయపార్టీ లక్షణమని పేర్ని నాని చెప్పారు. కానీ చంద్రబాబు సేవ కోసమే పవన్‌ రాజకీయ పార్టీ పెట్టాడని మండిపడ్డారు. తన పార్టీని అభిమానించే వారందరినీ చంద్రబాబుకు పవన్‌ ఓటేయమంటున్నాడని ఎద్దేవా చేశారు. చంద్రబాబు మేలు కోసమే పవన్‌ పని చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటం సభకు.. మచిలీపట్నం సభకు పెద్ద తేడా ఉండదని పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.

అలాగే సీఎం జగన్‌ను, కాపు నాయకులను దూషించడమే పవన్‌ పని అని మండిపడ్డారు. మచిలీపట్నం సభలో జరగబోయేది ఇదేనని పేర్ని నాని కుండబద్దలు కొట్టారు. మచిలీపట్నంలో జరగబోయేది ఆవిర్భావ సభ కాదు... అస్మదీయ దూషణ సభ అన్నారు. కాపులను చంద్రబాబు దగ్గర తాకట్టు పెట్టడానికే పవన్‌ తాపత్రయమని తీవ్ర విమర్శలు చేశారు. పవన్‌ ఎప్పటికీ మారడన్నారు.

 సినిమాలు ప్లాప్‌ అయితే నష్టాలొస్తాయి కానీ ప్లాప్‌ అయిన సినిమాకు కూడా పవన్‌ కు లాభాలొచ్చేది ఇక్కడేనని పేర్ని నాని తీవ్ర విమర్శలు చేశారు. ప్యాకేజీ స్టార్‌ అంటే పవన్‌ కు కోపం వస్తుందని ఎద్దేవా చేశారు. ఏబీఎన్‌ రాధాకృష్ణ రూ.వెయ్యి కోట్ల స్టార్‌ ప్యాకేజ్‌ అంటే మాత్రం పవన్‌ కల్యాణ్‌ ఆనందపడుతున్నాడని పేర్ని నాని చురకలు అంటించారు.        



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News