పీఎం కేర్స్ నుండి వెంటిలేటర్ల కోసం రూ.2వేల కోట్లు.. !

Update: 2020-05-14 09:10 GMT
ప్రస్తుతం ప్రపంచాన్ని భయాందోళనకు గురిచేస్తున్న మహమ్మారి బాధితులను ఆదుకోవడానికి ప్రభుత్వానికి విరాళాలు అందించాలని ప్రధాని మోదీ పీఎం కేర్స్ అనే ట్రస్ట్ ను ఏర్పాటు చేసిన సంగతి తెల్సిందే. ఈ విష‌యంలో కొన్ని విమ‌ర్శ‌లు త‌లెత్తాయి. ఈ మహమ్మారి కారణంగా విధించిన లాక్ డౌన్ తో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం సహాయం చేయాల్సింది పోయి , విరాళాలు కోరతారా అంటూ కొందరు విమర్శలు చేసారు. ఈ ట్రస్ట్ కు భారీగా విరాళాలు వచ్చి చేరాయి.

మోడీ పిలుపు పై కార్పొరేట్ సంస్థలు బాగానే స్పందించాయి,అలాగే  సెల‌బ్రిటీల్లో కూడా కొంద‌రు పీఎం కేర్ ఫండ్ కు విరాళాల‌ను ప్ర‌క‌టించారు. ఈ నేప‌థ్యంలో పీఎం కేర్ నుంచి తొలి సారి ఒక భారీ మొత్తం గురించి ప్ర‌క‌ట‌న వ‌చ్చింది. పీఎం కేర్ కి వచ్చిన మొత్తం నుండి ఈరోజు రూ.3100 కోట్ల నిధులను విడుదల చేశారు. వీటిలో రూ.2వేల కోట్లు వెంటిలేటర్ల కొనుగోలుకు, రూ. వెయ్యి కోట్లను వలస కార్మికుల కోసం, మరో రూ.100 కోట్లను వాక్సిన్ అభివ‌ృద్ధి కోసం కేటాయించారు.  

లాక్ డౌన్ కారణంగా వలస కార్మికులు ఎన్నో ఇబ్బందులు పడుతున్న సంగతి తెల్సిందే. వాళ్ళ సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వాలకు రూ. వెయ్యి కోట్లు మంజూరు చేశారు. వలస కార్మికుల వసతి, భోజన సదుపాయాలు, వైద్య చికిత్స, రవాణా కోసం కేటాయిస్తారు. ఈ నిధులను వలస కార్మికుల కోసం జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు ఖర్చు చేస్తారు. అలాగే మరో రెండు వేల కోట్ల రూపాయ‌ల‌ను వెంటిలేట‌ర్ల కొనుగోలుకు వెచ్చించ‌నున్న‌ట్టుగా తెలిపారు. ఈ రూ.2 వేల కోట్లతో దాదాపు 5వేల మేడిన్ వెంటిలేటర్లను కొనుగోలు చేయనున్నారు. మరో వంద కోట్ల రూపాయ‌ల మొత్తాన్ని మహమ్మారి  నివార‌ణ‌కు మందు క‌నుగొన‌డం గురించి ఖ‌ర్చు చేయ‌నున్న‌ట్టుగా పీవోఓ ఇండియా అధికారిక ట్విట‌ర్ అకౌంట్ నుంచి పోస్టు చేశారు.
Tags:    

Similar News