చ‌లో హెచ్‌ సీయూకి పోలీస్ చెక్‌!

Update: 2016-01-25 07:32 GMT
గ‌త కొద్దిరోజులుగా దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారిన హైద‌రాబాద్ సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీ పీహెచ్ డీ విద్యార్థి రోహిత్ ఆత్మ‌హ‌త్య ఉదంతంలో తాజాగా మ‌రిన్ని ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. రోహిత్ ఆత్మ‌హ‌త్య‌కు కార‌ణ‌మంటూ కేంద్ర‌మంత్రులు స్మృతి ఇరానీ.. బండారు ద‌త్తాత్రేయ‌ల్ని మంత్రివ‌ర్గం నుంచి తొల‌గించాలంటూ డిమాండ్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఈ వ్య‌వ‌హారానికి సంబంధించి వీసీని సెల‌వుపై పంప‌గా.. స‌స్పెన్ష‌న్ ఎదుర్కొంటున్న విద్యార్థుల‌పై స‌స్పెన్ష‌న్ ను ఎత్తివేస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. అయిన‌ప్ప‌టికీ ఆందోళ‌న చేస్తున్న విద్యార్థులు కేంద్ర‌మంత్రుల్ని తొల‌గించే వ‌ర‌కూ త‌మ ఆందోళ‌న విర‌మించ‌మంటూ ప‌ట్టుబ‌డుతున్న ప‌రిస్థితి.

ఇదిలా ఉంటే.. ఆందోళ‌న‌ను మ‌రింత ఉధృతం చేసే ప‌నిలో భాగంగా చ‌లో హెచ్‌ సీయూ పేరిట దేశ‌వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి వ‌చ్చే విద్యార్థుల‌తో బ్ర‌హ్మాండ‌మైన నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌ను సోమ‌వారం నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు. ఇందుకు త‌గ్గ‌ట్లే విద్యార్థి సంఘాలు ఏర్పాట్లు చేశాయి. ఈ నేప‌థ్యంలో ప‌రిస్థితి మ‌రింత ఉద్రిక్తంగా మార‌కుండా ఉండేందుకు పోలీసులు రియాక్ట్ అయ్యారు.

హెచ్‌ సీయూలో నిర్వ‌హించాల‌నుకుంటున్న చ‌లో హెచ్‌ సీయూను అడ్డుకునేందుకు పోలీసుల్ని భారీగా మొహ‌రించారు. క‌ళాశాల ఐడీ కార్డులు ఉన్న వారిని మాత్ర‌మే లోప‌ల‌కు అనుమ‌తిస్తున్నారు. బ‌య‌ట వారిని ఎట్టి ప‌రిస్థితుల్లోనూ వ‌ర్సిటీ క్యాంప‌స్ లోకి అనుమ‌తించ‌మ‌ని పోలీసులు తేల్చి చెబుతున్నారు. తాజాగా చోటు చేసుకుంటున్న ప‌ర‌ణామాలు చూస్తే చ‌లో హెచ్‌సీయూకు చెక్ పెట్టేలా వ్య‌వ‌హ‌రించాల‌న్న‌ది పోలీసుల ఆలోచ‌న‌గా చెబుతున్నారు. మ‌రి.. ఈ నిర్ణ‌యం క్యాంప‌స్ లో మ‌రెన్ని ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు దారి తీస్తాయో చూడాలి.
Tags:    

Similar News