జ‌గ‌న్‌కు షాక్ ఇచ్చిన పోలీసులు

Update: 2015-09-23 17:24 GMT
ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలంటూ వైకాపా అధినేత వైఎస్‌ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ఈ నెల 26న గుంటూరులో నిర్వ‌హించ‌నున్న నిర‌వ‌ధిక దీక్ష‌కు పోలీసులు అనుమ‌తి నిరాక‌రించారు. దీక్షా ప్రాంగణానికి దగ్గరలో విద్యా సంస్థలు, ఆస్పత్రి ఉండడంతో పర్మిషన్‌ ఇవ్వలేమని పోలీసుల‌కు వైకాపా నేత‌ల‌కు స్ప‌ష్టం చేశారు. బుధ‌వారం దీక్షా ప్రాంగణంలోకి భారీగా చేరుకున్న పోలీసులు.. ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని వారికి సూచించారు. పోలీసుల తీరుపై  వైకాపా నేతలు మండిపడ్డారు. దీక్షపై ఎస్పీకి ఎప్పుడో సమాచారమిచ్చామని తీరా ఏర్పాట్లు మొదలు పెట్టాక అనుమతి నిరాకరించడమేంటని ప్రశ్నించారు.

ఈ నెల 26 నుంచి ప్ర‌త్యేక హోదా కోసం దీక్ష చేయాల‌ని జ‌గ‌న్ నిర్ణ‌యం తీసుకోవ‌డంతో వైకాపా నేత‌లు అందుకు వేదిక‌గా గుంటూరు ప‌ట్ట‌ణంలోని ఏసీ క‌ళాశాల ప్రాంగ‌ణం ఎదురుగా ఉన్న మైదానాన్ని ఎంపిక చేసుకున్నారు. వైకాపా నాయ‌కుడు బొత్స స‌త్య‌నారాయ‌ణ ఆధ్వ‌ర్యంలో ఇక్క‌డ దీక్ష‌కు సంబంధించి ప్ర‌త్యేక భూమి పూజ కూడా చేశారు. ఇప్పుడు అక్క‌డ ఏర్ప‌ట్లు కూడా ముమ్మ‌రంగా జ‌రుగుతున్నాయి. 80 శాతం ప‌నులు కూడా పూర్త‌య్యాయి. ఈ నేప‌థ్యంలో పోలీసులు జ‌గ‌న్‌కు అనూహ్యంగా షాక్ ఇచ్చారు. పైన చెప్పిన రెండు కార‌ణాల‌తో పాటు  ట్రాఫిక్ స‌మ‌స్య దృష్ట్యా ఇక్క‌డ దీక్ష చేప‌ట్ట‌డం కుద‌ర‌ద‌ని పోలీసులు చెపుతున్నారు.

 పోలీసులు జ‌గ‌న్ దీక్ష‌కు అనుమ‌తి నిరాక‌రించ‌డంతో వైకాపా నేత‌లు మండిప‌డుతున్నారు. ప్ర‌త్యేక హోదా గురించి ప్ర‌జ‌ల్లో నిర‌స‌న పెరుగుతోంద‌ని అందుకే ప్ర‌భుత్వం జ‌గ‌న్ దీక్ష చేయ‌కుండా కుట్ర‌లు ప‌న్నుతోంద‌ని వారు విమ‌ర్శిస్తున్నారు. అదే అధికార పార్టీ నాయ‌కులు ఇక్క‌డ స‌మావేశాలు పెట్టుకుంటు రాని ట్రాఫిక్ స‌మ‌స్య ప్ర‌తిప‌క్షానికి మాత్ర‌మే వ‌స్తుందా అని వైకాపా నాయ‌కులు ప్ర‌శ్నిస్తున్నారు. పోలీసులు జ‌గ‌న్ దీక్ష‌కు అనుమతి ఇచ్చినా.. ఇవ్వకపోయినా గుంటూరు కలెక్టరేట్‌ దగ్గర జగన్ దీక్ష చేసి తీరుతారని వైకాపా నేత‌లు తేల్చిచెప్పారు. జ‌గ‌న్ దీక్ష‌కు ఏర్పాట్లు దాదాపు పూర్త‌వుతున్న సంద‌ర్భంలో అనుమ‌తులు నిరాక‌రించ‌డంతో వైకాపా నేత‌లు ఏం చేయాలో తెలియ‌క మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతున్నారు. అయితే వైకాపా మాత్రం దీక్ష విష‌యంలో వెన‌క్కి త‌గ్గేలా క‌నిపించ‌డం లేదు.
Tags:    

Similar News