స్పోర్ట్స్‌ కారులో వచ్చిన కుర్రాడితో గుంజీల్లు తీయించిన పోలీసులు..!

Update: 2020-04-28 00:30 GMT
దేశ వ్యాప్తంగా లాక్‌ డౌన్‌ ను చాలా కఠినంగా అమలు చేస్తున్న కారణంగానే కరోనా పాజిటివ్‌ ల సంఖ్య కాస్త తక్కువగా ఉంది. అమెరికాలో లాక్‌ డౌన్‌ ను అమలు చేయక పోవడం వల్ల జరిగిన నష్టం ఏంటో అందరికి తెల్సిందే. అందుకే దేశ వ్యాప్తంగా పోలీసులు చాలా కట్టుదిట్టంగా లాక్‌ డౌన్‌ ను అమలు చేస్తున్నారు. బైక్‌ పై ఒక్కరు.. కారులో ఇద్దరు మాత్రమే వెళ్లాలి. అది కూడా అత్యవసరం అయితేనే అంటూ ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి. ఇటీవల ఇండోర్‌ లో ఒక ఖరీదైన స్పోర్ట్స్‌ కారులో 20 ఏళ్ల సంస్కార్‌ దర్యానీ ఖాళీగా ఉన్న రోడ్డు మీద జెట్‌ స్పీడ్‌ తో దూసుకు పోతున్నాడు.

రోడ్డుపై విధులు నిర్వహిస్తున్న పోలీసు కానిస్టేబుల్‌ అతడి కారును ఆపేశాడు. లాక్‌ డౌన్‌ లో జల్సాగా తిరిగేందుకు వెళ్తున్నావా అంటూ అతడిని దించి గుంజీల్లు తీయించాడు. మాస్క్‌ పెట్టుకోకుండా కనీసం జాగ్రత్తలు తీసుకోకుండా ఏంటీ ఈ ప్రయాణం అంటూ కానిస్టేబుల్‌ అతడితో చేయించిన గుంజీల్ల వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. దాంతో అంతా కూడా ఆ కానిస్టేబుల్‌ ఘట్స్‌కు హ్యాట్సాప్‌ చెప్పారు. కట్‌ చేస్తే ఇప్పుడు ఆ కానిస్టేబుల్‌ కష్టాల్లో పడ్డాడు.

సంస్కార్‌ దర్యానీ ప్రముఖ వ్యాపారవేత్త కుమారుడు. ఆయన తన వ్యాపార అవసరాల నిమిత్తం బయట తిరిగేందుకు పోలీసుల వద్ద అనుమతి తీసుకున్నాడట. అందుకు సంబంధించిన పాస్‌ లు కూడా ఉన్నాయట. దర్యానీ పాస్‌ లు చూపించేందుకు ప్రయత్నించినా.. తన గురించి చెప్పేందుకు చూసినా కూడా సదరు కానిస్టేబుల్‌ పట్టించుకోలేదు అంటూ సంస్కార్‌ దర్యానీ తండ్రి ఇండోర్‌ డీఐజీకి ఫిర్యాదు చేశాడట. ఓవర్‌ యాక్షన్‌ చేసిన ఆ కానిస్టేబుల్‌ పై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే అంటూ ఆయన డిమాండ్‌ చేశాడు.

ఆ కుర్రాడు కూడా తనను కానిస్టేబుల్‌ చాలా అసహ్యంగా మాట్లాడాడు అని.. ఎంతగా విజ్ఞప్తి చేసినా కూడా వినిపించుకోకుండా నా పరువుకు భంగం కలిగించాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరి ఈ విషయమై పోలీసు శాఖ ఎలాంటి చర్యలు తీసుకుంటుందా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Tags:    

Similar News