బాబు రాజ్యంలో విలేకరిని అలా ఈడ్చుకెళ్లారా?

Update: 2015-09-29 15:28 GMT
మీడియా ప్రతినిధుల పట్ల పోలీసులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించటం కొత్తేం కాదు. మిగిలిన పార్టీల ప్రభుత్వాల కంటే చంద్రబాబు సర్కారు ఉన్న సమయంలో విలేకరులకు కాస్తంత మంచి రోజులు ఉండేవన్న మాట వినిపించేది. ఎందుకంటే.. మీడియాలో వచ్చిన వార్తల విషయంలో చంద్రబాబు చురుగ్గా స్పందించటం.. దానికి గురించి ఫాలో అప్ చేయటం.. లాంటి చర్యలతో మీడియా ప్రతినిధులు అంటే పోలీసులు కాస్త జాగ్రత్తగా ఉండేవారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యారో.. అప్పటి నుంచో లెక్కలో తేడా వచ్చేసింది. నా ఇష్టం వచ్చింది చేస్తా.. ఏం చేస్తావో చేసుకో అన్నట్లుగా దురుసుగా సమాధానం చెప్పే పరిస్థితి. మీడియాలో వచ్చిన కథనాల విషయంలో వైఎస్ నిర్లక్ష్యంగా వ్యవహరించటం.. పెద్దగా పట్టించుకోకపోవటం పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరించే పరిస్థితి ఏర్పడిందన్న విమర్శలు వెల్లువెత్తేవి.

నిజానికి పోలీసుల ఓవర్ యాక్షన్ కు మీడియా ప్రతినిధులు మాత్రమే కాదు.. విపక్ష నేతగా ఉన్న చంద్రబాబు లాంటి నేతకు సైతం తిప్పలు తప్పలేదు. ఈ కారణంతోనే అప్పుడప్పుడు సహనం నశించి.. ఏయ్ పోలీస్ ఓవర్ యాక్షన్ చేయొద్దు.. మా పాలన వస్తుంది.. అప్పుడు ఇబ్బంది పడతావ్ అంటూ ఒక్కోసారి చంద్రబాబే అగ్రహం వ్యక్తం చేసేవారు.

ఇన్న డక్కా మొక్కీలు తిన్న బాబు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పోలీసుల తీరు మారని పరిస్థితి. మంగళవారం పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్లలో ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి తనయుడి కార్యక్రమంలో విలేకరుల పట్ల పోలీసులు అనుసరించిన వైఖరి తీవ్ర విమర్శలకు తావిచ్చింది. ఒక విలేకరిపై ఓవర్ యాక్షన్ చేసిన పోలీసులు కొట్టుకుంటూ.. ఈడ్చుకు వెళ్లటం వివాదస్పదంగా మారింది.

పోలీసుల వైఖరికి మీడియా ప్రతినిధులు తీవ్ర నిరసన వ్యక్తం చేసి.. ఆందోళన చేయటంతో అక్కడే ఉన్న డిఫ్యూటీ సీఎం.. హోం మంత్రి చినరాజప్ప కలుగజేసుకొని.. దురుసుగా వ్యవహరించిన సదరు సీఐపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వటంతో  వివాదం సర్దుమణిగింది. ఏమైనా పోలీసుల దురుసు వైఖరి బాబు రాజ్యంలో అయినా తగ్గుతుందన్న ఆశ నిరాశ అయ్యేటట్లు కనిపిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Tags:    

Similar News