అమెరికాను కుదిపేస్తున్న ఫేస్ బుక్ వీడియో

Update: 2016-07-08 11:28 GMT
ఆ వీడియోను చూస్తే షాకవుతారు.. కారు ముందు సీట్లో ఇద్దరుంటారు. ఒకరు డ్రైవింగ్ సీట్లో, ఇంకొకరు ఆ పక్క సీట్లో. డ్రైవింగు సీట్లోని  వ్యక్తికి ఒళ్లంతా రక్తం.. పక్కనే కారు విండోలోంచి తుపాకీతో బెదిరిస్తున్న పోలీస్. గాయపడిన వ్యక్తి ఆ పోలీసును ప్రాథేయపడుతుంటాడు. ''సార్.. సార్... వద్దు సార్.. ఇప్పటికే నాలుగుసార్లు కాల్చారు. చచ్చిపోతాను సార్.. వద్దు సార్.. " అంటూ బతిమాలుతుంటాడు. వెనుక సీట్లోంచి ఆయన కుమార్తె ఏడుస్తూ ఉంటుంది. పక్క సీట్లోని గర్ల్ ఫ్రెండ్ భయంతో బిక్కచచ్చిపోయి ఉంటుంది. ఈ వీడియో ఇప్పుడు అమెరికాను కుదిపేస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక అసలు విషయానికొస్తే.. కారులో ఉన్న మహిళ పేరు డైమండ్ రెనాల్డ్స్... బాయ్ ఫ్రెండ్ ఫిలాండో కాస్టిలే, నాలుగేళ్ల కూతురుతో కలిసి కారులో వెళ్తోంది. ఫిలాండోయే డ్రైవింగ్ చేస్తున్నాడు. అంతలోనే పోలీసు కారు ఒకటి సర్రును దూసుకొచ్చి అడ్డంగా ఆగుతుంది. అందులోంచి పోలీస్ ఆఫీసర్ దిగి విండోలోంచి తుపాకీ గురిపెట్టి ఫిలాండోను కిందకు దిగమని అడుగుతాడు.. కాస్టిలే ఏదో చెబుతుండగానే... పోలీసు అధికారి అతణ్ని నాలుగు సార్లు కాల్చేస్తాడు.

అక్కడి నుంచే ట్విస్టు మొదలైంది... పోలీసు కాల్చేవరకు చాలా ఆందోళన చెందిన రేనాల్డ్స్ ఆ తరువాత ఆ అకృత్యాన్ని ప్రపంచానికి చెప్పడానికి వెంటనే ఫేస్ బుక్ లైవ్ వీడియో స్ట్రీమింగ్ ను ఆన్ చేసింది. తన బాయ్ ఫ్రెండును చంపొద్దంటూ పోలీసును వేడుకుంది. నాలుగుసార్లు కాల్చారు సారు.. ఇక ఆపండి సార్ అంటూ ఏడ్చింది. ఆమె నాలుగేళ్ల కుమార్తె కూడా భయంతో తల్లిని గట్టిగా పట్టేసి ఏడుస్తుంది.

దీంతో పోలీసుల దారుణం ప్రపంచానికి తెలిసిపోయింది. ఆ వీడియో సాక్ష్యంగా నిలిచింది. వెంటనే ప్రపంచమంతా పాకిపోయింది. అమెరికాలోని చానల్సన్నీ ఆ వీడియోను ప్రసారం చేశాయి. రేనాల్డ్సు నల్ల జాతీయురాలు కావడంతో ఆమెకు జరిగిన అన్యాయంపై అమెరికాలోని నల్లజాతీయులు ఆగ్రహించారు. అమెరికా అంతటా నిన్నటి నుంచి దీనిపై ప్రదర్శనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా డల్లాస్ నగరం ఆందోళనలతో అట్టుడుకుతోంది. నల్లజాతీయుల దాడుల్లో నలుగురు పోలీస్ అధికారులు మరణించారు కూడా.
Full View

Tags:    

Similar News