మా ఊర్లోకి రాజకీయ నాయ‌కుల‌కు ప్ర‌వేశం లేదు!

Update: 2017-05-22 09:50 GMT
సొంత రాష్ట్రమైన గుజ‌రాత్‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ మూడు రోజుల ప‌ర్య‌ట‌న‌కు సిద్ధ‌మై రాష్ట్రంలో అడుగు పెడుతున్న సంద‌ర్భంలోనే అనూహ్య‌మైన నిర‌స‌న ఒక‌టి తెర‌మీద‌కు వ‌చ్చింది. బీజేపీ ప్ర‌భుత్వం, స్థానిక నాయ‌క‌త్వం త‌మ‌కు ఎలాంటి సంక్షేమ కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌క‌పోవ‌డాన్ని నిరసిస్తూ గుజ‌రాత్‌లోని వల్సాద్‌ జిల్లా గోర్గం గ్రామం తీసుకున్న నిర్ణ‌యం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. ఇంత‌కీ వారేం చేశారంటే... రాజకీయ నాయ‌కులు మా గ్రామంలోకి రావ‌ద్ద‌ని బోర్డు పెట్టేశారు. అయితే అందులో ఒక తిర‌కాసు కూడా ఉంచారు.

గోర్గం గ్రామం అనేక స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌తం అవుతోంది ఈ క్ర‌మంలో స్థానిక నాయ‌క‌త్వం వాటిని ప‌రిష్క‌రించ‌లేక‌పోయింది. ఎన్నో సంద‌ర్భాల్లో త‌మ ఆవేద‌న‌ను వెళ్ల‌డించిన‌ప్ప‌టికీ ఫ‌లితం లేక‌పోయింది. దీంతో విసిగి వేసారిన గోర్గం వాసులు త‌మ గ్రామంలోకి రాజకీయ నాయకులకు ప్రవేశం లేదని గ్రామం ప్రారంభంలో ఒక నోటీసు బోర్డును పెట్టేశారు. అయితే చిన్న‌మిన‌హాయింపు ఇచ్చారు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి రావ‌చ్చ‌ని తెలిపారు. వారు తప్ప మరే ఇతర రాజకీయనాయకుడు గ్రామంలోకి రావడానికి వీల్లేదని ఆ బోర్డుపై రాశారు. గ్రామాభివృద్ధికి రాజకీయ నేతలెవరూ ఎలాంటి చర్యలు చేపట్టని కారణంగా వారిని గ్రామంలోకి రానీయకూడదని నిర్ణయించుకున్నామ‌ని గ్రామ‌స్తులు తెలియ‌జెప్పారు.
Tags:    

Similar News