రాజకీయాల్లో ఆ లెక్కలు.. ఆ సమీకరణాలు ఎన్టీఆర్ కే సాధ్యం

Update: 2022-05-28 07:30 GMT
తెలుగు రాజకీయాల రూపురేఖల్ని పూర్తిగా మార్చేసిన క్రెడిట్ ఎన్టీఆర్ ది మాత్రమే. అప్పటివరకు ఉన్న స్టీరియో ఫోనిక్ రాజకీయాల్ని చీల్చి చెండాడేసి.. సామాన్యులు సైతం రాజకీయాల్లోకి వచ్చేలా చేయటమే కాదు.. వారిని ఎన్నికల కురుక్షేత్రంలో గెలిపించిన సత్తా ఎన్టీఆర్ సొంతం. తన పార్టీ అభ్యర్థుల విషయంలో ఎన్టీఆర్ ఎంపిక వినూత్నంగా సాగేది.

ఇప్పటి మాదిరి.. డబ్బులతో రాజకీయాల కంటే కూడా కొత్త రక్తాన్ని రాజకీయాల్లోకి తీసుకురావాలన్న తపన ఎన్టీఆర్ లో కనిపించేది. ఇవాల్టి రోజున మొనగాళ్లుగా చెప్పుకునే తెలుగు అధినేతలంతా ఎన్టీఆర్ పార్టీ పిల్లకాయలే. తెలంగాణ రాష్ట్రంలో తిరుగులేని రాజకీయ అధినేతగా కీర్తిస్తున్న కేసీఆర్.. ఎన్టీఆర్ పిల్లగాడే. ఆ మహానేత మీద ఉన్న అభిమానంతో తన కొడుక్కి తారక రామారావు (కేటీఆర్) పేరు పెట్టుకొని తన అభిమానాన్ని చాటుకున్నారు.

పార్టీ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఎన్టీఆర్ తీరు విలక్షణంగా.. వినూత్నంగా ఉండేది. యువత.. పట్టభద్రులకు ప్రాధాన్యత ఇవ్వటంతో పాటు.. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ప్రజల్లో పట్టున్న కుటుంబాలకు చెందిన వారిని ఆయన ఎంపిక చేసేవారు. ప్రజల్లో ఎవరికి పట్టు ఉందనే ఆరా తీసి.. అలాంటి వారికి పిలిచి మరీ టికెట్లు ఇచ్చేవారు. ఈ క్రమంలో సామాజిక న్యాయాన్ని పాటించటమే కాదు.. వెనుకబడిన వర్గాల్ని పెద్ద ఎత్తున పార్టీలోకి తెచ్చి.. రాజకీయ నేతలుగా మార్చిన క్రెడిట్ ఎన్టీఆర్ దే.

తొలిసారి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 289 స్థానాల్లో పోటీ చేసింది. అందులో 28 మంది పోస్టు గ్రాడ్యుయేట్లు.. 20 మంది వైద్యులు.. 47 మంది న్యాయవాదులు.. ఎనిమిది మంది ఇంజినీర్లతో సహా మొత్తం 125 మంది పట్టభద్రులు ఉన్నారు.

అభ్యర్థుల సగటు వయసు 41 ఏళ్లు కాగా.. నాటి కాంగ్రెస్ అభ్యర్థుల సగటు వయసు 50 ఏళ్లు. తెలుగు రాజకీయాల్ని పూర్తిగా మార్చేసిన క్రెడిట్ ఎన్టీఆర్ దే. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తొమ్మిది నెలల్లోనే 90 ఏళ్లకు పైనే రాజకీయ అనుభవం ఉన్న కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించారు.

ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎదుర్కొన్న మొదటి ఎన్నికల ఫలితం 1983 జనవరి 7 మధ్యాహ్నం వెల్లడైంది. తెలుగుదేశం పార్టీకి 199సీట్లు రాగా కాంగ్రెస్ 60 సీట్లకు పరిమితం కాగా.. సీపీఐ 4, సీపీఎం 5, బీజేపీ 3 సీట్లు గెలుచుకున్నాయి. కేవలం తొమ్మిది నెలల వయసున్న తెలుగుదేశం చేతిలో దేశంలోనే తిరుగులేని రాజకీయ అధిక్యతను ప్రదర్శించే కాంగ్రెస్ ను చిత్తుచిత్తుగా ఓడించిన ఘనత ఎన్టీఆర్ కు దక్కింది.
Tags:    

Similar News