కొత్త చర్చ: పోసాని ప్రెస్ మీట్ వెన్యూ మారిందెందుకు?

Update: 2021-09-29 05:30 GMT
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చేసిన ఘాటు వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చేందుకు సోమవారం తన నివాసంలో ప్రెస్ మీట్ పెట్టిన పోసాని క్రిష్ణ మూరళి వ్యాఖ్యలు సంచలనంగా మారటం తెలిసిందే. పవన్ కల్యాణ్ అభిమానులు.. జనసైనికులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన ఆయన మాటలకు కొనసాగింపుగా.. మంగళవారం పెట్టిన ప్రెస్ మీట్ పరాకాష్టకు చేరుకోవటమే కాదు.. మరీ ఇంత గలీజుగా మాట్లాడటమా? అంటూ జుగుప్సకు గురయ్యేలా ఆయన మాటల ఉండటం అందరిని విస్తుపోయేలా చేసింది.

ఎంత కోపం ఉంటే మాత్రం? మరెంత ఆవేశం ఉంటే మాత్రం.. విచక్షణ అనే పదార్థం ఒంట్లో లేనట్లుగా మాట్లాడేసిన పోసాని మాటలు ఇప్పుడు తెలుగునాట పెను సంచలనంగా మారాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. పోసాని లైవ్ లో మాట్లాడుతున్న వేళ.. ఆయన్ను అభిమానించే వారు అనే కంటే కూడా జనసేన పార్టీకి చెందిన యూత్ విభాగానికి చెందిన వారు ప్రెస్ క్లబ్ కు చేరుకున్నారు. పోసాని మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేసే ప్రయత్నం చేయటం.. అప్పటికే పోలీసులు ప్రెస్ క్లబ్ వద్ద పహరా కాస్తూ వారిని అదుపులోకి తీసుకోవటం.. టీవీ స్క్రోలింగుల్లో పవన్ అభిమానులు తీవ్ర ఆగ్రహం.. ఉద్రిక్త పరిస్థితి అని కొందరు.. పోసానిపై దాడికి యత్నం అంటూ మరికొందరు అత్యుత్సాహాన్ని ప్రదర్శించేశారు.

అయితే.. వీరంతా మిస్ అవుతున్న పాయింట్ ఏమంటే.. మొదటి రోజు ఇంట్లో ప్రెస్ మీట్  పెట్టిన పోసాని.. రెండోరోజున మాత్రం అందుకు భిన్నంగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు ఎందుకు వచ్చినట్లు? అక్కడే ప్రెస్ మీట్ ఎందుకు పెట్టినట్లు? అన్న ప్రశ్నలకు సమాధానాలు వెతికితే ఆసక్తికర అంశాలు బయటకు వస్తాయంటున్నారు. మొదటిరోజు మీడియా భేటీ నిర్వహించినప్పుడు కూడా పోసానివ్యాఖ్యల్ని లైవ్ లో చూపించాయి టీవీ చానళ్లు. కానీ.. ఆ రోజున మాట్లాడిన మాటలపైనా పవన్ ఫ్యాన్స్ తీవ్ర  ఆగ్రహాం వ్యక్తమైనప్పటికీ ఎలాంటి రచ్చ కాలేదు.

కానీ.. రెండో రోజు అంటే నిన్న సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మాత్రం అభిమానులు అక్కడకు చేరుకోవటం తెలిసిందే. మొదటి రోజున రియాక్టు కానీ అభిమానులు రెండోరోజున రియాక్టు అయ్యారా? అన్న డౌట్ వస్తుంది. కానీ..కాసింత లోతుగా విషయాన్ని చూస్తే.. పవన్ ఫ్యాన్స్ ను లేదంటే జనసైనికుల్ని రెచ్చగొట్టే ప్రయత్నంలో భాగంగానే పోసాని కావాలనే ప్రెస్ క్లబ్ కు రెండో రోజు తన మీడియా భేటీ వెన్యూను మార్చినట్లుగా చెబుతున్నారు. పోసాని నివాసం.. ఐటీ కారిడార్ లోని ఒక విలాసవంతమైన హై సెక్యురిటీ ఉండే ఒక బహుళ అంతస్తుల సముదాయంలో.

అలాంటి చోట ప్రెస్ మీట్ పెట్టి ఎన్ని మాట్లాడినా.. అక్కడకు వచ్చి నిరసన చేపట్టం కాస్త కష్టమైన పని. అందుకే..రెండో రోజున తన మాటలకు స్పందన చూపించటంతో పాటు..నిరసన వ్యక్తం చేయటానికి వచ్చినోళ్లను దాడికి యత్నించినట్లుగా ఆరోపించేందుకు అవకాశాన్ని మిస్ కాకుండా ఉండటం.. మరింత హాట్ హాట్ గా సన్నివేశాన్ని మార్చే ప్రయత్నంలోనే.. ఇంటి వెన్యూను ప్రెస్ క్లబ్ కు మార్చినట్లుగా చెబుతున్నారు. 
Tags:    

Similar News