పీఆర్సీ ఉద్యమం: సగటు జీవికి ఒళ్లు మండితే ఇలానే చేస్తాడు

Update: 2022-02-03 09:30 GMT
బెజవాడ జనసంద్రమైంది. జగన్ సర్కారుకు తామేమిటో చెప్పాలని డిసైడ్ అయిన ప్రభుత్వ ఉద్యోగులు.. కొత్త పీఆర్సీకి వ్యతిరేకంగా వ్యవహరించిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలోనూ.. వాట్సాప్ గ్రూపుల్లోనూ పెద్ద ఎత్తున వైరల్ గా మారుతున్నాయి. వస్తున్న జీతాలకు అదనంగా ఇవ్వకపోతే ఇవ్వకపోయారు. కొత్త జీతాలంటూ పాత జీతాలకు కోత పెడితే ఎవరు మాత్రం ఊరుకుంటారు? ఇప్పుడు ఏపీ ఉద్యోగుల పరిస్థితి కూడా అలానే ఉంది.

ఉద్యోగ సంఘాలు.. ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పటివరకు తమ ఆవేదనను ప్రభుత్వానికి తెలియజేసి.. వారి మైండ్ సెట్ ను మార్చాలని చేసిన ప్రయత్నాలు విఫలం కావటం.. ఎట్టకేలకు ఫిబ్రవరి 3న విజయవాడలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వం ప్రకటించిన కొత్త పీఆర్సీ నిర్ణయానికి వ్యతిరేకంగా చేపట్టనున్న భారీ ధర్నా.. నిరసన కార్యక్రమానికి హాజరు కావటానికి తమ వంతు ప్రయత్నంగా ఉద్యోగులు చేసిన చిత్ర విచిత్రాలెన్నో.

మిగిలిన వారి సంగతి ఎలా ఉన్నా.. నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు మండలానికి చెందిన ఒక టీచర్.. పీఆర్సీ ఉద్యమానికి వ్యతిరేకంగా నిర్వహించే నిరసన ర్యాలీలో పాల్గొనేందుకు.. రైల్వే స్టేషన్ కు పోలియో రోగి మాదిరి తయారై.. అక్కడున్న పోలీసుల కళ్లు గప్పి రైలు ఎక్కిన తీరు.. ఆ సందర్భంగా అక్కడి వారు తీసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

ఈ ఉద్యోగి కమిట్ మెంట్.. ప్రభుత్వం తీరు పట్ల తనకున్న నిరసనను తెలియజేయటానికి ఎంత శ్రమకు ఓర్చారో.. మరెంత సాహసానికి తెర తీశారనటానికి నిదర్శనంగా ఈ వీడియోను చెప్పొచ్చు. ఇప్పటికే ఏపీ ఉద్యోగులతో బెజవాడ జనసంద్రంగా మారిన వేళ.. ఉద్యోగులు తమ కడుపు మంటను జగన్ సర్కారుకు అర్థమయ్యేలా చేయటం కోసం పడిన శ్రమ కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తోంది. ఏమైనా.. పీఆర్సీ ఉద్యమ చరిత్రలో అలా నిలిచిపోయే వీడియోల్లో ఇదొకటిగా చెప్పక తప్పదు.




Full View


Tags:    

Similar News