హెచ్ 1బీ ప్రీమియం ప్రాసెసింగ్ తాత్కాలిక‌ ర‌ద్దు!

Update: 2018-03-21 09:02 GMT
అమెరికాలో ఉద్యోగం చేయాల‌నుకునే మిగ‌తా దేశాల వారికి హెచ్ 1 బీ వీసా ఎంతో కీల‌క‌మైనది. అమెరికాలోని వివిధ కంపెనీల‌లో ప‌నిచేసే వారి కోసం ప్ర‌తి ఏటా దాదాపు 65 వేల హెచ్ 1 బీ వీసాల‌ను అమెరికా ప్ర‌భుత్వం జారీ చేస్తుంది. అమెరికాలో ప‌నిచేయాల‌నుకునే వివిధ దేశాల వారు హెచ్ 1 బీ వీసా కోసం పోటీ ప‌డుతుంటారు. ఈ వీసాల ద్వారా భార‌తీయ ఐటీ రంగానికి చెందిన చాలా మంది అమెరికా వెళుతుంటారు. తాజాగా, 2019 సంవ‌త్స‌రానికి గానూ హెచ్ 1 బీ వీసాల ద‌రఖాస్తుల‌ను ఏప్రిల్ 2 నుంచి స్వీక‌రించ‌బోతున్నామ‌ని యూఎస్‌ సిటిజెన్‌ షిప్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్‌ (యూఎస్‌ సీఐఎస్‌) బుధ‌వారం ప్రకటించింది. అయితే, హెచ్ 1 బీ వీసాల‌ ప్రీమియం ప్రాసెసింగ్ ను తాత్కాలికంగా నిలిపి వేస్తున్నామ‌ని తెలిపింది. సెప్టెంబ‌రు10 - 2018 వ‌ర‌కు ప్రీమియం ప్రాసెసింగ్ స‌స్పెన్స‌న్ ఉంటుంద‌ని తెలిపింది.

హెచ్ 1 బీ వీసాల ప్రాసెసింగ్‌ - ప్రీమియం ప్రాసెసింగ్ ల‌కు క‌లిపి ఎక్కువ స‌మ‌యం తీసుకుంటోంద‌ని, ఆ సమయాన్ని ఆదాచేసేందుకే ప్రీమియం వీసా ప్రాసెసింగ్  ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేశామని ఆ శాఖ తెలిపింది. అందుకే,2019 ఆర్థిక సంవత్సరానికి హెచ్‌1బీ వీసా  ప్రీమియం ప్రాసెసింగ్‌  ప్రక్రియను తాత్కాలికంగా రద్దు చేశామ‌ని తెలిపింది. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పిటిషన్లను ప్రాసెస్ చేయ‌బోతున్నామ‌ని, అందుకే ఆ విధంగా ప్రీమియం ప్రాసెసింగ్ ను రద్దు చేశామ‌ని తెలిపింది. ప్రీమియం ప్రాసెసింగ్ ర‌ద్దుకు, హెచ్1బీ వీసాల దరఖాస్తుల స్వీకరణ కు సంబంధం లేద‌ని తెలిపింది. హెచ్1బీ వీసాల దరఖాస్తులను ఏప్రిల్ 2 నుంచి స్వీక‌రిస్తామ‌ని తెలిపింది.
Tags:    

Similar News