మోడికి మరీ ఇంత మోజు పనికిరాదు

Update: 2021-02-21 15:30 GMT
ప్రదానమంత్రి నరేంద్రమోడికి ప్రైవేటురంగంపై మరీ మోజు పెరిగిపోతోంది. తాజాగా ముఖ్యమంత్రులతో జరిగిన నీతి అయోగ్ సమావేశంలో మోడి మాట్లాడుతు దేశం అభివృద్ధి జరగాలంటే ప్రైవేటీకరణ ఒక్కటే శరణ్యం అని చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. చాలా దేశాల అభివృద్ధిలో ప్రభుత్వం, ప్రైవేటు రంగాల పాత్ర బాగానే కనబడుతుంది. కానీ మనదేశంలో మాత్రం నష్టాలు వస్తున్నాయని, లాభాలు ఆర్జించటంలేదనే కారణంతో ప్రభుత్వ రంగ సంస్ధలన్నింటినీ కేంద్రప్రభుత్వం ప్రైవేటుపరం చేసేస్తోంది.

విచిత్రమేమిటంటే ప్రభుత్వ రంగంలోని సంస్ధలన్నీ ప్రైవేటుపరం కాగానే కొన్ని లాభాల బాట పడ్డాయి. ఇదే సందర్భంలో చాలా సంస్ధలను ప్రైవేటు మ్యానేజ్మెంట్లు కొంత కాలం రన్ చేసి తర్వాత మూసేశాయి. సంస్ధను తీసుకోవటం ద్వారా వచ్చిన భూములను రియల్ ఎస్టేట్ రంగంగా చూసుకుని సదరు భూములను అమ్మేసుకుని ఉద్యోగులను, కార్మికులను గాలికొదిలేశాయి. ఇలాంటి సమయంలో కూడా మోడి అన్నీ రోగాలకు మందు ప్రైవేటీకరణే అని గట్టిగా చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది.

కరోనా వైరస్ కారణంగా దెబ్బతిన్న దేశ ఆర్ధికరంగాన్ని పరుగులు పెట్టించాలంటే ప్రభుత్వ రంగ సంస్ధలను వీలైనంతలో ప్రైవేటుపరం చేసేయాలని చెప్పారు. ఇందుకు అడ్డంకిగా ఉన్న పాతకాలం నాటి చట్టాలను రద్దు చేసి వాటిస్ధానంల కొత్త చట్టాలను చేయాలని కూడా సూచించారు. పాత చట్టాలను రద్దు చేసి వాటిస్ధానంలో కొత్తవి తీసుకొస్తే కానీ దేశం అభివృద్ధి కాదని మోడి అభిప్రాయపడటమే విచిత్రంగా ఉంది. బీజేపీ మొదటినుండి కార్పొరేట్ రంగానికి ఊతమిచ్చేట్లుగా ఉందనే అభిప్రాయం బలపడుతోంది.

పాత చట్టాలను రద్దు చేయటంలో కేంద్రం మాత్రమే కాదని అందుకు రాష్ట్రప్రభుత్వాలు కూడా సిద్ధంగా ఉండాలని పిలుపిచ్చారు. అమల్లో ఉన్న పాత చట్టాలను రాష్ట్రప్రభుత్వాలు గుర్తించి ప్రైవేటుపరం చేయటానికి రెడీగా ఉండాలన్నారు. మోడి తాజా పిలుపు చూస్తుంటే అతి తొందరలోనే ప్రభుత్వ రంగం సంస్ధలన్నింటినీ ప్రైవేటుపరం చేసేయబోతున్నట్లు అర్ధమవుతోంది. మ్యాన్యుఫాక్షరింగ్ హబ్ గా దేశం మారాలంటే ప్రైవేటురంగాన్ని ప్రోత్సహించటం ఒకటే మార్గమని మోడి తేల్చి చెప్పేశారు. కాబట్టి ఇపుడు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో మోడి తన మనసులోని మాటను చెప్పేసినట్లేనా ?


Tags:    

Similar News