పబ్.. పామ్ యాప్ డెవలపర్ ఎవరు..?

Update: 2022-04-07 10:30 GMT
హైదరాబాద్ బంజారాహిల్స్ ఫుడింగ్ అండ్ మింక్ పబ్ ఘటన ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనం రేపుతోంది. ర్యాడిసన్ బ్లూప్లాజాలో​ రన్ చేస్తున్న పబ్ లో మత్తు పదార్థాలు సేవిస్తూ పెద్ద ఎత్తున పార్టీ జరుగుతోందని సమాచారం అందడంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈ నెల 3వ తేదీ అర్ధరాత్రి దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే.

పబ్ సమీపంలో ఉన్న డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఈ సందర్భంగా అక్కడున్న యువతీ యువకులు, నిర్వాహకులు మరియు సిబ్బందితో సహా మొత్తం 148 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారిలో మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక - సింగర్ రాహుల్ సిప్లిగంజ్ సహా పలువురు ప్రముఖుల పిల్లలు ఉన్నారు.

తెల్లవారుజామున 3 గంటల సమయంలో వీరందరిని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు.. వారి వివరాలను నమోదు చేసుకుని పంపించారు. ప్రస్తుతం పబ్ కేసు విచారణ కొనసాగుతోంది. ఇందులో రాజకీయ సినీ రంగ ప్రముఖుల పిల్లలు ఉన్న నేపథ్యంలో తీవ్ర ఒత్తిడి వస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ఈ కేసు రాజకీయంగా వివాదంగా మారడంతో తమపై ఎలాంటి ఆరోపణలు లేకుండా దర్యాప్తు చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే సీసీ పుటీజీ ఆధారంగా ఆ రోజు పబ్ కు 250 మందికి పైగా వచ్చినట్టుగా గుర్తించారు.

అలానే ఈ ఇష్యూలో ఎవరెవరు ఉన్నారు? అక్కడ పబ్ మెంబర్స్ ఎవరు? పబ్ లో పామ్ యాప్ ద్వారా జాయిన్ అయ్యారు? వారు ఎంత మొత్తంలో డిపాజిట్ చేశారు? అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారట. అసలు ఆ యాప్ ని డెవలప్ చేసిన డెవలపర్ ఎవరు? సర్వర్ ఎక్కడ హోస్ట్ చేశారు? అనే వివరాలు తెలుసుకుంటున్నారట.

సర్వర్ ఎక్కడ ఉందో తెలిస్తే అక్కడ మొత్తం డేటా దొరికే అవకాశం ఉంది కాబట్టి.. పోలీసులు ఆ దిశగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారని అంటున్నారు. పబ్ లో పోలీసులు రైడ్ చేసిన సమయంలో డ్రగ్స్ దొరకడం.. పలువురు యువతీ యువకులు మత్తు పదార్థాలను కిటకీల గుండా బయట విసిరేయడంతో.. అసలు డ్రగ్స్ ఎక్కడి నుంచి సరఫరా అవుతున్నాయనే దానిపై విచారణ చేస్తున్నారని తెలుస్తోంది.

సులభంగా డబ్బు సంపాదించడానికి డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని.. పబ్ లో 5 డ్రగ్స్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నట్లు రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు వెల్లడించారు. ప్యాకెట్లలోని తెల్లని పౌడర్ కొకైన్‌ గా తేలిందని.. అది సుమారు 4.64 గ్రాముల బరువు ఉందని తెలిపారు. పబ్ లో ల్యాప్ టాప్ - ప్రింటర్ - ప్యాకింగ్ మెటీరియల్ గుర్తించినట్లు పేర్కొన్నారు. పబ్ మేనేజర్ అనిల్ మరియు ఓనర్ అభిషేక్ లను అరెస్ట్ చేసి.. ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు రిమాండ్‌ రిపోర్ట్ లో పోలీసులు వివరించారు.
Tags:    

Similar News