వేరీజ్ సతీష్ రెడ్డి..జగన్ కోటలో టీడీపీకి షాక్ తప్పదా?

Update: 2020-02-25 18:30 GMT
వైసీపీ అధినేత - ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందులలో విపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీకి త్వరలోనే గట్టి ఎదురు దెబ్బ తప్పదన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఈ వాదనలు నిజమే అయితే... అసలు పులివెందులలో టీడీపీ ఉనికికే ప్రమాదం పొంచి ఉందని కూడా చెప్పక తప్పదు. ఈ వాదనలకు పులివెందుల టీడీపీ సమన్వయకర్త - మాజీ ఎమ్మెల్సీ సతీశ్ రెడ్డి మౌనమే బీజం వేసిందని చెప్పక తప్పదు. సతీష్ రెడ్డి మౌనం - ఆయన పార్టీ మారే అవకాశాలపై గతంలోనే ‘తుపాకీ’ ఓ కథనాన్ని రాసింది. ఇప్పుడు ఆ కథనం నిజమయ్యే దిశగా పులివెందులలో రాజకీయం మారిపోతోందని చెప్పక తప్పదు. ఏళ్లుగా పులివెందులలో గతంలో కాంగ్రెస్ కు, ప్రస్తుతం వైసీపీకి ఎదురొడ్డి నిలిచిన నేతగా సతీష్ రెడ్డికి మంచి పేరు ఉంది. పులివెందులలో గతంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి పైనా - ఆయన మరణం తర్వాత జగన్ పైనా టీడీపీ నుంచి సతీశ్ రెడ్డే బరిలోకి దిగుతూ వస్తున్నారు. అసలు సతీష్ రెడ్డి లేకుంటే... పులివెందులలో టీడీపీ ఎప్పుడో ఖతం అయిపోయేదన్న వాదనలూ లేకపోలేదు. అలాంటి సతీష్ రెడ్డి ఇప్పుడు పార్టీ కార్యక్రమాల్లో కనిపించకపోవడం - వైసీపీలో చేరుతున్నారన్న ప్రచారం జరుగుతున్నా... ఆయన నోరు విప్పకపోవడం చూస్తుంటే... టీడీపీకి త్వరలోనే గట్టి ఎదురు దెబ్బ తప్పదన్న వాదనలకు బలం చేకూరుతోంది.

గత ఎన్నికలలో పులివెందుల నుంచి టీడీపీ అభ్యర్థిగా వైయస్ జగన్ పై పోటీ చేసి ఓటమిపాలైన అనంతరం సతీష్ రెడ్డి అస్సలు బయట కనిపించడమే లేదు. నిత్యం పార్టీ కార్యక్రమాల్లో యమా యాక్టివ్ గా ఉండే సతీష్ రెడ్డి ఉన్నట్టుండా సైలెంట్ కావడం పార్టీ శ్రేణులకు నిజంగానే షాకింగేనని చెప్పాలి. మిగిలిన నియోజకవర్గాలలో ఎన్నికల్లో ఓటమి పాలైన నేతలు మళ్లీ పార్టీ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటున్నారు. ఒక్క పులివెందులలో మాత్రం సతీష్ రెడ్డి పూర్తిగా సైలెంట్ అయిపోయారు. దీంతో ఆయన వైసీపీలో చేరిపోతారా? అన్న దిశగా ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి. 1999 నుంచి 2019 వరకు జరిగిన అన్ని సాధారణ ఎన్నికల్లో పులివెందుల నుంచి టిడిపి అభ్యర్థిగా సతీష్ రెడ్డి పోటీచేశారు. 1999, 2004, 2009 ఎన్నికల్లో వైయస్ రాజశేఖర్ రెడ్డి పైన 2014, 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ పైన పోటీ చేసిన సతీష్ రెడ్డి పులివెందులలో పార్టీకి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తూ వచ్చారు.

పులివెందులలో వైయస్ కుటుంబంతో రాజకీయంగా తలపడుతూ వచ్చిన సతీష్ రెడ్డి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు కూడా ఎదుర్కొన్నారు. నియోజకవర్గంలోని చాలా గ్రామాలలో పోలింగ్ రోజున ఏజెంట్లను కూడా నిలపలేని పరిస్థితి నుంచి ప్రతి గ్రామంలో పార్టీకి క్యాడర్ తయారు చేయడం ద్వారా టీడీపీ అధిష్టానం దృష్టిలో పడ్డారు.2014లో ఓటమిపాలైన సతీష్ రెడ్డిని ప్రోత్సహించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు శాసనసభ్యుల కోటా కింద సతీష్ రెడ్డిని ఎమ్మెల్సీగా ఎంపిక చేసి అనంతరం మండలి డిప్యూటీ చైర్మన్ హోదాను కట్టబెట్టారు. కృష్ణా జలాలను పులివెందులకు తీసుకొచ్చే వరకూ గెడ్డం గీయనని ప్రతిజ్ఞ చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. గండికోట రిజర్వాయర్ నుంచి పులివెందుల నియోజకవర్గం లోని పైడిపాలెం రిజర్వాయర్ కు కృష్ణా జలాలు వచ్చాకే గెడ్డం గీయించుకున్నారు. పులివెందులలో పార్టీ బలోపేతం కోసం తనకు మరోసారి ఎమ్మెల్సీ పదవి కట్టబెడతారని ఆశించారు. అయితే టీడీపీ అధిష్టానం సతీష్ రెడ్డికి మొండి చేయ్యి చూపింది. అయినప్పటికీ పులివెందులలో పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ వచ్చారు.

2019 ఎన్నికల్లో కూడా టిడిపి అధిష్ఠానం సతీష్ రెడ్డి పైనే మరోసారి నమ్మకం ఉంచి పార్టీ అభ్యర్థిగా ఎంపిక చేసింది. కానీ ఆ ఎన్నికల్లో తాను ఓటమి పాలు కావడమే కాక రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రాకపోవడంతో సతీష్ రెడ్డి పూర్తిగా సైలెంట్ అయ్యారు. ఇటీవల చంద్రబాబు కడప పర్యటనకు వస్తే....పార్టీ సమావేశంలో మాత్రమే కనిపించిన సతీష్ రెడ్డి అనంతరం నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశానికి డుమ్మా కొట్టారు. తర్వాత పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా పూర్తిగా మొహం చాటేశారు. దీంతో సతీష్ రెడ్డి టీడీపీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్లు ప్రచారం జోరందుకుంది. సతీష్ రెడ్డి రాజకీయ భవితవ్యంపై వైసీపీ నేతలు భరోసా ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం జరుగుతున్న విషయం సతీష్ రెడ్డి దృష్టికి వెళ్ళినా స్పందించకపోవడంతో పార్టీ క్యాడర్ మరింత సందిగ్ధంలో పడిందట. మొత్తంగా సతీష్ రెడ్డి సైలెన్స్ ఇప్పుడు టీడీపీ గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News