ప్రధాని మోడీతో కలిసి ఐస్ క్రీం తిననున్న సింధు

Update: 2021-08-02 05:47 GMT
ఒలింపిక్స్ ఎప్పుడు జరిగినా.. భారతీయుల నిరాశ ఒకేలా ఉంటుంది. 135 కోట్లకు పైబడి జనాభా ఉన్నప్పటికి విశ్వక్రీడల వేదిక మీద మాత్రం భారత్ కు వచ్చే పతకాలు మాత్రం సింగిల్ డిజిట్ దాటే పరిస్థితి ఉండదు. ఆ మాటకు వస్తే.. రెండు.. మూడు పతకాలు వస్తే అత్యుద్భత ప్రదర్శన అనేసే పరిస్థితి. రియో ఒలింపిక్స్ లో  రజత పతకాన్ని గెలుపొందిన సింధుపై అప్పట్లో వెల్లువెత్తిన ప్రశంసలు అన్ని ఇన్ని కావు. వరుసగా రెండు ఒలింపిక్సస్ లో బ్యాడ్మింటన్ లో పతకాల్ని సొంతం చేసుకున్న అరుదైన రికార్డును సింధు సొంతం చేసుకున్నారు.

ఇదిలా ఉంటే.. తాజాగా పతకాన్ని సొంతం చేసుకున్న వేళ.. సింధు తండ్రి తన ఆనందాన్ని ప్రకటన రూపంలో వెల్లడించారు. కాంస్యం గెలిచిన తన కుమార్తె ప్రధాని మోడీతో కలిసి ఐస్ క్రీం తినటం ఖాయమన్నారు. ప్రధాని మోడీ ఇచ్చిన ప్రోత్సాహాన్ని తాము మర్చిపోలేమన్నారు. చైనా అమ్మాయి బింగ్జియావోపై సింధు తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్నారు. స్వర్ణపోరుకు మిస్ అయిన ఆమె.. మూడో స్థానానికి జరిగిన పోటీలో తన సత్తా చాటారు.

ఒలింపిక్స్ ప్రారంభానికి ముందు ఫిట్ నెస్ కోసం సింధు తనకెంతో ఇష్టమైన ఐస్ క్రీం తినటం మానుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న ప్రధాని మోడీ.. సింధును ఉద్దేశించి.. టోక్యోకు వెళ్లి రాగానే మనిద్దరం కలిసి ఐస్ క్రీం తిందామని ప్రోత్సహించారన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ప్రధాని మోడీ ఆకాంక్షించినట్లుగా సింధు తన అద్భుత ప్రదర్శనతో పతకాన్ని సొంతం చేసుకున్న వేళ.. ప్రధాని చెప్పినట్లే సింధుతో ఐస్ క్రీం తినటం ఖాయమంటున్నారు.

ఇదే విషయాన్ని పీవీ సింధు తండ్రి రమణ చెబుతున్నారు. ‘ప్రధాని ప్రోత్సాహం మరవలేనిది. నువ్వు వెళ్లు. వచ్చిన తర్వాత మనిద్దరం కలిసి ఐస్ క్రీం తిందామని చెప్పారు. సింధు రాగానే ప్రధానిని కలిసి కచ్ఛితంగా ఐస్ క్రీం తింటుంది. వరుసగా ఒలింపిక్స్ లో రెండు పతకాలు గెలిచిన తొలి భారతీయురాలిగా సింధు నిలిచినందుకు సంతోషంగా ఉంది. ఈ దేశానికి పేరు.. కీర్తి పర్తిష్ఠలను తీసుకొచ్చింది. లక్ష్యాన్ని మర్చిపోదు. తనలో కసి ఉంది. ఆటను ఆస్వాదిస్తుంది. ఆమె ఎప్పుడు ఒలింపిక్స్ కు వెళ్లినా పతకం తీసుకొస్తుంది’’ అని ఆమె తండ్రి రమణ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
Tags:    

Similar News