అమ్మ మరణంపై తెరపైకి మరిన్ని క్వశ్చన్లు

Update: 2017-03-03 05:24 GMT
రోజులు గడుస్తున్న కొద్దీ అనుమానాలు మరింత బలపడేలా కొత్త కొత్త క్వశ్చన్లు తెరపైకి వచ్చేస్తున్నాయ్. అమ్మ మృతి సంగతి తర్వాత.. అసలు ఆసుపత్రికి తీసుకురావటానికి ముందే చాలానే జరిగిందన్న సందేహాలకు బలం చేకూరే వాదనలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. అమ్మకు తీవ్ర అనారోగ్యం అని చెప్పినప్పటికీ.. అదేం నిజం కాదని.. అమ్మ కింద పడిపోవటం కారణంగానే దెబ్బలు తగిలిన వైనాన్ని అపోలో ఇచ్చిన డిశ్చార్జ్ సమరీలో ఉన్నట్లుగా అన్నాడీఎంకే నేతలు చెబుతున్న మాటలు కొత్త సందేహాల్ని తెర మీదకు తెస్తున్నాయ్.

అమ్మను అపోలోకు తీసుకురావటానికి ముందు పోయెస్ గార్డెన్ లో ఏం జరిగిందన్న విషయం బయటకు రావాలన్న మాట బలంగా వినిపిస్తోంది.కింద పడిపోవాల్సిన పరిస్థితి అమ్మకు ఎందుకు ఎదురైంది? దానికి బాధ్యులెవరు? పలువురు చెబుతున్నట్లుగా అమ్మ మీద చెయ్యి చేసుకున్నారా? ఆమె మీద దాడి జరిగిందా? అన్నవి ప్రశ్నలుగా మారాయి.

అమ్మకు ఆరోగ్యం బాగోలేదని అపోలోకు అంబులెన్స్ లో తరలించే విషయంలో ఒక డీఎస్పీ కీలకంగా వ్యవహరించినట్లుగా వినిపిస్తోంది. మరి.. ఆ డీఎస్పీ ఎవరు? అమ్మకుబాగోలేదని ఆ డీఎస్పీకి ఎవరు చెప్పారు? అమ్మను తీసుకొచ్చిన అంబులెన్స్ ఎక్కడ? ఎవరిది ఆ అంబులెన్స్? అన్నవి కొత్త ప్రశ్నలుగా మారాయి. అమ్మను ఆసుపత్రిలో చేర్చే వేళ.. ఎవరుసంతకాలు పెట్టారో చెప్పాలని అన్నాడీఎంకే లోని కొందరు నేతలు ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. అమ్మను ఆసుపత్రికి తరలించేసమయంలో అక్కడి సీసీ కెమేరాల్ని ఎందుకు తొలగించాలోకూడా చెప్పాలని అడుగుతున్నారు. ఇదిలా ఉంటే.. అమ్మ డిశ్చార్జ్ సమరీలో అమ్మ కింద పడిపోవటం వల్లే గాయపడినట్లుగా ఎక్కడా లేదన్న వాదనను శశికళ వర్గానికి చెందిన నేతలు వినిపిస్తున్నారు.    

ఇదిలా ఉంటే.. శశికళ వర్గం చేస్తున్న వాదనను తిప్పి కొట్టేలా.. అమ్మను ఆసుపత్రికి తరలించే అంశంపై మరిన్ని సందేహాలు తెర మీదకు వస్తున్నాయి. అంబులెన్స్  కోసం ఎవరు ప్రయత్నాలు చేశారు? ఎన్ని గంటలకు సమాచారం అందించారు? ఎన్ని గంటలకు అంబులెన్స్ వచ్చింది? ఎన్ని గంటలకు పోయెస్ గార్డెన్ లో అంబులెన్స్ బయలుదేరింది? అపోలోకు అమ్మను ఎన్ని గంటలకు తీసుకొచ్చారన్న విషయాలపైనా దృష్టి పెట్టాలన్న వాదన వినిపిస్తోంది. అంతేకాదు అమ్మకు శాంతారాం అనే డాక్టర్ చికిత్స జరిపే వారని.. కానీ.. ఆయన్ను గత ఏడాది మే నుంచి పోయెస్ గార్డెన్ కు అనుమతించటం లేదన్న కొత్త విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఒక ముఖ్యమంత్రికి సంబంధించిన ఇన్ని సందేహాలు వ్యక్తమవుతున్న వేళ.. కేంద్రం ఎందుకు మౌనంగా ఉంటోంది? అన్నది ఒక ప్రశ్న. ఇక.. తాజాగా తెరమీదకు వస్తున్న సందేహాల నేపథ్యంలో అమ్మకు వైద్యం చేసిన ఎయిమ్స్ వైద్యులు కానీ నోరు తెరిస్తే మరెన్నిఅంశాలు బయటకు వస్తాయన్నది ఇప్పుడు ప్రశ్నగా మారిందని చెప్పకతప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News