సైకిల్ ఎక్క‌రంటా.. కాషాయ కండువానే క‌ప్పుకుంటారంటా!

Update: 2021-12-22 17:30 GMT
గ‌త ఎన్నిక‌ల్లో న‌ర్సాపురం నుంచి వైసీపీ ఎంపీగా గెలిచిన ర‌ఘురామ కృష్ణంరాజు ఇత‌ర పార్టీల వైపు చూస్తున్నారు. ఏపీలో వైసీపీ ప్ర‌భుత్వ విధానాలు న‌చ్చ‌క సొంత పార్టీపైనే విమ‌ర్శ‌లు ఆరోప‌ణ‌లు చేస్తూ ఆయ‌న నిత్యం వార్త‌ల్లో ఉంటున్నారు.

సీఎం జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు చేయాలంటూ సీబీఐ కోర్టును ఆశ్ర‌యించి భంగ‌ప‌డ్డ ఆయ‌న ఇప్పుడు హైకోర్టు మెట్లు ఎక్కారు. జ‌గ‌న్‌ను వ‌దిలేదే లేదంటూ ఆయ‌న వ్య‌వ‌హార శైలి ఉంద‌నే అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి. మ‌రోవైపు ఆయ‌న‌పై అన‌ర్హ‌త వేటు వేయాల‌ని వైసీపీ ఎంపీలు లోక్‌స‌భ స్పీక‌ర్‌కు విన‌తి పత్రం కూడా అంద‌జేశారు. కానీ దానిపై ఎలాంటి చ‌ర్య లేదు.

టీడీపీ అనుకుంటే..

వ‌చ్చే ఎన్నిక‌ల కోసం ర‌ఘురామ టీడీపీలో చేర‌తార‌నే ప్ర‌చారం జోరుగా సాగింది. ర‌ఘురామ వెన‌క ఉంది చంద్ర‌బాబేన‌ని ఆయ‌నే అంతా న‌డిపిస్తున్నార‌ని వైసీపీ నేత‌లు విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఇటీవ‌ల తిరుప‌తిలో అమ‌రావ‌తి రైతులు నిర్వ‌హించిన భారీ బ‌హిరంగ స‌భ‌లో రఘురామ పాల్గొన‌డం.. బాబును హ‌త్తుకోవ‌డం చూసి ఆయ‌న టీడీపీలో చేర‌డం ఖాయ‌మైంద‌నే వార్త‌లొచ్చాయి.

కానీ ఆయ‌న మాత్రం టీడీపీ కంటే బీజేపీ వైపే ఉండ‌డం మేల‌ని అనుకుంటున్నార‌ని స‌మాచారం. న‌ర్సాపురం నియోజ‌క‌వ‌ర్గంలో క్ష‌త్రియుల బ‌లం ఎక్కువ‌. అక్క‌డ బీజేపీకి మంచి అవ‌కాశాలే ఉన్నాయి. ఒక‌వేళ వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీ, జ‌న‌సేన‌, టీడీపీ కూట‌మిగా ఏర్ప‌డి పోటీ చేసినా ర‌ఘురామ మ‌రోసారి ఎంపీగా గెల‌వొచ్చు.

అందుకే బీజేపీ..

ఒక‌వేళ తాను టీడీపీలో చేరితే.. పొత్తులో భాగంగా ఈ టికెట్ బీజేపీకి ద‌క్కిదే అది ర‌ఘురామ‌కు రాజ‌కీయంగా న‌ష్టం చేస్తుంది. అందుకే బీజేపీ ర‌ఘురామ వైపు చూస్తున్నార‌న్న వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. మ‌రోవైపు బాబు కూడా ర‌ఘురామ బీజేపీలో చేరితేనే మేల‌ని అన్న‌ట్లు తెలిసింది. ఎందుకంటే జ‌గ‌న్‌పై ర‌ఘురామ మాట‌ల వెన‌క టీడీపీ ఉంద‌ని అనే కంటే.. బీజేపీనే ఉంద‌ని ప్ర‌చారం జ‌ర‌గ‌డం బాబుకు కావాలి. అందుకే ఇటీవ‌ల బాబుతో మాట్లాడిన ర‌ఘురామ‌.. బీజేపీలో చేర‌తాన‌ని చెప్పిన‌ట్లు తెలుస్తోంది.

త్వ‌ర‌లోనే ఆయ‌న త‌న నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించే అవ‌కాశ‌ముంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరితే త‌న‌కు రాష్ట్రంలో కూడా మంచి ప‌ట్టు దొరికే అవ‌కాశం ఉంద‌ని ఆయ‌న భావిస్తున్న‌ట్లు స‌మాచారం. ఈ విష‌యంపై ఇప్ప‌టికే బీజేపీ పెద్ద‌ల‌తో ఆయ‌న ట‌చ్‌లో ఉన్న‌ట్లు తెలిసింది. వాళ్ల హామీ మేర‌కే వైసీపీని, జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని ఆయ‌న విమ‌ర్శిస్తున్నార‌న్న‌ది విశ్లేష‌కుల మాట‌.
Tags:    

Similar News