ఏపీలో 'బాత్రూమ్ ట్యాక్స్'...రఘురామ సంచలన వ్యాఖ్యలు

Update: 2021-09-04 14:30 GMT
ఏపీలో చెత్తపై పన్ను వేయడంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. వైసీపీ ప్రభుత్వం ఎడాపెడా పన్నులు బాదేస్తోందని, సామాన్యులపై పన్నుల భారం నానాటికీ పెరిగిపోతోందని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు.ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ వ్యవహారంపై వైసీపీ రెబల్ ఎంపీ రఘరామకృష్ణరాజు సెటైర్లు వేశారు. చెత్తపై పన్ను వేసిన జగన్...త్వరలో బాత్రూమ్ పన్ను విధించేందుకు ప్లాన్ చేస్తోందని చమత్కరించారు.

వందేళ్ల క్రితం బ్రిటీషు పాలనలో ఫ్లషింగ్ ట్యాక్స్ ఉండేదని, వాష్ రూమ్ ను ఉపయోగించేవారు ఎంత నీరు వాడారో తెలుసుకునేందుకు మీటర్ ఉండేదని, దాని ప్రకారం జనం దగ్గర ట్యాక్స్ వసూలు చేసేవారని రఘురామ గుర్తు చేశారు. బ్రిటిషు వారి తరహాలోనే ఏపీ ప్రభుత్వం కూడా ఫ్లషింగ్ ట్యాక్స్ తరహాలో బాత్రూమ్ ట్యాక్స్ తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారని, తమ ఇళ్లలో రెండు అంతకన్నా ఎక్కువ బాత్రూమ్ లు ఉన్నవారికి ఇబ్బందులు తప్పేలా లేవని సెటైర్లు వేశారు.

ఓ పక్క ప్రతి ఇంట్లో మరుగుదొడ్లుండాలని, బహిరంగ మల విసర్జనను నిర్మూలించాలని ప్రధాని మోడీ స్వచ్ఛ్ భారత్ కు పిలుపునిచ్చారని,
అటువంటి సమయంలో ఒకవేళ ఏపీ ప్రభుత్వం బాత్రూమ్ ట్యాక్స్ విధించే యోచన చేయడం ఏమిటని ప్రశ్నించారు. చెత్తపై, బాత్రూమ్ లపై పన్ను విధించే బదులు ఖజానా నింపుకోవడానికి అనేక మార్గాలున్నాయని రఘురామ అన్నారు. హెలికాప్టర్లు, చార్టర్డ్ విమానాల్లో తిరగడాన్ని జగన్ తగ్గించి డబ్బులు ఆదా చేయాలని అన్నారు.

జగన్ తో సంబంధం ఉన్న 150 కేసులు వాదించేందుకు ఏపీకి వచ్చే సుప్రీం కోర్టు లాయర్లకు ఫీజు చెల్లించే బదులు ఏజీ సేవలు ఉపయోగించుకోవాలని సూచించారు. ఇటీవల ఆస్తిపై పన్ను విధించారని, ఇలా పన్నులు విధించే బదులు సంపదను, ఆదాయాన్ని సృష్టించాలని అన్నారు. ఒకవేళ ఏపీలో బాత్రూమ ట్యాక్స్ వస్తే...అది జాతీయ స్థాయిలో ఏపీ పరువు తీస్తుందని, అటువంటి ఆలోచనలు విరమించుకోవాలని హితవు పలికారు.


Tags:    

Similar News