మేడం కోసం చేద్దాం.. జనం కోసం వద్దు!

Update: 2015-10-19 04:07 GMT
ఏపీ కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి చాలా భిన్నంగా కనిపిస్తోంది. సాధారణంగా ఏ రాజకీయ పార్టీ ఏ పని చేసినా సరే, దాని వలన ప్రజల్లో తమకు కొంత క్రేజ్‌ రావాలని.. తాము చేసిన పనిని ప్రజలు గుర్తించాలని వారిలో కనీసం ఒక వర్గానికైనా తాము చేసిన పని రుచించాలని కోరుకుంటుంది. ఏతావతా ఆ ప్రజలనుంచి ఓట్లను దండుకోవాలనేది రాజకీయ పార్టీల ఆలోచనగా ఎన్నడూ ఉంటుంది. అది వారి మనుగడకు సంబంధించిన విషయం గనుక దాన్ని తప్పుపట్టడానికి కూడా వీల్లేదు.

అయితే ఆంధ్రప్రదేశ్‌ లోని కాంగ్రెస్‌ పార్టీ తీరు మాత్రం అందుకు భిన్నం. వారికి ప్రజల వద్ద తమ పార్టీకి ఎలాంటి గుర్తింపు వస్తుందనే దానితో నిమిత్తం లేదు. మేడం వద్ద తమ నాయకులకు ఎలాంటి గుర్తింపు వస్తుందనేది ఒక్కటే ప్రయారిటీ. కాంగ్రెస్‌ జాతీయ పార్టీ కావడం, పైగా నూటపాతికేళ్ల చరిత్ర ఉన్న పార్టీగా టముకు వేసుకుంటూ బతికేయడం వారికి అలవాటు అయిపోయింది. ఆ పార్టీలో ప్రతి చిన్న విషయాన్నీ అదిష్ఠానం అనుమతితో తప్ప చేయగల దమ్ము వారెవ్వరికీ లేదన్న సంగతి అందరికీ తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఏపీసీసీ చీఫ్‌ రఘువీరా ఆధ్వర్యంలో వారొక వెరైటీ కార్యక్రమం చేపట్టారు. ఆంద్రప్రదేశ్‌ రాజధాని అమరావతి శంకుస్థాపనకు వస్తున్న ప్రధాని నరేంద్రమోడీ.. ఆయన వెంట రాగల వెంకయ్యనాయుడు - ఏపీసీఎం నారా చంద్రబాబునాయుడు మీద చీటింగ్‌ కేసు పెట్టేలా ఏపీలోని పోలీసులు అందరినీ ఆదేశించాలంటూ రాష్ట్ర గవర్నరు నరసింహన్‌ వద్దకెళ్లి మొరపెట్టుకున్నారు. ఎన్నికలకు ముందు.. ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తాం అని ప్రకటనలు చేసి, ఎన్నికల తర్వాత ప్రజల్ని మోసం చేసిన కేసులో వారు ముగ్గురూ ప్రధాన ముద్దాయిలనేది ఆరోపణ. ఈ ముగ్గురి పేర్లురాసి.. రాష్ట్రానికి హోదా రాలేదనే ఆవేదనతో ఆత్మహత్యలు చేసుకున్న వారే అయిదుగురు ఉన్నారని కూడా ఆరోపించారు.

అయినా గవర్నరు ప్రభుత్వ యంత్రాంగంలో ఒక భాగం అయినప్పుడు.. ప్రబుత్వాధినేతలపై కేసులకు ఆయన ఆదేశిస్తారని ఏపీసీసీ నేతలు ఎలా ఆశించారో తెలియదు. దీనివలన ఏం సాధిస్తారో కూడా తెలియదు. పైగా కార్యక్రమం ఘనంగా జరగబోతున్న ప్రస్తుత తరుణంలో.. నిరుపయోగమైన పోలీసు కేసులు వంటి ఉద్యమాన్ని ప్రజలు కూడా హర్షించే పరిస్థితి లేదు. అందుకే ఏపీసీసీ వారు తాము కూడా ఏదోటి చేస్తున్నట్లుగా కనిపించడానికి పడుతున్న యాతన గమనిస్తే.. ప్రజల గుర్తింపు కోసం కాకుండా, మేడం దృష్టిలో పడితేచాలునన్నట్లుగా అర్థమవుతోంది.
Tags:    

Similar News