ఇదెక్కడి చోద్యం.. మోడీ బ్యాచ్ కు ఆ మాత్రం ఐడియా ఉండదా?

Update: 2020-05-15 03:45 GMT
ప్రధాని మోడీ సమర్థత గురించి చాలానే గొప్పలు వినిపిస్తుంటాయి తరచూ. ఆయన చుట్టూ ఉన్న పరివారం చాకుల్లాంటివారని.. ఇట్టే అల్లుకుపోతారని చెబుతుంటారు. దేశం ఎదుర్కొంటున్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో చోటు చేసుకుంటున్న పరిణామాల్ని చూస్తే.. ప్రధాని టీం మీద కొత్త సందేహాలు కలుగక మానదు. జాతిని ఉద్దేశించి తరచూ చేసే ప్రసంగాల్ని పక్కన పెడితే.. వాస్తవంలో జరుగుతున్న దానిపై దేశ ప్రజలు సంతోషంగా లేరని చెప్పాలి. పలు విషయాల్లో కేంద్ర వైఖరి పట్ల పెదవి విరుపు కనిపిస్తోంది.

చూసేందుకు చిన్నగా కనిపించే చాలా విషయాల్లో.. సరైన ప్లానింగ్ లేదన్నది అర్థమవుతోంది. లాక్ డౌన్ వేళ.. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలసకూలీల్ని వారి స్వస్థలాలకు తరలించే విషయంలో మోడీ సర్కారు వైఫల్యాల్ని ఎవరూ మర్చిపోలేరు. లక్షలాది మంది తమ సొంతూళ్లకు వెళ్లేందుకు వందలాది కిలోమీటర్లు చెప్పులు లేకుండా నడుచుకుంటూ వెళ్లిన వైనం కంటతడి పెట్టిస్తోంది.

చాలా ఆలస్యంగా నిద్ర లేచిన కేంద్రం.. శ్రామిక్ రైళ్ల పేరుతో పెయిడ్ సర్వీసును తెర మీదకు తీసుకురావటాన్ని పలువురు తప్పు పట్టటం తెలిసిందే. ఇంతా చేస్తే.. ఆ రైళ్లలో ప్రయాణించిన వారు తమ రాష్ట్రాలకు చేరుకున్న తర్వాత.. తమ సొంతూళ్లకు వెళ్లటానికి రవాణా సౌకర్యం లేక కిందా మీదా పడుతున్నారు. శ్రామిక్ రైళ్లు నడవటం మొదలైన ఇన్ని రోజులకు తాజాగా కేంద్ర హోం శాఖ కీలక ప్రకటన చేసింది.

శ్రామిక్ రైళ్లలో ప్రయాణించే వారు.. తమ రాష్ట్రాలకు చేరిన తర్వాత.. సొంతూళ్లకు వెళ్లేందుకు అవసరమైన బస్సుల్ని నడిపేందుకు రాష్ట్రాలకు అనుమతిని ఇచ్చింది. అయితే.. ఈ వ్యవహారంలో కేంద్ర వైఫల్యాల్ని వేలెత్తి చూపక తప్పదు. ఊళ్లకు వెళ్లాల్సిన వారిని రైళ్లలో ఏదో ఒక ప్రాంతానికి తీసుకెళ్లి వదిలేస్తే సరిపోతుందా? వారిని సొంతూళ్లకు చేర్చే బాధ్యత తమదేనన్న విషయాన్ని మోడీ పరివారం ఎందుకు మిస్ అయినట్లు..? శ్రామిక్ రైళ్లను స్టార్ట్ చేసిన ఇన్నాళ్లకు.. సొంతూళ్లకు చేర్చే కీలక ప్రకటనను ఇప్పుడు చేయటం చూస్తే.. మోడీ బ్యాచ్ ప్లానింగ్ ఎలా ఉందో ఇట్టే అర్థమవుతుందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News