ఆంధ్రా చ‌ల్ల‌బ‌డింది

Update: 2015-06-02 09:13 GMT
గ‌త కొద్దిరోజులుగా మండిప‌డుతున్న సూరీడు.. మ‌బ్బుల చాటుకు వెళ్లిపోయారు. భానుడి భ‌గ‌భ‌గ‌ల‌తో ఆగ‌మాగ‌మైపోతున్న ప్ర‌జ‌ల‌కు సేద తీరిస్తూ.. ద‌ట్ట‌మైన మ‌బ్బులు సూరీడ్ని క‌మ్మేశాయి. అయితే.. ఇదంతా సీమాంధ్ర‌లో మాత్ర‌మే. గ‌త రెండు వారాలుగా రెండు తెలుగురాష్ట్రాల్లో విప‌రీత‌మైన ఎండ‌లు ఏర్ప‌డ‌టం.. ఈ కార‌ణంగా వంద‌లాది మంది పిట్ట‌ల్లా రాలిపోయి.. మృత్యువాత ప‌డ‌టం తెలిసిందే.
దేశంలో మ‌రెక్క‌డా లేని విధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా వేస‌వి వేడిగాలుల‌కు మృతి చెందారు. ఒక అంచ‌నా ప్ర‌కారం ఈ మృతుల సంఖ్య మొత్తంగా రెండు వేల‌కు పైనే ఉంద‌ని అధికారులు చెబుతున్నారు.
ఎండ వేడి ఎప్ప‌టికి త‌గ్గుతుంద‌ని ఆశ‌గా ఎదురుచూస్తున్న ప్ర‌జ‌ల‌కు వ‌రుణుడు క‌రుణించాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏపీలో వాతావ‌ర‌ణం చల్ల‌బ‌డితే.. తెలంగాణ‌లో మాత్రం వేడి తీవ్ర‌త కాస్తంత త‌గ్గింది.

నిపు క‌ణిక మాదిరి మండిపోయిన గుంటూరు.. విజ‌య‌వాడ‌.. త‌దిత‌ర ఆంధ్రాప్రాంతంలో సోమ‌వారం నుంచి వాతావ‌ర‌ణం పూర్తిగా మారిపోయింది. మ‌బ్బులుక‌మ్మేయ‌టంతో ఉష్ణోగ్ర‌త‌లు ఒక్క‌సారిగా ప‌డిపోయాయి. 45 నుంచి 47 డిగ్రీల‌తో సెగ‌లు పుట్టించిన ఎండ తీవ్ర‌త స్థానే.. సోమ‌వారం ప‌గ‌టి ఉష్ణోగ్ర‌త 28 డిగ్రీల‌కు ప‌డిపోవ‌టంతో అక్క‌డి ప్ర‌జ‌లు హాయిగా సేద‌తీరారు. గుంటూరు.. విజ‌య‌వాడ‌.. చుట్టుప‌క్క‌ల ప‌రిస‌రాల‌తో పాటు.. విశాఖ‌ప‌ట్నంలో ఓ మోస్త‌రు వ‌ర్షాలు ప‌డ‌టంతో వాతావ‌ర‌ణం కాస్తంత శాంతించిన‌ట్ల‌యింది. మొత్తంగా నిన్న‌మొన్న‌టి వ‌ర‌కూ విప‌రీత‌మైన వేడి.. ఉక్క‌పోత‌తో ఊపిరి ఎప్పుడు ఆగిపోతుందో తెలీన‌ట్లుగా బాధ ప‌డిన ప్ర‌జ‌ల‌కు చ‌ల్ల‌బ‌డిన వాతావ‌ర‌ణంతో హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు. సీమాంధ్ర‌లో ఈ ప‌రిస్థితి ఉంటే.. తెలంగాణ‌లో మాత్రం ఇంకా ప‌రిస్థితి చోటు చేసుకోలేదు. రానున్న ఒక‌ట్రెండు రోజుల్లో అయినా తెలంగాణ వ్యాప్తంగా వాతావ‌ర‌ణం చ‌ల్ల‌బ‌డితే బాగుండు.
Tags:    

Similar News