రాజ‌న్ కూడా... మోదీని త‌ప్పుబ‌ట్టారే!

Update: 2017-09-03 11:44 GMT
దేశంలో సంచ‌ల‌నం సృష్టించిన నోట్ల ర‌ద్దు విష‌యంపై ఇప్పుడిప్పుడే బాంబుల్లాంటి వార్త‌లు బ‌ద్ద‌ల‌వుతున్నాయి. గ‌త ఏడాది న‌వంబ‌రు 8 నుంచి చ‌లామ‌ణిలో నుంచి తీసేసిన రూ.500 - రూ.1000 నోట్ల‌తో న‌ల్ల‌ధ‌నం వెన‌క్కి వ‌చ్చేస్తుంద‌ని, దేశ భ‌విష్య‌త్తు మారిపోతుంద‌ని ప్ర‌ధాని అప్ప‌ట్లో వెల్ల‌డించి సంచ‌ల‌నం సృష్టించారు. దీంతో దేశం మొత్తం వారాల త‌ర‌బ‌డి బ్యాంకుల ముందు క్యూ క‌ట్టి మ‌రీ పాత నోట్ల‌ను మార్చుకుంది. అయితే, ఈ నోట్ల‌తో ఏదో జ‌రిగిపోతుంద‌ని అనుకున్నా.. ఇప్పుడు మాత్రం ఇది విఫ‌ల‌మైన ప్ర‌యోగ‌మ‌నే వార్త‌లు రావ‌డంతోపాటు ప్ర‌భుత్వం కూడా ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డిపోయింది.

నిజానికి న‌ల్ల‌ధ‌నం భారీ ఎత్తున పోగుప‌డుతుంద‌ని, కేవ‌లం వైట్ మాత్ర‌మే బ్యాంకుల్లోకి వ‌స్తుంద‌ని ప్ర‌భుత్వం లెక్క‌గ‌ట్టింది. కానీ, దీనికి రివ‌ర్స్‌ లో రిజల్ట్ రావ‌డం అంద‌రినీ తీవ్ర ఆగ్ర‌హానికి గురిచేస్తోంది. ఇటీవ‌ల ఈ న‌ల్ల‌ధ‌న విష‌యం స‌హా నోట్ల ర‌ద్దుపై ఆర్‌బీఐ ఓ నివేదిక వెలువ‌రించింది. దీని ప్ర‌కారం 99 శాతం మేర‌కు ర‌ద్ద‌యిన నోట్ల‌న్నీ బ్యాంకుల‌కు చేరిపోయాయి. అంటే కేవ‌లం 1 శాతం మాత్ర‌మే న‌ల్ల‌ధ‌నం లేక లెక్క‌లు వెల్ల‌డించ‌ని ధ‌నం ఉంద‌ని స్ప‌ష్ట‌మైపోయింది. దీనిని విప‌క్షాలు పెద్ద ఎత్తున త‌ప్పుప‌ట్టాయి. కేవ‌లం న‌ల్ల‌ధ‌నాన్ని తెల్ల‌ధ‌నం చేసుకునేందుకే మోదీ ఇలా చేశార‌ని వ్యాఖ్యానించాయి.

ఇప్పుడు మ‌రో అత్యంత ప్ర‌ముఖ‌మైన వ్య‌క్తి - ఆర్బీఐ మాజీ గవర్నర్‌ రఘురాం రాజన్ ఈ నోట్ల ర‌ద్దుపై మ‌రో బాంబు పేల్చారు.  పెద్దనోట్ల రద్దు విషయంలో నరేంద్రమోదీ సర్కారును తాను ముందే హెచ్చరించానని, నోట్ల రద్దు వల్ల కలిగే దీర్ఘకాలిక ప్రయోజనాల కన్నా స్పల్పకాలికంగా జరిగే నష్టమే ఎక్కువ అని తాను చెప్పానని తెలిపారు. నల్లధనాన్ని వెలికితీసేందుకు ఇతర ప్రత్యామ్నాయాలను తాను సూచించానని, అయినా, ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయన చెప్పారు. 'ఐ డూ వాట్‌ ఐ డూ: రిఫార్మ్స్‌ - రెటారిక్‌ - రిజాల్వ్‌' పేరిట రాజన్‌ రాసిన పుస్తకం వచ్చేవారం విడుదల కానుంది. దీనిలో మ‌రిన్ని విష‌యాల‌ను రాజ‌న్ వెల్ల‌డించాడ‌ని అంటున్నారు విశ్లేష‌కులు. దీంతో మోదీ ప్ర‌భుత్వ బండారం బ‌య‌ట‌ప‌డుతుంద‌ని కూడా చెబుతున్నారు. మ‌రి ఏం జరుగుతుందో చూడాలి. 
Tags:    

Similar News