జూనియర్ ఎన్టీఆర్ మాదిరి పెద్ద స్టార్ ను చేస్తారంటూ వర్మ ఎటకారం

Update: 2023-05-12 18:28 GMT
ఏపీలో జగన్ ప్రభుత్వం మళ్లీ కొలువు తీరితే ఆంధ్రప్రదేశ్ ఏదేదో అయిపోతుందంటూ ప్రముఖ ఆర్థిక నిపుణుడిగా కొన్ని మీడియా సంస్థలు అభివర్ణించే జీవీ రావు ఇంటర్వ్యూ సంచలనంగా మారటం తెలిసిందే.

ఇదే ఇంటర్వ్యూను ఒక ప్రముఖ మీడియా సంస్థ తాటికాయంత హెడ్డింగ్ లో అచ్చేయటంతో.. ఆయన మాటలు రాజకీయ దుమారాన్ని రేపాయి. సీఎం జగన్ మీదా.. వైసీపీ సర్కారు మీద ఎవరేమన్నా ఒప్పుకోని వర్మ తాజాగా రంగంలోకి దిగారు.

ట్విటర్ వేదిక మీద ఆయన తనదైన వ్యంగ్యస్త్రాల్ని సంధించారు. ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తూ.. ఉతికి ఆరేసినంత పని చేశారు. జీవీరావును ఒక కమెడియన్ గా చిత్రీకరిస్తూ వివిధ రూపాల్లో ఉన్న ఫోటోల్ని పోస్టు చేశారు.

అదే సమయంలో తన నిజం చానల్ కు జీవీ రావు డిబేట్ కు వస్తారా? అంటూ సవాలు విసిరారు. జూనియర్ ఎన్టీఆర్ అంతటి స్టార్ ను చంద్రబాబు చేస్తారంటూ జీవీ రావును ట్వీట్లతో ఆటాడుకున్నారు.

సంబంధం లేని అంశాల్ని తీసుకొచ్చినట్లుగా తెచ్చి.. చివర్లో వాటంన్నిటికి ముడులు కలిపేసే వర్మ.. జీవీ రావును అదే తరహాలో టార్గెట్ చేశారు. "జీవీ రావు నిన్ను ఆర్థిక నిపుణుడిగా గౌరవిస్తున్న ఫార్టీ ఇయర్స్ కు నీ డాన్స్ టాలెంట్ తెలుసా? ఆయనకున్న ఫిలిం కాంటాక్ట్స్ తో నిన్ను తారక్ రత్న కన్నా పెద్ద స్టార్ చేస్తారు"అంటూ వ్యంగ్యస్త్రాల్ని సంధించారు.

అంతే కాదు మరిన్ని పంచ్ లు వేశారు. "హే.. జీవీ రావు నీకున్న డాన్స్ టాలెంట్ లో పదిశాతం దమ్మున్నా నిజం చానల్ లో ఏపీ ఆర్తిక పరిస్థితి గురించి మాట్లాడటానికి ఇంటర్వ్యూకి రా’ అంటూ వర్మ వేసిన సవాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

నిన్నటికి నిన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి పదవి తనను వరించాలన్న మాటతో పాటు పొత్తుల మీద చేసిన వ్యాఖ్యలపై వర్మ ఇప్పటికే విరుచుకుపడటం తెలిసిందే.

Similar News