రాపాక‌...ప‌వ‌న్‌ కు షాకులు ఇవ్వ‌డం ఆపేలా లేడు

Update: 2019-12-16 14:30 GMT
జనసేన పార్టీ ఏకైక‌ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మ‌రోమారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై ప్ర‌శంస‌లు కురిపించారు. ఇంగ్లీష్ విద్య విషయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధించి...వైఎస్ ఆర్ స‌ర్కారును అభినందించిన రాపాక మ‌ళ్లీ పొగిడారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఎస్సీ - ఎస్టీలకు వేర్వేరు కమిషన్ల ఏర్పాటును ప్ర‌తిపాదించే సంగ‌తి తెలిసిందే. దీనిపై సోమ‌వారం అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ అంశంపై రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మాట్లాడుతూ...ఎస్సీ - ఎస్టీలకు వేర్వేరు కమిషన్లపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నిర్ణయం చారిత్రాత్మకం అని కొనియాడారు.  ఈ విషయంలో ఎటువంటి అభ్యంతరాలు లేకుండా సీఎం జగన్‌ నిర్ణయాన్ని పూర్తిగా సమర్థిస్తున్నానని రాపాక తెలిపారు.

బిల్లుపై చ‌ర్చ‌లో పాల్గొన్న సంద‌ర్భంగా రాపాక వ‌ర‌ప్ర‌సాద్ మాట్లాడుతూ....ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రంలో పేద దళితులు సీఎం వైఎస్‌ జగన్‌ నిర్ణయంతో మరింత అభివృద్ధి చెందుతారని  ఆశాభావం వ్యక్తం చేశారు.ఎస్సీ - ఎస్టీలకు వేర్వేరుగా కమిషన్లు ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం స్వాగతించదగిందని ఆయన అన్నారు. దళితులను సామాజికంగా - ఆర్థికంగా బాగుపర్చాలని వరప్రసాద్‌ అసెంబ్లీలో కోరారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.

గ‌తంలో సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం కూడా చేశారు. కాకినాడలో పవన్ కల్యాణ్ రైతు సమస్యలపై ఒక రోజు నిరాహార దీక్ష చేస్తే... హాజరుకాని రాపాక ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని మాత్రం అసెంబ్లీ వేదిక‌గా స‌మ‌ర్థించ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. రాపాక వైసీపీకి దగ్గరవుతున్నారా అనే సందేహాలు స‌హ‌జంగానే తెర‌మీద‌కు వ‌స్తున్నాయి. ఇటీవల జనసేన అధిష్టానం పట్ల కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. దీనిపై సీరియస్ అయిన పవన్ కళ్యాణ్ రాపాకకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని నిర్ణయించారని ప్ర‌చారం జ‌రిగింది.



Tags:    

Similar News