వైసీపీలో చేరిన జనసేన ఎమ్మెల్యే తనయుడు

Update: 2020-12-04 16:29 GMT
2019 ఎన్నికలలో జనసేన పార్టీ ఘోర పరాభవం పాలైన సంగతి తెలిసిందే. గోరు చుట్టు మీద రోకలిపోటులాగా జనసేన తరఫున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్....గెలిచినప్పటి నుంచి వైసీపీకి పరోక్షంగా మద్దతు పలుకుతున్నారు. అసెంబ్లీ సాక్షిగా సీఎం జగన్ పై పొగడ్తలు గుప్పిస్తున్నారు. ఎన్నికల ముందు వైసీపీ నుంచి జనసేనకు జంప్ అయిన రాపాక వరప్రసాద్....రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీకే ఓటేశానని బహిరంగంగా ప్రకటించే స్థాయికి వెళ్లారు. తనకున్న ఏకైక ఎమ్మెల్యే రాపాకపై వేటు వేస్తో ఉన్న ఒక్క ఎమ్యెల్యే కూడా పోతారన్న భయంతో పవన్ సైలెంట్ అయ్యారు. అయితే, డైరెక్ట్ గా వైసీపీలో చేరే అవకాశం లేకపోవడంతో రాపాక పరోక్షంగా మద్దతు తెలుపుతూ అనధికారికంగా వైసీపీ ఎమ్మెల్యే అన్నరీతిలో వ్యవహరిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే తాజాగా రాపాక వరప్రసాద్‌ కుమారుడు రాపాక వెంకట్‌ రామ్‌ వైసీపీలో చేరారు. వెంకటరామ్‌కు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తన తండ్రి రాపాక వరప్రసాద్, జగన్ ల సమక్షంలోనే వెంకట్ రామ్ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పటికే వల్లభనేని వంశీ, మద్దాలి గిరిలతో పాటు పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు...వైసీపీకి మద్దతు పలికిన సంగతి తెలిసిందే. అయితే, తమ పదవికి రాజీనామా చేసి వస్తేనే వైసీపీలో చేర్చుకుంటానని జగన్ చెప్పడంతో వీరంతా పరోక్షంగా ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్నారు. ఈ క్రమంలో రాపాక...తాను వైసీపీ కండువా కప్పుకోకుండా తన కుమారుడిని వైసీపీలో స్వయంగా చేర్పించారు. ఈ రకంగా వైసీపీకి తన మద్దతు ఉందని మరోసారి బాహాటంగానే రాపాక చెప్పారు. మరి, ఈ వ్యవహారంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏ విధంగా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
Tags:    

Similar News