టీవీ 9లోకి రవిప్రకాశ్ రీ ఎంట్రీ... అయ్యే పనేనా?

Update: 2020-09-14 17:37 GMT
టీవీ 9 మాజీ సీఈఓ రవిప్రకాశ్ గుర్తున్నారుగా. తెలుగు మీడియా రంగంలో పరిచయం అక్కర్లేని వ్యక్తి రవిప్రకాశ్. మీడియా రంగంతో పాటు సామాన్య జనానికి కూడా రవిప్రకాశ్ చిరపరచితులే. అయితే మొన్నామధ్య రవిప్రకాశ్ కు వరుసగా చేదు అనుభవాలు ఎదురయ్యారు. గోడకు కొట్టిన బంతిలా తిరిగొచ్చేసిన చందంలా ఇప్పుడు రవిప్రకాశ్ కూడా టీవీ 9 లోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు సంచలన రీతిలో వ్యూహాలు పన్నుతున్నారు. తన ఆధ్వర్యంలో కొనసాగిన టీవీ 9ను కొత్త యాజమాన్యం నష్టాల్లోకి నెట్టేసిందని, అయితే సంస్థను తిరిగి బతికించగలిగే సత్తా తనకుందని, మెజారిటీ షేర్లన్నింటినీ తాను కొనుగోలు చేస్తానని రవిప్రకాశ్ ఇప్పుడు ఏకంగా నేషనల్ కంపెనీ లా ట్రిబ్యూనల్ (ఎన్సీఎల్పీ)ని ఆశ్రయించారు. తెలుగు నేలలో ఈ పరిణామం సంచలనంగా మారిపోయింది.

తాను స్థాపించిన టీవీ 9 నుంచి రవిప్రకాశ్ ను మైహోం, మేఘా గ్రూపులు బయటకు వెళ్లగొట్టేశారు. అది కూడా అత్యంత అవమానకర రీతిలో. అంతేనా కేసులు కూడా పెట్టేశాయి. కంపెనీ సొమ్మును అక్రమంగా డ్రా చేసుకున్నారంటూ ఆరోపణలు మోపాయి. ఈ క్రమంలో కొంతకాలం పాటు అజ్ఝాతంలోకి వెళ్లిపోయిన రవిప్రకాశ్... ఆ తర్వాత పోలీసుల ఎదుటకు వచ్చారు. న్యాయపరంగానే తనపై నమోదైన కేసులను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు కొత్తగా ఎన్సీఎల్పీలో రవిప్రకాశ్ దాఖలు చేసిన పిటిషన్ ను చూస్తుంటే... టీవీ 9లోకి తను మరోమారు ఎంట్రీ ఇచ్చేందుకు రవిప్రకాశ్ ఉత్సాహం చూపుతున్నట్లుగానే చెప్పుకోవాలి.

ఎన్సీఎల్పీలో దాఖలు చేసిన పిటిషన్ లో రవిప్రకాశ్ పలు కీలక అంశాలను ప్రస్తావించారు. తన హయాంలో నెలకు రూ.6 కోట్ల మేర లాభాలు గడించే సంస్థను ఏడాది తిరక్కుండానే... నెలకు రూ.6 కోట్ల నష్టాలు వచ్చే కంపెనీగా కొత్త యాజమాన్యం మార్చేసిందని రవిప్రకాశ్ సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాకుండా రూ.500 కోట్ల క్యాపిటలైజేషన్ కలిగిన కంపెనీని అతి తక్కువ కాలంలోనే రూ.200 కోట్ల విలువకు పడిపోయేలా చేశారని కూడా రవిప్రకాశ్ చెప్పుకొచ్చారు. ఇక తన చేతిలో ఉండగా టీవీ 9 షేర్ విలువ రూ.250 ఉండగా... ఇప్పుడది రూ.78కి పడిపోయిందని కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో టీవీ 9ను తిరిగి లాభాల్లోకి తీసుకువస్తానని, మెజారిటీ షేర్లను తనకు అమ్మేలా ఆదేశాలు జారీ చేయాలని రవిప్రకాశ్ ట్రిబ్యూనల్ ను అభ్యర్థించారు. మరి రవిప్రకాశ్ అభ్యర్థనపై ట్రిబ్యూనల్ ఏమంటుందన్న దానిపై ఇప్పుడు ఆసక్తకర చర్యలు నడుస్తున్నాయి.
Tags:    

Similar News