రాయ‌పాటి వ్యాఖ్య‌:బాబు అలా ఒట్టేసుకున్నారట‌

Update: 2017-10-06 10:40 GMT
ఏపీ సీఎం చంద్ర‌బాబుపై గుంటూరు జిల్లా న‌ర‌స‌రావుపేట ఎంపీ రాయ‌పాటి సాంబ‌శివ‌రావు ఓ రేంజ్‌ లో ఏకేశారు. అది కూడా కులం కార్డుతో కొట్ట‌డం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. విష‌యంలోకి వెళ్తే.. దేశంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కేంద్రం తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాలక మండ‌లి ప్ర‌స్తుతం ఖాళీగా ఉంది. గ‌త చైర్మ‌న్ చ‌ద‌ల‌వాడ కృష్ణ‌మూర్తి ప‌ద‌వీకాలం ముగియ‌డంతో ప్ర‌స్తుతం ఛైర్మ‌న్ సీటు ఖాళీగా ఉంది. దీనికి అధికార పార్టీలో పెద్ద ఎత్తున డిమాండ్ ఏర్ప‌డింది. ఈ ఛైర్మ‌న్ గిరీపై నిర్ణ‌యం తీసుకునే వెసులుబాటు కేవ‌లం సీఎంకు మాత్ర‌మే ఉంది.

దీంతో ఈ పోస్టును ఆశించిన వాళ్లు .. నేరుగా సీఎం చంద్ర‌బాబుకే మొర‌పెట్టుకున్నారు. వీరిలో పెద్ద ఎత్తున పేరు వినిపించింది రాయ‌పాటి సాంబ‌శివ‌రావు - రాజ‌మండ్రి ఎంపీ ముర‌ళీమోహ‌న్‌. ఈ ఇద్ద‌రికీ కూడా భ‌క్తి భావం ఎక్కువ. ముర‌ళీ మోహ‌న్ అయితే ప్ర‌తి ఏడాదీ స్వామి మాల కూడా ధ‌రిస్తారు. ఇక‌, రాయ‌పాటి ఎన్నో దాన ధ‌ర్మాలు - ప‌లు ఆల‌యాల‌కు బంగారు ఆభ‌ర‌ణాల‌ను స‌మ‌ర్పించారు. దీంతో ఈ ఇద్ద‌రూ ఒక‌రిని మించి ఒక‌రు టీటీడీ ఛైర్మ‌న్ గిరీ కోసం పోటీ ప‌డ్డారు. అయితే, ఈ క్ర‌మంలో బాబు ఓ ప్ర‌క‌ట‌న చేశారు.. ప్ర‌జా ప్ర‌తినిధులుగా ఉన్న‌వారికి ఈ ప‌ద‌విని ఇవ్వ‌లేం అన్నారు. మ‌రో అడుగు వేసి జంట ప‌ద‌వులు టీడీపీ రాజ‌కీయ నీతికి విరుద్ధం అన్నారు.

దీంతో వెంట‌నే స్పందించిన రాయ‌పాటి.. త‌న‌కు టీటీడీ చైర్మ‌న్ ప‌ద‌వి ఇచ్చేట‌ట్ల‌యితే.. వెంట‌నే ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌న్నారు. ఇది అప్ప‌ట్లోనే పెను సంచ‌ల‌నంగా ప్ర‌చారంలోకి వ‌చ్చింది. అయినా కూడా బాబు దీనిపై మాట మాత్రం మాట్లాడ‌కుండా.. ఇటీవల రాజ‌కీయ కార‌ణాల నేప‌థ్యంలో క‌డ‌ప‌కు చెందిన పుట్టా సుధాక‌ర్ యాద‌వ్‌ను ఎంపిక చేస్తున్న‌ట్టు ఉత్త‌ర్వులు కూడా వెలువ‌రించారు. అయితే, ఆయ‌న క్రిస్టియ‌న్ కు అనుకూల‌మ‌ని, చ‌ర్చికి వెళ్తుంటార‌ని సామాజిక మాధ్య‌మాల్లో హోరెత్త‌డంతో బాబు వెన‌క్కి తగ్గారు.

అయితే, ఇప్ప‌టికీ చైర్మ‌న్ గిరీపై నిర్ణ‌యం తీసుకోలేదు. ఈ విష‌యంపై తాజాగా మాట్లాడిన రాయ‌పాటి.. త‌న మ‌న‌సులో బాబుపై ఉన్న అక్క‌సును వెళ్ల‌గ‌క్కారు. మీరింకా టీటీడీ చైర్మ‌న్ గిరీపై ఆశ‌పెట్టుకున్నారా? అని అడిగితే.. మౌనంగా ఉన్న రాయ‌పాటి.. అస‌లు చంద్ర‌బాబుకు ఆ ప‌ద‌వి ఇవ్వాల‌ని లేద‌ని తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు. ముఖ్యంగా క‌మ్మ‌ల‌కు ప‌ద‌వులు ఇవ్వ‌నంటూ.. ఆయ‌న దేవుడి ముందు నిల‌బ‌డి ఒట్టు పెట్టుకున్నారు! అంటూ బాంబు పేల్చారు.

దీంతో ఒక్క‌సారిగా బాబుపై ఆయ‌న‌కున్న అస‌హ‌నం బ‌య‌ట‌ప‌డింద‌ని చెప్పారు. అయితే, సుధాక‌ర్ పేరు ప‌క్క‌కు తొలిగిపోవ‌డంతో ఇప్పుడు రాయ‌పాటిని పంపే యోచ‌న ఉన్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే, రాయ‌పాటికి చైర్మ‌న్ గిరీ ఇస్తే.. ఆయ‌న ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేయాల్సి ఉంటుంద‌ని, దీంతో మ‌ళ్లీ ఉప ఎన్నిక వ‌స్తుంద‌ని బాబు భ‌య‌ప‌డుతున్నార‌ని మ‌రో వ‌ర్గం టీడీపీ నేత‌లు చెబుతున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.
Tags:    

Similar News