రాయపాటి అసంతృప్తి… వైఎస్సార్సీపీ రూట్లో..?

Update: 2019-03-12 14:48 GMT
నామినేషన్ల పర్వానికి సమయం దగ్గర పడుతున్నా.. ఏపీలో అటూ ఇటూ  జంపింగులు ఆగేలా లేవు. పేరున్న నేతలు - దశాబ్దాల  నేపథ్యం ఉన్న వారు  కూడా ఎన్నికల ముందు  పార్టీలు మారే ప్రయత్నంలో ఉన్నారు. ప్రధాన పార్టీల్లో అసంతృప్తితో అటు  వారు ఇటు - ఇటు వారు  అటు.. సాగుతూ ఉన్నారు. ఈ జాబితాలో తాజాగా చేరిన పేరు నరసరావు పేట ఎంపీ రాయపాటి సాంబశివరావు.

మరోసారి అదే ఎంపీ టికెట్ తో పాటు తన  తనయుడికి సత్తెనపల్లి ఎమ్మెల్యే టికెట్ కోరుతున్నారట రాయపాటి. ఈ విషయంలో ఇప్పటికే చంద్రబాబు నాయుడుకు రాయపాటి విన్నవించినట్టుగా సమాచారం. అయితే చంద్రబాబు నుంచి ఇన్ని రోజుల  పాటు ఏ మాత్రం స్పందనా  వ్యక్తం కాలేదట.

కోరుతున్న టికెట్ల విషయంలో రాయపాటికి ఎలాంటి స్పష్టత ఇవ్వలేదట చంద్రబాబు నాయుడు. ఈ నేపథ్యంలో బాగా అసంతృప్తికి గురి అవుతున్నారట రాయపాటి. ఈ అసహనంతో ఆయన తెలుగుదేశం పార్టీని వీడేందుకు కూడా రెడీగా ఉన్నారని సమాచారం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో తనకు పరిచయాలు పుష్కలంగా ఉన్నాయని..ఏ నిమిషం అయినా తను అక్కడకు వెళ్లగలిగే అవకాశాలున్నాయని చెబుతున్నారట రాయపాటి.

ఇప్పటికే అందుకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నట్టుగా భోగట్టా. అన్నీ కుదిరితే రాయపాటి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడం ఖరారే అని అంటున్నారు. అయితే పార్టీని వీడే ముందు చంద్రబాబుతో ఆఖరి సమావేశంలో ఉన్నారు  రాయపాటి.

అందుకోసం ఆయన చంద్రబాబు నివాసానికే వెళ్లారు. ఆ సమావేశం ముగిసిన అనంతరం రాయపాటి ఏ విషయాన్నీ ప్రకటించే అవకాశం ఉందని, కోరినట్టుగా నరసరావుపేట ఎంపీ - సత్తెనపల్లి అసెంబ్లీ టికెట్ లభించకపోతే తెలుగుదేశం పార్టీని రాయపాటి వీడటం మాత్రం ఖాయమని ప్రచారం జరుగుతూ ఉంది.
Tags:    

Similar News