బౌలర్ ఎవరైనా బాదుడే..డివిలియర్స్ మోతకు రైడర్స్ చిత్తు!

Update: 2020-10-13 03:45 GMT
ఈ సీజన్లో బెంగళూరు బెంగ కాస్త తీరినట్లుగానే ఉంది. కొన్నేళ్లుగా పాయింట్ల పట్టికలో ఆఖరు స్థానాలకు పరిమితం అవుతున్న ఆర్సీబీ  ఈ సారి జోరు చూపిస్తోంది. సోమవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో  బెంగళూరు 82 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. సీజన్లో ఐదో విజయాన్ని నమోదు చేసింది. చాలా రోజుల తర్వాత డివిలియర్స్ తన మార్క్ బ్యాటింగ్ చేసి ఫోర్లు, సిక్సర్లతో దంచి కొట్టాడు. అభిమానులను అలరించాడు. ఆర్సీబీ బౌలింగ్‌లోనూ చెలరేగడంతో  కేకేఆర్‌ స్వల్ప స్కోరుకే పరిమితం అయ్యింది. టాస్ గెలిచి  బ్యాటింగ్‌ చేసిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు రెండు వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది.  

ఓపెనర్లు పడిక్కల్‌(32; 23 బంతుల్లో 4 ఫోర్లు, 1సిక్స్‌) అరోన్‌ ఫించ్‌(47; 37 బంతుల్లో 4 ఫోర్లు, 1సిక్స్‌)చక్కటి భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తర్వాత  ఏబీ డివిలియర్స్‌(73 నాటౌట్‌; 33 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్‌లు) విధ్వంసం సృష్టించగా  కోహ్లి(32 నాటౌట్‌; 27 బంతుల్లో 1 ఫోర్‌) రాణించడంతో  భారీ స్కోర్ సాధించింది. 12 ఓవర్ వరకూ స్లోగా సాగిన మ్యాచ్ డివిలియర్స్ రాకతో ఒక్కసారిగా మారిపోయింది. అతడు ఫోర్లు, సిక్సర్ల మోత మోగించాడు. 23 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో హాఫ్‌ సెంచరీ పూర్తిచేస్తున్నాడు.దీంతో స్కోర్ బోర్డు ఉరకలెత్తింది. మరో వైపు కోహ్లీ మాత్రం నెమ్మదిగా ఆడాడు.

అనంతరం ఛేదనలో కోల్ కతా ఘోరంగా విఫలం అయ్యింది.శుభ్ మన్‌ గిల్‌(34; 25 బంతుల్లో 3 ఫోర్లు, 1సిక్స్‌) మినహా ఎవరూ రాణించలేదు. కోల్ కతా  ఆటగాళ్లలో పెవిలియన్ కి క్యూ కట్టడంలో పోటీ పడ్డారు. ఏకంగా  ఎనిమిది మంది సింగిల్‌ డిజిట్‌కే పరిమితం అయ్యారు. టామ్ బాంటన్ (8), నితీష్ రాణా (9), మోర్గాన్ (8), కార్తీక్ (1) రసెల్(16) స్వల్ప స్కోర్ కే పరిమితం కావడంతో పరాభవం తప్పలేదు.


   కోహ్లీ.. ఫోర్ కోసం ఎదురు చూపు

ఓ వైపు తన సహచరుడు డివిలియర్స్ బౌండరీల మోత మోగిస్తుంటే కోహ్లి ఫోర్‌ కొట్టడానికి  కూడా చాలాసేపు నిరీక్షించాల్సి వచ్చింది. చాలా సేపు సింగిళ్లకే పరిమితం అయ్యాడు. 19 ఓవర్‌లో కానీ కోహ్లి ఖాతాలో ఫోర్  రాలేదు. అదొక్క బౌండరీనే ఈ మ్యాచ్‌లో కోహ్లి సాధించింది.

* ఇది ఆర్సీబీకి ఐదో విజయం కాగా, కేకేఆర్‌కు మూడో ఓటమి.

* పాయింట్ల పట్టికలో చాలా రోజుల తర్వాత బెంగళూరు  మూడో స్థానానికి చేరింది.

* గత మ్యాచ్ లో అర్ధ సెంచరీతో ఫామ్ లోకి వచ్చిన కార్తీక్ మళ్లీ ఒకే పరుగు సాధించి కీలక సమయంలో వెనుదిరిగాడు.
* రసెల్ కూడా బ్యాటింగ్ లో ఎప్పట్లాగే విఫలం అయ్యాడు.
Tags:    

Similar News