ఆ మంత్రుల వ్యాఖ్యల మర్మం ఏమిటీ...?

Update: 2018-08-25 08:17 GMT
ఆంధ్రప్రదేశ్‌ లో తెలుగుదేశం పార్టీలో విబేధాలు రోజురోజుకు బయటపడుతున్నాయి. ముఖ్యంగా సీనియర్ నాయకులు - మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలతో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు - ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు తలనొప్పులు ఎక్కువవుతున్నాయి. దీంతో ఆయన మంత్రులపై సీరియస్ అవుతున్నారు.

తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేస్తుందని వస్తున్న వార్తలపై సీనియర్ మంత్రులు చింతకాయల అయ్యన్న పాత్రుడు - ఉప ముఖ్యమంత్రి కె.ఈ. కృష్ణమూర్తి చాలా ఘాటుగా స్పందించారు. అదే జరిగితే ప్రజలు తెలుగుదేశం పార్టీ నాయకులను తంతారు అంటూ స్పందించారు. కాంగ్రెస్‌ కు వ్యతిరేకంగా పుట్టిన తెలుగుదేశం పార్టీ వారితో చేతులు కలిపితే ఎన్.టి.రామారావు ఆత్మ క్షోభిస్తుందని కూడా వ్యాఖ్యానించారు. దీనిపై ముఖ్యమంత్రి - తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారంటూ వార్తలు వచ్చాయి. సీనియర్ మంత్రులు కె.ఈ.కృష్ణమూర్తి - చింతకాయల అయ్యపాత్రుడు వ్యాఖ్యలకు అసలు కారణం పొత్తు కాదని అంటున్నారు.

విశాఖపట్నంలో మరో మంత్రి గంటా శ్రీనివాసరావును ముఖ్యమంత్రి సపోర్ట్ చేస్తున్నారనే భావన అయ్యన్న పాత్రుడిలో నానాటికి పెరిగిపోతోంది. ఒక దశలో గంటా శ్రీనివాస్‌ ను బయటకు పంపాలని అయ్యన్న పాత్రుడు బహిరంగంగానే డిమాండ్ చేశారు. జిల్లాలో గంటా శ్రీనివాస రావు అవినీతిపై అధిష్టానానికి సాక్షాలతో సహా మంత్రి అయ్యన్న ఫిర్యాదులు చేశారని సమాచారం. అయితే, గంటాపై చర్యలు తీసుకోకపోగా ఆయన్ని ప్రోత్సహించే విధంగా ప్రవర్తిస్తున్నారని అయ్యన్న ఆగ్రహంగా ఉన్నారట. దీనిని ద్రష్టిలో ఉంచుకునే అయ్యన్న పాత్రుడు అవకాశం వచ్చినప్పుడల్లా అధిష్టానంపై మండిపడుతున్నారని అంటున్నారు. ఇక ఉప ముఖ్యమంత్రి కె.ఈ.కృష్ణమూర్తి తన ఆగ్రహం అంతా చినబాబు లోకేష్ పైనే అంటున్నారు. తనకు తెలియకుండా జిల్లా రాజకీయాల్లో తలదూరుస్తున్నారని, చంద్రబాబు నాయుడికి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదనే కోపంతో రగిలిపోతున్నారని అంటున్నారు. ఈ కారణాలతోనే అవకాశం వచ్చినప్పుడుల్లా అధిష్టానం ఈ సీనియర్లు విమర‌్శలు సంధిస్తున్నారు. మరికొన్నాళ్లలో మరికొందరు నాయకులు కూడా ఇదే బాట పడతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తెలుగుదేశం అధినాయకుడు చంద్రబాబు నాయడు పార్టీ సీనియర్ల నుంచి వారు చేసిన వ్యాఖ్యలపై వివరణ తీసుకోవాలని పార్టీ క్రమశిక్షణా విభాగానికి ఆదేశాలు జారీ చేశారంటున్నారు. అదే జరిగితే వారిద్దరు వివరణ ఇవ్వడంతో పాటు మరిన్ని విమర్శలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు. దీంతో ఈ వ్యవహారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి తలనొప్పిగా తయారైంది.
 
Tags:    

Similar News