జనసేన ఫెయిల్యూర్ పై అంత ఆశ్చర్యం ఎందుకు?

Update: 2019-05-28 13:40 GMT
ఏపీ ఎన్నికల ఫలితాలను చూసి పవన్ కల్యాణ్ వీరాభిమానులు ఖిన్నులు అయి ఉన్నారట - రాజకీయ పరిశీలకులు కూడా జనసేన మరీ ఇంతలా చిత్తు అయ్యిందని ఆశ్చర్యపోతూ ఉన్నారట! పవన్ కల్యాణ్ అభిమానులు ఓటమి విషయంలో ప్రజలను నిందిస్తూ ఉన్నారట. కొందరు అభిమానులు అయితే తమ అభిమాన హీరో పార్టీ చిత్తుగా ఓడిపోవడంతో ఇళ్లు వదిలి వెళ్లిపోయారట!

ఫలితాల తర్వాత జనసేన పార్టీ అభిమానులు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలను చూసినా - పరిశీలకులు వ్యక్తం చేస్తున్న ఆశ్చర్యలను గమనించినా.. ఒకే అభిప్రాయం కలుగుతుంది. అంతలా ఆశ్చర్యపోవడానికి ఏముంది? జనసేన అంతలా చిత్తు కావడంలో ఆశ్చర్యం ఏముంది? జనసేనకు ఓటర్లు చాలా సహజ న్యాయమే చేశారు కదా? అనే అభిప్రాయాలు కలగక మానవు.

జనసేన ఆవిర్భావం దగ్గర నుంచి పరిస్థితులను విశ్లేషించినా - ఈ ఎన్నికల ముందు జనసేన ప్రిపేర్ అయిన తీరును గమనించినా.. ఆ పార్టీ అట్టర్ ఫ్లాప్ కావడంలో ఎలాంటి ఆశ్చర్యం అక్కర్లేదు. బాగా చదివిన వాడు ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయితే ఆశ్చర్యపోవాలి. కానీ అసలే మాత్రం ప్రిపరేషన్ లేని వాడు ఎగ్జామ్స్ లో జీరో మార్కులు తెచ్చుకుంటేనో - సింగిల్ మార్కుకు పరిమితం అయితేనో.. అంత ఆశ్చర్యం ఉండకూడదు. రాసిన వాడికి ఎలాగూ తెలుసు.. తను ఫెయిల్ అయ్యే విషయం. ఆ మాత్రం దానికి ఇన్విజిలేటర్ ఆశ్చర్యపోతే కామెడీగా ఉంటుంది. ఇప్పుడు జనసేన పరిస్థితి కూడా అంతే.

ఎన్నికలు అనే పరీక్షకు ఏ మాత్రం ప్రిపేర్ కాలేదు పవన్ కల్యాణ్. తను ఇంటర్  ఫెయిల్ అని పవన్ కల్యాణ్ ఎప్పుడో ఒకసారి చెప్పారు. ఆ లెక్కన చూసుకుంటే.. పవన్ కల్యాణ్ అప్పుడు ఎగ్జామ్స్ ప్రిపేర్ కానట్టుగానే - ఈ సారి ఎన్నికలకు కూడా ప్రిపేర్ కాలేదు. ఫలితంగా చిత్తుగా  ఓడిపోయారు. స్వయంగా ఆయన ఎమ్మెల్యేగా నెగ్గలేకపోయారు. ఆయన పార్టీ తరఫున పోటీ చేసిన వాళ్లలో ఒక్కరు తప్ప అంతా ఓడారు. ఆయన తో పొత్తు పెట్టుకున్న వాళ్లూ చిత్తు అయ్యారు.

పరిశీలించి చూస్తే పవన్ కల్యాణ్ పార్టీ పరిస్థితి ఇలా ఉంటుందని - ఎన్నికల ముందే కొంతమందికి క్లారిటీ వచ్చింది. ఎన్నికల ముందే జనసేన పార్టీ పరిస్థితి ఇలా ఉంటుందని చాలా మంది అనుకున్నారు. అలా అనుకున్నవారెవరు? అని నిగ్గదీయనక్కర్లేదు. అలాంటి వారు చాలా మందే ఉన్నారు. అందుకు ఒక సాక్ష్యం  జాతీయ మీడియా వర్గాలు ఎన్నికల పోలింగ్ కు ముందు చెప్పిన మాటలు!

ఏపీలో జనసేన అనే పార్టీ ఉంది.. అనే లెక్కనే తీసుకోలేదు జాతీయ మీడియా వర్గాలు. ఆ మీడియా వర్గాలు తాము చేయించిన సర్వేల్లో జనసేనను ఒక పార్టీగా లెక్క వేయలేదు. జనసేన సీట్లను సాధిస్తుందని ఏ ఒక్క మీడియా వర్గం కూడా చెప్పలేదు. ఎంపీ సీట్ల వారీగా అవి చేసిన సర్వేల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇరవైకి పైగా ఎంపీ సీట్లు అని - తెలుగుదేశానికి మిగిలినవి అని చెప్పిన నేషనల్ మీడియా వర్గాలు జనసేనను మాత్రం ఉందని కూడా గుర్తించలేదు!

జాతీయ మీడియాకే కాదు.. క్షేత్ర స్థాయికి వెళ్లి పరిశీలించిన చాలా మందికి ఈ విషయం అర్థం అయ్యింది. జనసేన జీరో అనే విషయం బోధ పడింది. పవన్ వీరాభిమానులకు - పవన్ ను రెచ్చగొట్టి పోటీ చేయించిన వాళ్లకు తప్ప  క్షేత్ర స్థాయిలో ప్రజలకు - పరిశీలించిన వారికి జనసేన విషయంలో ఎన్నికలకు చాలా ముందే నిశ్చితాభిప్రాయం ఉంది.

పవన్ చుట్టూ 'సీఎం.. సీఎం..' అంటూ అరిచే వాళ్లతో ఎలాంటి ప్రయోజనం ఉండదనే విషయం ప్రజలకు తెలుసు. పవన్ కల్యాణ్ కు రాజకీయాల పట్ల ఎంత సీరియస్ నెస్ ఉందో ఆయన ఎన్నికలకు ఆరు నెలల ముందు మాత్రమే ప్రజల ముందుకు రావడంతో క్లారిటీ వచ్చింది. వచ్చాకా కూడా తన పార్టీకి ఒక రూపాన్ని కల్పించుకోకపోవడంతో ఆయన సమర్థత ఏమిటో అర్థం అయ్యింది. ఏపీలోని ఎన్ని నియోజకవర్గాల్లో పవన్ ప్రచారం చేశాడో కొంతమంది లెక్కేసి చెప్పారు. అప్పుడే పవన్ సాధించబోయేది ఏమిటో అర్థం అయ్యింది.

రాజకీయ పార్టీని నడపడం అంటే.. సినిమాలో పాట అయిపోయేలోపు ముఖ్యమంత్రి అయిపోవడం అనుకున్నట్టుగా ఉన్నారు పవన్ కల్యాణ్. చిత్రం ఏమిటంటే.. రాజకీయాలకు పవన్ కొత్త కాదు. 'ప్రజారాజ్యం' పార్టీ అనుభవం ఉండనే ఉంది. అయినా తనను తాను చాలా ఎక్కువ అంచనా వేసుకోవడం పవన్ కల్యాణ్ తీరును చాటి చెబుతూ ఉంది. తన అనుమతి, మద్దతు లేనిదే ఎవరూ ఏపీకి ముఖ్యమంత్రి కాలేరు అనే భ్రమలో ఆయన కూరుకుపోయారు. ఆ భ్రమ నుంచి ఇప్పటికైనా బయటకు వచ్చి ఉండాలి! రాజకీయ పార్టీ నిర్మాణం అంటే ఏమిటో, దాన్ని ఎలా లీడ్ చేయాలో అర్థం చేసుకోవాలి. ఆ విషయాన్ని ఏ పుస్తకాల్లోనూ రాసి ఉండరు. ప్రజల్లోకి వచ్చి పడితే అన్నీ అర్థం అవుతాయి!  లేకపోతే జనసేన భవిష్యత్తులో పూర్తిగా గల్లంతయిపోయినా 'ఆశ్చర్యం' అక్కర్లేదు!


Tags:    

Similar News