కేశవ్ కాదు.. చంద్రబాబు మీదనే రేవంత్ మంట!

Update: 2017-10-18 11:54 GMT
‘‘తెలుగుదేశం నాయకులు అత్యుత్సాహం తగ్గించుకోవాలి.. కేసీఆర్ అనంతపురం వచ్చినప్పుడు చాలా ఎక్స్ ట్రాలు చేశారు. కేశవ్ లాంటి సీనియర్ నాయకుడే ఇలా చేస్తే ఎలా...? ఇప్పుడు తెలంగాణలోని తెలుగుదేశం నాయకులు పార్టీకి రాజీనామా చేసేస్తాం అంటున్నారు..’’ ఇవీ చంద్రబాబునాయుడు కొన్నాళ్ల కిందట పార్టీ కీలక సమావేశంలో పలికిన డైలాగులు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులతో భేటీ అయిన తర్వాత, ఏపీలో భేటీ అవుతూ... కేశవ్ ను కార్నర్ చేస్తూ టీటీడీపీని కేశవ్ లాంటి వాళ్లు అవసానదశకు చేర్చేస్తున్నారు అనే రీతిలో చంద్రబాబునాయుడు మాటలు వల్లించారు. కానీ తాజా ఎపిసోడ్ లో చేదు వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. పార్టీకి చావు దెబ్బలాగా.. కాంగ్రెస్ లోకి వెళ్లదలచుకున్న రేవంత్ అసలు మండిపాటు.. కేశవ్ భేటీ విషయం కాదని.. కేసీఆర్ పట్ల చంద్రబాబునాయుడు ప్రదర్శిస్తున్న లొంగుబాటు ధోరణి అని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.

చాలా మంది ఆరోపిస్తున్న ప్రకారం.. ఓటుకు నోటు కేసు బయటపడిన నాటినుంచి తెలంగాణ సీఎం కేసీఆర్ అంటే చంద్రబాబునాయుడు జడుసుకుంటూనే ఉన్నారు. ఆ కేసు దెబ్బకు కేవలం వారాల వ్యవధిలో ఆయన హైదరాబాదు నుంచి మకాం ఎత్తేసి బెజవాడకు వెళ్లిపోయారు. రేవంత్ రెడ్డి.. సుదీర్ఘ కాలం జైలు శిక్ష అనుభవించి బెయిలు మీద బయటకు వచ్చినా కూడా.. కేసీఆర్ సర్కారు పట్ల ఎలాంటి భయం గానీ, జడుపు గానీ లేకుండా... వారి పాలనను, కేసీఆర్ కుటుంబాన్ని నిరంతరాయంగా చికాకు పెడుతూనే ఉన్నారు. నిజానికి ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడు తానే అయినప్పటికీ.. రేవంత్ రెడ్డి ఎక్కడా కేసీఆర్ కు లొంగిపోయినట్లుగా ప్రవర్తించలేదు. అయితే చంద్రబాబునాయుడు మాత్రం.. కేసులో తన పేరు ప్రస్తావనకు రాకుండా చూసుకోడానికి ఇక్కడ తాము ఇంతగా పోరాడుతున్న ప్రత్యర్థి కేసీఆర్ కు లొంగిపోయినట్లుగా ప్రవర్తించడం, ఇరుగు పొరుగు రాష్ట్రాలతో సఖ్యత పేరుతో కేసీఆర్ తో ‘జీ హుజూర్’ అన్నట్లుగా వ్యవహరించడం ఇవన్నీ.. రేవంత్ కు కంటగింపుగా మారాయట.

పోలీసులు తనను అరెస్టు చేసిన సమయంలోనే.. కేసీఆర్ అంతు తేలుస్తానంటూ.. మీసం మెలేసి సవాలు విసిరిన రేవంత్ రెడ్డి.. తెలుగుదేశం పార్టీలో ఉంటే అది అసాధ్యం అనే అభిప్రాయానికి వచ్చారట. పైగా చంద్రబాబునాయుడు.. తెలంగాణ కీలక నాయకులు కొందరితో.. తెరాస తో పొత్తు మార్గం తొక్కడానికి కూడా సుముఖంగానే ఉన్నట్లు సంకేతాలు ఇచ్చారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు వైఖరి నచ్చక... ఇక్కడ తాను అత్యున్నత స్థాయిలో పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పటికీ.. పార్టీని వీడిపోవడానికే రేవంత్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు రాబోయే నిందలు తన మీదకు రాకుండా.. ముందస్తుగా కేశవ్ లాంటి వారి భేటీల మీదకు నెపం నెట్టేసినట్లుగా కనిపిస్తోంది.
Tags:    

Similar News