కేసీఆరే కేసులు వేయించుకుంటున్నారట‌!

Update: 2017-09-16 05:22 GMT
త‌న మాట‌ల‌తో తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ పై అదే ప‌నిగా ధ్వ‌జ‌మెత్తే తెలంగాణ నాయ‌కుల్లో తెలంగాణ తెలుగుదేశం శాస‌న‌స‌భాప‌క్ష నేత రేవంత్ రెడ్డి ముందుంటారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్ అయిన త‌ర్వాత కాస్త జోరు త‌గ్గించిన ఆయ‌న‌.. అప్పుడ‌ప్పుడు మాత్రం గ‌ళం విప్పుతున్నారు.

తాజాగా న‌ల్గొండ లోక్ స‌భ స్థానానికి ఉప ఎన్నిక జ‌రిగే అవ‌కాశం ఉంద‌న్న మాట జోరుగా వినిపిస్తున్న వేళ‌.. ఆయ‌న టీడీపీ అభ్య‌ర్థిగా బ‌రిలో ఉంటార‌న్న ప్ర‌చారం సాగుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా కేసుల వ్య‌వ‌హారంపై స‌రికొత్త త‌ర‌హాలో ఆరోప‌ణ‌లు చేశారు రేవంత్ రెడ్డి. తాము జోరుగా చేస్తున్న అభివృద్ధి కార్య‌క్ర‌మాల్ని చూడ‌లేక‌.. ప్ర‌తిప‌క్షాలు కుళ్లుతో కేసులు వేయిస్తున్నారంటూ కేసీఆర్ మాట్లాడ‌టం తెలిసిందే. అయితే.. ఆ ఆరోప‌ణ‌ల్లో నిజం లేద‌ని మండిప‌డుతున్నారు రేవంత్ రెడ్డి.

పార్టీ బ‌ల‌హీన‌ప‌డింద‌న్న ఉద్దేశంతోనే కొత్త‌గా రైతు స‌మితుల్ని ఏర్పాటు చేస్తున్న‌ట్లు కేసీఆర్ పై విమ‌ర్శ‌లు గుప్పించారు. త‌మ ప్ర‌భుత్వం చేప‌ట్టిన ప‌థ‌కాల‌పై విప‌క్షాలు కోర్టులో కేసులు వేస్తున్న‌ట్లుగా కేసీఆర్ విష ప్ర‌యోగం చేస్తున్నార‌ని.. ఇందులో నిజం లేద‌న్నారు. రైతు స‌మితుల‌ను వ్య‌తిరేకిస్తూ రంగారెడ్డి జిల్లా టీఆర్ ఎస్ జ‌డ్పీటీసీ స‌భ్యురాలు చింపుల శైల‌జ భ‌ర్త‌.. స‌ర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్య‌క్షుడు చింపుల స‌త్యానార‌య‌ణ‌రెడ్డి హైకోర్టులో కేసు వేశార‌న్నారు. వీరి త‌ర‌ఫు వాదించే లాయ‌ర్ త‌ర‌సాని స‌త్యంరెడ్డి సైతం 2001 నుంచి టీఆర్ ఎస్‌ కు న్యాయ‌స‌ల‌హాదారుగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని గుర్తు చేశారు.

అధికార‌పార్టీకి స‌న్నిహితులైన వారు.. కేసీఆర్ తీసుకున్న నిర్ణ‌యాన్ని వారు ఎలా ధిక్క‌రిస్తార‌ని ప్ర‌శ్నించారు. ఒక‌వేళ తాను తీసుకున్న నిర్ణ‌యానికి వ్య‌తిరేకంగా కోర్టుకు వెళితే.. అయినోళ్ల మీద కేసీఆర్ చ‌ర్య‌లు తీసుకోకుండా ఉంటారా? అన్న‌సందేహాన్ని వ్య‌క్తం చేశారు. పైకి విప‌క్షాలు పేరు చెప్పి వారిని దుయ్య‌బ‌డుతూ.. లోపాయికారిగా సొంత పార్టీ నేత‌ల‌తోనే కేసులు వేయించుకుంటున్నార‌ని రేవంత్ అనుమానాన్ని వ్య‌క్తం చేశారు. తెర వెనుక ఉండి క‌థ న‌డిపిస్తున్నార‌న్నారు. మ‌రీ.. విష‌యం మీద కేసీఆర్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
Tags:    

Similar News