కోడంట‌!... కేబినెట్ విస్త‌ర‌ణ ఆపాల‌ట‌!

Update: 2019-02-19 09:30 GMT
తెలంగాణ‌లో కొత్త ప్ర‌భుత్వం ఏర్పాటై రెండు నెల‌లు పూర్తి అవుతున్నా.... ఇంకా కేబినెట్ లేద‌ని మొన్న‌టిదాకా విప‌క్షాల‌న్నీ గోల‌గోల చేసిన విష‌యం తెలిసిందే క‌దా. ప్ర‌జ‌ల చేత పాల‌నను ద‌క్కించుకున్న గులాబీ ద‌ళ‌ప‌తి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావు మ‌న‌సులో ఏముందో తెలియ‌దు గానీ - ఆయ‌న లెక్క‌లేంటో కూడా తెలియ‌దు గానీ... ఎట్ట‌కేల‌కు కేబినెట్ ను ఏర్పాటు చేసుకునేందుకు ముహూర్తం నిర్ణ‌యించుకున్నారు. అయితే అప్ప‌టిదాకా కేబినెట్ లేకుండా పాల‌న ఎలా సాగిస్తార‌న్న విప‌క్షాలు... ఇప్పుడు ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి వ‌చ్చాక కేబినెట్ ఎలా విస్తరిస్తారంటూ ఓ కొత్త త‌ర‌హా వాద‌న‌ను వినిపిస్తున్నాయి. ఈ త‌ర‌హా వితండ వాద‌న‌ల్లో టీ కాంగ్రెస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి బాగానే ఆరి తేరిన‌ట్లున్నారు.

రెండు నెల‌ల త‌ర్వాతైనా కేసీఆర్ త‌న కేబినెట్ ను ఏర్పాటు చేస్తున్నారులే అన్న కోణంలో తెలంగాణ వ్యాప్తంగా కాస్తంత కోలాహ‌ల వాతావ‌ర‌ణం నెల‌కొన‌గా... ఏకంగా రేవంత్ రెడ్డి మాత్రం కేబినెట్ విస్త‌ర‌ణ‌ను నిలిపేయాల్సిందేన‌ని డిమాండ్ చేశారు. డిమాండ్‌ తోనే స‌రిపెట్ట‌ని రేవంత్‌.... ఏకంగా కేంద్ర ఎన్నిక‌ల సంఘం - తెలంగాణ ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారి కార్యాల‌యాల‌కు లేఖ‌లు రాసేశారు. ఈ లేఖ‌ల్లో రేవంత్ వాద‌న ఏమిట‌న్న విష‌యానికి వ‌స్తే... తెలంగాణ శాస‌న‌మండ‌లిలో ఖాళీ అయిన స్థానాల‌కు సంబంధించి కొత్త‌గా ఎన్నిక‌లు నిర్వ‌హించేందుకు నిన్న సాయంత్రం నోటిఫికేష‌న్ వెలువ‌డింది. ఈ క్ర‌మంలో ఎన్నిక‌లు జ‌రిగే ప్రాంతాల్లో ఎల‌క్ష‌న్ కోడ్ అమ‌ల్లోకి వ‌చ్చేసిన‌ట్టేన‌న్న‌ది రేవంత్ వాద‌న‌. ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి వ‌చ్చాక కేబినెట్ విస్త‌ర‌ణ‌తో ఓట‌ర్ల‌ను ప్ర‌భావితం చేసిన‌ట్టేన‌ని కూడా రేవంత్ వాదిస్తున్నారు.

ఓట‌ర్ల‌ను ప్ర‌భావితం చేసే కేబినెట్ విస్త‌ర‌ణ‌ను జ‌ర‌గ‌కుండా చేయాల‌న్న‌ది రేవంత్ డిమాండ్‌. అంతేకాదండోయ్‌... ఈ కేబినెట్ విస్త‌ర‌ణ ఏకంగా లోక్ స‌భ ఎన్నిక‌ల‌పైనా ప్ర‌భావం చూపుతుంద‌ట‌. ఇది కూడా రేవంత్ నోట వినిపించిన డైలాగే. రేవంత్ విన‌తిని ప‌రిశీలించిన తెలంగాణ ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారి ర‌జ‌త్ కుమార్ దానిని అలా ప‌క్క‌న‌పడేశార‌ట‌. ఎందుకంటే.... నిన్న వెలువ‌డిన నోటిఫికేష‌న్ లో ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు సంబంధించిన అంశాలున్నాయి గానీ... కోడ్ ఆఫ్ కాండ‌క్ట్ అన్న అంశం ప్ర‌స్తావ‌లే లేద‌ట‌. మొత్తంగా కోడి గుడ్డుపై ఈక‌లు పీకిన చందంగా రేవంత్ చేసిన వాద‌న వీగిపోగా... ఆయ‌న పంపిన ద‌ర‌ఖాస్తు కూడా బుట్ట దాఖ‌లైంద‌న్న మాట‌.
Tags:    

Similar News