కేసీఆర్ స‌ర్కారుపై డ్ర‌గ్స్ బండేసిన రేవంత్‌

Update: 2017-10-27 09:40 GMT
తెలంగాణ తెలుగు దేశం పార్టీ ఫైర్ బ్రాండ్ గా సుప‌రిచితుడు.. రేపో మాపో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవ‌టానికి రంగం సిద్ధం చేసుకున్న రేవంత్ రెడ్డి తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఫ్యామిలీపై భారీ బండ వేశారు. త‌న‌దైన శైలిలో ప‌దునైన ఆరోప‌ణ‌లు చేసిన ఆయ‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

రెండు తెలుగు రాష్ట్రాల‌తో పాటు.. దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన డ్ర‌గ్స్ వ్య‌వ‌హారంపై అసెంబ్లీలో చ‌ర్చ జ‌రిపేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం వెనుకాడుతోంద‌న్న సందేహాన్ని వ్య‌క్తం చేశారు. ప్ర‌భుత్వ పెద్ద‌ల భాగోతం బ‌య‌ట‌ప‌డుతుంద‌న్న భ‌యంతోనే డ్ర‌గ్స్ రాకెట్ పై చ‌ర్చ‌కు అనుమ‌తి ఇవ్వ‌టం లేద‌న్నారు.

అసెంబ్లీలో తెలంగాణ అధికార‌ప‌క్షం ఏక‌ప‌క్షంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని.. ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యంలో ఉద్దేశ‌పూర్వ‌కంగానే త‌న ప్ర‌శ్న‌ను ప‌క్క‌న పెట్టార‌ని ఆరోపించారు. డ్ర‌గ్స్ వ్య‌వ‌హారంలో ముఖ్య‌మంత్రి కుమారుడు.. మంత్రి కేటీఆర్ కు సంబంధం ఉంద‌ని తాను చేసిన ఆరోప‌ణ‌ల‌పై ఎందుకు స్పందించ‌టం లేదో చెప్పాల‌ని నిల‌దీశారు.

కేటీఆర్ పై రేవంత్ చేసిన మ‌రో భారీ ఆరోప‌ణ ఏమిటంటే.. బ్ల‌డ్ శాంపిల్ ఇచ్చేందుకు తాను సిద్ధ‌మ‌ని.. మ‌రి కేటీఆర్ సిద్ధ‌మా? అని స‌వాలు విసిరారు.  డ్ర‌గ్స్‌.. మ‌త్తువ్యాపారాల‌ను ప్రోత్స‌హిస్తూ పిల్ల‌ల జీవితాల‌తో కేసీఆర్ స‌ర్కారు ఆట‌లు ఆడుతోంద‌న్న ఆయ‌న‌.. ఆరోప‌ణ‌లు చేస్తే కేసులు పెడ‌తామంటూ ముఖ్య‌మంత్రి కేసీఆర్ బెదిరిస్తున్నార‌న్నారు.

తాను చేసిన ఆరోప‌ణ‌లు త‌ప్పు అయితే త‌న‌ను జైల్లో పెట్టాల‌న్న రేవంత్‌.. హైద‌రాబాద్ లో ఉన్న 56 ప‌బ్బుల్లో కేసీఆర్‌.. త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌.. ఏపీ మంత్రి ప‌రిటాల సునీత బంధువుల‌వే ఉన్నాయంటూ మ‌రో భారీ బండ వేశారు. హైద‌రాబాద్ లో డ్ర‌గ్స్ వ్యాపారానికి కేసీఆర్ స‌ర్కారు అన్నివిధాలుగా స‌హ‌క‌రిస్తోంద‌న్నారు.

డ్ర‌గ్స్ వ్య‌వ‌హారంలో త‌లెత్తిన అనుమానాల్ని నివృత్తి చేయాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వం మీద ఉన్న రేవంత్‌.. ఈ వ్య‌వ‌హారంలో కేసీఆర్ కుటుంబ స‌భ్యులపైనే అనుమానాలు ఉన్నాయ‌ని మ‌రోసారి చెప్పారు. ఇప్ప‌టివ‌ర‌కూ ప‌లువురు ప్ర‌ముఖుల నుంచి సేక‌రించిన బ్ల‌డ్ శాంపిల్స్ లో ఎవ‌రు డ్ర‌గ్స్ తీసుకున్నది తేలిందో బ‌య‌ట‌కు వెల్ల‌డించాల‌ని కోరారు. డ్ర‌గ్స్ వ్య‌వ‌హారాన్ని తెర మీద‌కు తీసుకురావ‌ట‌మే కాదు.. ఘాటు ఆరోప‌ణ‌లు చేసిన రేవంత్‌కు కేసీఆర్ ఫ్యామిలీ స‌మాధానం చెప్పాల్సిన అవ‌స‌రాన్ని త‌న మాట‌ల‌తో సృష్టించార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News