రేవంత్‌ కు చెక్ చెప్పే అభ్య‌ర్థిని రెఢీ చేసిన కేసీఆర్‌

Update: 2017-10-29 05:54 GMT
ఓటుకు నోటు కేసు ఎపిసోడ్ గుర్తుందా? ఎమ్మెల్సీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ స‌న్ కు భారీ మొత్తంలో ఆఫ‌ర్ ఇచ్చి.. వీడియో సాక్షిగా దొరికిపోయిన రేవంత్ గుర్తున్నారా? భారీ సంచితో స్టీఫెన్ స‌న్ తో రేవంత్ మాట్లాడిన మాట‌లు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వారికి షాక్ కు గురి చేయ‌ట‌మే కాదు.. రేవంత్ పొలిటిక‌ల్ లైఫ్ కు చెరిగిపోని మ‌చ్చ‌గా మారింద‌ని చెప్పాలి.

అప్ప‌టివ‌ర‌కూ టీఆర్ ఎస్ అధినేత‌.. ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ ను నిల‌దీసే మొన‌గాడిగా పేరున్న రేవంత్‌ కు.. ఆ ఒక్క వీడియో చేసిన డ్యామేజ్ అంతా ఇంతా కాదు. క‌ట్ చేస్తే.. తాజాగా టీడీపీకి రాజీనామా చేసిన రేవంత్ కాంగ్రెస్ లో చేర‌టం సాంకేతికం మాత్ర‌మే. ఈ సంద‌ర్భంగా పార్టీ మారిన వెంట‌నే త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రేవంత్ రాజీనామా చేయ‌నున్నారు.

ఒక పార్టీ మీద గెలిచిన వారు.. మ‌రోపార్టీలో చేరే క్ర‌మంలో త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేయాల‌న్న డిమాండ్‌ ను రేవంత్ మొద‌టి నుంచి చేస్తున్న‌దే. మ‌రిప్పుడు పార్టీ మార‌నున్న రేవంత్‌.. త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేయ‌క‌పోతే అంద‌రి చేత వేలెత్తి చూపించుకోవాల్సి ఉంటుంది. అందుకే త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసేందుకు రెఢీ అయిపోయారు.

రేవంత్ ఫ్యూచ‌ర్ ప్లాన్ గురించి ముందే తెలుసుకున్న టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌.. రేవంత్‌ కు చెక్ చెప్పేందుకు ప‌క్కా ప్లాన్‌ ను సిద్ధం చేశారు. ఓటుకు నోటు కేసులో పోలీసులు అరెస్ట్ చేసి.. జీపులోకి ఎక్కించిన వేళ‌లో రేవంత్ రెడ్డి మీసం మెలేసి.. ఆగ్ర‌హంతో త‌న‌పై చేసిన స‌వాల్‌ ను కేసీఆర్ మ‌ర్చిపోలేద‌నే చెప్పాలి. త‌న‌ను అరెస్ట్ చేయిస్తాన‌ని ఛాలెంజ్ చేసిన రేవంత్‌ కు.. రాజ‌కీయంగా భారీ దెబ్బ తీయాల‌న్న ఆలోచ‌న‌లో టీఆర్ ఎస్ అధినాయ‌క‌త్వం ఉంద‌ని చెబుతారు. ఇందులో భాగంగానే రేవంత్ రాజీనామా చేయ‌నున్న నేప‌థ్యంలో.. కొడంగ‌ల్ కు జ‌రిగే ఉప ఎన్నికల్లో ఆయ‌న‌కు దిమ్మ తిరిగే షాక్ ఇవ్వాల‌న్న ఆలోచ‌న‌లో టీఆర్ ఎస్ అధినేత ఉన్న‌ట్లుగా చెబుతున్నారు.

రేవంత్ రాజీనామాతో ఉప ఎన్నిక ఖాయం. నిబంధ‌న‌ల ప్ర‌కారం ఒక ఎమ్మెల్యే రాజీనామా చేసి.. అది ఆమోదించిన తేదీ నుంచి ఆర్నెల్ల వ్య‌వ‌ధిలో ఆ నియోజ‌క‌వ‌ర్గానికి ఉప ఎన్నిక‌ను నిర్వ‌హించాల్సి ఉంటుంది. రేవంత్ త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసిన వెంట‌నే దాన్ని ఆమోదించ‌టం ఖాయం. అంటే.. వ‌చ్చే ఆర్నెల్ల‌లో ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంద‌న్న మాట‌.

ఈ ఉప ఎన్నిక రేవంత్‌కు అగ్నిప‌రీక్ష లాంటిద‌ని చెప్పాలి. ఆయ‌న రాజ‌కీయ భ‌విష్య‌త్తును పూర్తిస్థాయిలో ప్ర‌భావితం చేసేద‌ని చెప్ప‌క‌త‌ప్ప‌దు. కొడంగ‌ల్ ఉప ఎన్నిక‌ల్లో రేవంత్ విజ‌యం సాధిస్తే ఓకే. కాంగ్రెస్ పార్టీలో ఆయ‌న‌కు గౌర‌వ‌నీయ‌మైన స్థానం ల‌భిస్తుంది. అదే స‌మ‌యంలో.. ఓట‌మి కానీ ఎదురైతే మాత్రం రాజ‌కీయంగా కోలుకోలేని దెబ్బ త‌గ‌ల‌టం ఖాయ‌మ‌ని చెప్పాలి. ఈ అవ‌కాశాన్ని పూర్తిగా వినియోగించుకోవాల‌ని భావిస్తుస్తోంది తెలంగాణ అధికార‌ప‌క్షం. ఇందులో భాగంగా కొడంగ‌ల్ ఉప ఎన్నిక‌కు అప్పుడు అభ్య‌ర్థిని కూడా సిద్ధం చేసిన‌ట్లుగా తెలుస్తోంది.

అధికార‌పక్షంగా త‌మ‌కున్న బ‌లంతో పాటు.. స‌ర్వ‌శ‌క్తుల్ని ఒడ్డ‌టం ద్వారా రేవంత్‌కు షాక్ ట్రీట్ మెంట్ ఇచ్చేందుకు ఇప్ప‌టికే వ్యూహం సిద్దం చేసిన‌ట్లుగా చెబుతున్నారు. రాజ‌కీయంగా రేవంత్‌కు భ‌విష్య‌త్ లేకుండా చేసే అద్భుత అవ‌కాశంగా టీఆర్ ఎస్ అధినాయ‌క‌త్వం ఆలోచిస్తున్న‌ట్లుగా తెలుస్తోంది. రేవంత్ మీద పోటీకి ఎమ్మెల్సీ న‌రేంద్రరెడ్డిని దింపాల‌ని భావిస్తున్న‌ట్లుగా చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ర‌వాణాశాఖామంత్రి సోద‌రుడైన న‌రేంద్రరెడ్డి అయితే రేవంత్‌ కు బ‌ల‌మైన అభ్య‌ర్థిగా నిలుస్తార‌ని భావిస్తున్నారు. ఒక‌వేళ‌.. స‌మీక‌ర‌ణాలు కుద‌ర‌ని ప‌క్షంలో.. గ‌తంలో రేవంత్ చేతిలో ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డిని బ‌రిలోకి నిలుపుతార‌ని భావిస్తున్నారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా ప‌ని చేసిన గుర్నాథ్ రెడ్డిని రెండో ఆప్ష‌న్ కింద టీఆర్ ఎస్ తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.

ఏమైనా.. రేవంత్ భ‌విత‌ను తేల్చే ఉప ఎన్నిక‌ను టీఆర్ ఎస్ సీరియ‌స్ గా తీసుకోవ‌ట‌మే కాదు.. అభ్య‌ర్థుల్ని కూడా దాదాపు ఫైన‌ల్ చేయ‌టాన్ని చూస్తే.. ఉప ఎన్నిక‌ను ఎంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకుంటుందో తెలుస్తుంది. రానున్న రోజుల్లో కొడంగ‌ల్ అభివృద్ధి మీద కేసీఆర్ ప్ర‌త్యేక శ్ర‌ద్ధ చూప‌టంతో పాటు వ‌రాల జ‌ల్లు కురిపిస్తార‌ని చెబుతున్నారు. మొత్తంగా చూస్తే.. రేవంత్‌కు భారీ అగ్నిప‌రీక్ష ఎదురుకానున్న‌ట్లే.
Tags:    

Similar News