రేవంత్‌ కు కీ పోస్ట్ పోయిన‌ట్లేనా?

Update: 2017-10-25 07:25 GMT
కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్ర టీడీపీలో నెల‌కొన్న రాజ‌కీయ సంచ‌ల‌నం ఒక కొలిక్కి రావ‌టం లేదు. టీటీడీపీఎల్పీ నేత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేర‌నున్న‌ట్లుగా ఇప్ప‌టికే పెద్ద ఎత్తున వార్త‌లు రావ‌టం తెలిసిందే. రేవంత్ లాంటి ఫైర్ బ్రాండ్ నేత‌పై ఇంత పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతున్నా రేవంత్ నోటి నుంచి మాత్రం ఖండించ‌టం లాంటివేమీ లేక‌పోవ‌టం చూస్తే.. కాంగ్రెస్ లోకి ఆయ‌న వెళ్ల‌టం నామ‌మాత్రంగా చెప్పాలి.

తెలంగాణ తెలుగుదేశం పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ గా.. తెలంగాణ తెలుగుదేశం శాస‌న‌స‌భాప‌క్ష నేత‌గా రెండు కీల‌క బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్న రేవంత్ రెడ్డిని పార్టీ నుంచి ఏ తీరులో బ‌య‌ట‌కు పంపుతారు? అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. పార్టీ అధినేత చంద్ర‌బాబు విదేశాల్లో ఉండ‌టం.. ఆయ‌న వ‌చ్చిన త‌ర్వాత రేవంత్ రెడ్డి ఇష్యూను క్లోజ్ చేద్దామ‌న్న ఆలోచ‌న‌లో టీడీపీ ఉన్న‌ట్లుగా తెలుస్తోంది.

చంద్ర‌బాబు స్వ‌దేశానికి వ‌చ్చిన త‌ర్వాత ఆయ‌న్ను క‌లిసి.. జ‌రిగిందేమిట‌న్న‌ది తాను వివ‌రిస్తాన‌ని రేవంత్ చెబుతున్నారు. అయితే.. అలాంటి అవ‌కాశం రేవంత్ కు క‌లిసే అవ‌కాశం లేద‌ని చెబుతున్నారు. రేవంత్ వివ‌ర‌ణ‌ను చంద్ర‌బాబు వినే ప్ర‌స‌క్తే లేద‌ని.. ఆ మాట‌కు వ‌స్తే బాబు అపాయింట్ మెంట్ కూడా ఇవ్వ‌క‌పోవ‌చ్చ‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. మ‌రోవైపు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స‌మావేశాలు శుక్ర‌వారం నుంచి షురూ కానున్నాయి.

ఈ నేప‌థ్యంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాస‌న‌స‌భాప‌క్ష నేత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న రేవంత్ రెడ్డి.. అదే హోదాలో అసెంబ్లీ స‌మావేశాల‌కు హాజ‌ర‌వుతారా? అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం అసెంబ్లీ స‌మావేశాల‌కు ఒక రోజు ముందు రేవంత్ పై వేటు ప‌డుతుంద‌ని.. పార్టీ శాస‌న‌స‌భాప‌క్ష నేత‌.. వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ ప‌ద‌వుల నుంచి తొల‌గిస్తూ టీడీపీ నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు.

అదే జ‌రిగితే.. రేవంత్ స్థానంలో ఎవ‌రు ఉంటార‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. అయితే.. టీడీపీకి ఇప్పుడు మిగిలింది ఇద్ద‌రు నేత‌లు మాత్ర‌మే. ఒక‌రు సండ్ర‌.. మ‌రొక‌రు ఆర్‌.కృష్ణ‌య్య‌. ఇద్ద‌రిలో కృష్ణ‌య్య ఇప్ప‌టికే పార్టీకి  తాను దూర‌మ‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. మిగిలింది సండ్ర మాత్ర‌మే కావ‌టంతో ఆయ‌నే టీటీడీపీ ఎల్పీ అధినేత‌గా వ్య‌వ‌హ‌రించే వీలుంద‌ని చెబుతున్నారు.

నిజానికి టీటీడీపీలో రేవంత్‌కు ఇచ్చిన అవ‌కాశం అంతా ఇంతా కాదు. పార్టీకి ఆయ‌న ప్రాధాన్య‌త‌ను గుర్తించి పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టును ఇచ్చారు. నిజానికి.. పార్టీ పెట్టిన నాటి నుంచి ఇప్ప‌టివ‌ర‌కూ ఈ పోస్ట్ అన్న‌ది లేదు. కేవ‌లం రేవంత్ రెడ్డి కోస‌మే ఈ ప‌ద‌విని సృష్టించార‌ని చెప్పాలి. రేవంత్ రెడ్డిపై పార్టీ క‌ఠిన‌చ‌ర్య తీసుకుంటుంద‌న‌టానికి నిద‌ర్శ‌నంగా పార్టీ టీడీపీ తెలంగాణ అధ్య‌క్షుడు ఎల్ ర‌మ‌ణ చేసిన ప‌రోక్ష వ్యాఖ్య‌లే నిద‌ర్శ‌నంగా చెబుతున్నారు.

త‌మ మీద వ‌చ్చే వార్త‌ల‌కు సంబంధించి ఏ నాయ‌కుడైనా విస్ప‌ష్ట వివ‌ర‌ణ ఇవ్వ‌కుంటే బాధ్య‌త‌ల నుంచి తొల‌గిస్తామ‌ని ఎల్ ర‌మ‌ణ వ్యాఖ్య‌ల సారాంశం చూస్తే.. రేవంత్‌ ను సాగ‌నంపేందుకు రంగం సిద్ధ‌మైంద‌ని చెప్పాలి. టైమ్ కోసం ఎదురుచూస్తున్నార‌ని మాత్ర‌మే చెప్పాలి. అన్ని అనుకున్న‌ట్లు జ‌రిగితే గురువారం..టీడీపీ నుంచి రేవంత్‌ను స‌స్పెండ్ చేయ‌టానికే అవ‌కాశాలు ఎక్కువ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. 
Tags:    

Similar News