బ్రిటన్ ఎన్నికల్లో వెనుకబడ్డ మనోడు.. గెలిచేది ఆమేనట

Update: 2022-07-31 08:30 GMT
వందల ఏళ్ల పాటు పాలించిన బ్రిటన్ దేశానికి భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి ఒకరు ప్రధానమంత్రి అయితే.. వినేందుకే ఎంతో ఆసక్తికరంగా ఉన్న ఈ మాట నిజమైతే బాగుండని అనుకోకుండా ఉండని భారతీయుడే ఉండరు. అలాంటిది ఇక్కడే మరో విషయాన్ని ప్రస్తావించాలి. భారతీయ వ్యక్తిని పెళ్లాడి.. ఇక్కడి సమాజంలో మమేకం అయిపోయి.. ఇక్కడి రాజకీయాల్లో కీలక భూమిక పోషించే కాంగ్రెస్ అధినేత్రిని మన దేశ ప్రధానిగా అంగీకరించటానికి మాత్రం మనసు అంగీకరించదు. ఆమెకు ప్రధాని అయ్యే అవకాశం ఉన్నా.. ఆ సందర్భంగా మాత్రం ఆమెలోని ‘ఇటలీ’ కోణాన్ని బయటకు తీయటం తెలిసిందే.

ఇదిలా ఉంటే.. బ్రిటన్ ప్రధాని పదవికి కేవలం అడుగు దూరంలోనే ఉన్న రిషి సునక్ కు అవకాశాలు మెరుగ్గా ఉన్నట్లుగా ఇప్పటివరకు అంచనాలు వెలువడిన సంగతి తెలిసిందే. అయితే.. ఇప్పుడు పరిస్థితుల్లో అనూహ్య మార్పులు వచ్చినట్లుగా చెబుతున్నారు. వచ్చే వారం నుంచి పార్టీ ఓటర్లకు ప్రధానమంత్రిని ఎంపిక చేసుకునే బ్యాలెట్ పేపర్లు అందే వేళలో.. రేసులో ఉన్న ఇద్దరిలో లిజ్ ట్రస్ కు మెరుగైన అవకాశాలు ఉన్నట్లుగా తాజా అంచనాలు వెలువడుతున్నాయి. దీనికి సంబంధించిన కీలక విషయాల్ని బ్రిటన్ కు చెందిన బెట్టింగ్ ఎక్స్ఛైంజ్ సంస్థ స్మార్కెట్స్ వెల్లడించింది.

నిజానికి ప్రధాని రేసులో ఫైనల్ రౌండ్ గా అభివర్ణించే నాటికి రిషి సునాక్.. ట్రస్ లు ఇద్దరే మిగలటం.. 60 - 40గా అవకాశాలు ఉన్నట్లుగా అంచనాలు వెలువడ్డాయి. ఫైనల్ రౌండ్ లో భాగంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించిన ఇద్దరు.. వివిధ వేదికల మీద తమ వాదనలు వినిపిస్తూ ఉండటం తెలిసిందే. అయితే.. ఈ విషయంలో రిషి అనూహ్యంగా వెనుకబడితే.. ట్రస్ పెద్ద ఎత్తున బాల పడినట్లుగా అంచనాలు వెలువుడుతున్నాయి.

పోటీ మొదలైప్పటి నుంచి రిషికే గెలుపు అవకాశాలు ఉన్నట్లుగా చెబుతున్న సంగతి తెలిసిందే. అయితే.. తాజాగా వెలువడుతున్న అంచనాల ప్రకారం విజయావకాశాలు ట్రస్ కు 90 శాతం ఉంటే.. రిషి సునక్ కు మాత్రం కేవలం 10 శాతమే ఉన్నట్లుగా చెబుతున్నారు. బ్రిటన్ ప్రధానిని ఎన్నుకునేందుకు 1.75 లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. వారిలో ఎవరైతే మెజారిటీ ఓట్లు వేస్తారో.. వారికే ప్రధాని పీఠం దక్కనుంది. మరి.. తాజా అంచనాలకు తగ్గట్లే తుది ఫలితం వస్తుందా? అందుకు భిన్నంగా ఉంటుందా? అన్నది తేలాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ఒకవేళ రిషి సునక్ విజయం సాధిస్తే మాత్రం.. అరుదైన విజయాన్ని సొంతం చేసుకున్నట్లే.
Tags:    

Similar News