బబబ బ్యాటింగ్.. బౌబౌబౌ.. బౌలింగ్.. టాస్ నెగ్గి రోహిత్ తడబాటు

Update: 2023-01-21 10:40 GMT
మన ఊరిలో, గల్లీల్లో కుర్రాళ్లు, పిల్లలు సెలవు రోజుల్లో, వేసవి కాలంలో బయటకు వెళ్లారంటే చాలు ఒకటే ఆట. పల్లెటూర్లలో అయితే ఖాళీగా ఉన్న వరి చేలలో పడి రోజంతా ఆడడమే. ఈ ఆట మరేటో కాదు.. క్రికెట్. అయితే.. ఎవరైనా రూపాయి బిళ్ల పైకి ఎగిరేసి కోరుకున్న ఫలితం వచ్చాక ముందుగా తీసుకునేది బ్యాటింగే. ఎందుకంటే.. బంతి విసురుతూ, ఫీల్డింగ్ చేస్తూ ఉండే కంటే బ్యాట్ తో బాదడమే ఒక సరదా. క్రికెట్ లో "టాస్" అంత ప్రధానం.. అసలు మ్యాచ్ కు అరగంట ముందే పూర్తయ్యే తతంగం. ఒకవేళ టాస్ నెగ్గితే బ్యాటింగ్ ఎంచుకోవాలా? బౌలింగ్ తీసుకోవాలా? అనేది పెద్ద విషయం. ఆటపై పెద్దగా అవగాహన లేని, కేవలం అభిమానులే అయితే బ్యాటింగ్ కావలంటారు. కానీ, లోతైన విశ్లేషణ, పిచ్ పై అవగాహన, అంతర్జాతీయ స్థాయిలో ఏం జరిగినా ఆడాలని అనుకునేవారికి మాత్రం ఇది పెద్ద విషయం కాదు.

అబ్బా ముందుగా బ్యాటింగ్ దిగితేనా..? పొరపాటున టీమిండియా కెప్టెన్ ఎవరైనా టాస్ నెగ్గి, బౌలింగ్ ఎంచుకున్నాక.. ప్రత్యర్థి దబిడిదిబిడిగా బాదేస్తున్నాడనుకోండి. ఇక మన అభిమానులకు ఒకటే దడ. అబ్బా.. ముందుగా బ్యాటింగ్ తీసుకోవాల్సింది. ఇదేం తిక్క నిర్ణయం? అంటూ తిట్టిపోస్తారు. ఒకవేళ బ్యాటింగ్ కే దిగి టపటపా వికెట్లు పారేసుకుందనుకోండి... ఛీఛీ.. పిచ్ గురించి ఆలోచించకుండా బ్యాటింగ్ కు దిగారు అని తప్పుబడతారు. వాస్తవం ఏమిటంటే.. అంతర్జాతీయ స్థాయిలో మైదానంలోకి దిగాక పిచ్, పరిస్థితులు వంటివి లెక్కలోకి రావు.

ఒకసారి బరిలో కాలుపెడితే తాడోపేడో. కారణాలు చూపించి తప్పించుకునే ప్రయత్నం చేస్తే అభాసుపాలు కావడం మినహా మరేమీ ఉండదు.  టీమిండియాను కొన్నాళ్లు వెంటాడిన టాస్ టాస్ విషయంలో టీమిండియాను తీవ్రంగా బాధించే సంఘటన ఒకటుంది. అది 2003 ప్రపంచ కప్ ఫైనల్. ఆస్ట్రేలియాతో నాడు జరిగిన ఫైనల్లో భారత కెప్టెన్ సౌరభ్ గంగూలీ టాస్ గెలిచి మరీ బౌలింగ్ తీసుకున్నాడు. అసలే రికీ పాంటింగ్ సారథ్యంలోని దూకుడైన ఆసీస్. ఆపై మొదట బ్యాటింగ్. ఇంకేముందు 350 పరుగులు పైగా చేసి భారీ లక్ష్యాన్ని భారత్ ముందుచింది. సచిన్ సహా కీలక ఆటగాళ్లు విఫలం కావడంతో టీమిండియాకు కప్ అందలేదు. టాస్ నెగ్గి బౌలింగ్ తీసుకోవడంపై చాన్నాళ్ల పాటు విమర్శలు వచ్చాయి.

కానీ, తర్వాత అవి సద్దుమణిగాయి. ఇప్పటికీ నాటి గంగూలీ నిర్ణయాన్ని తప్పుబడుతుంటారు. ఇక ప్రస్తుత విషయానికొస్తే భారత్-న్యూజిలాండ్ మధ్య  వన్డే సిరీస్ రెండో  మ్యాచ్ కు ముందు కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ నెగ్గి బ్యాటింగ్, బౌలింగ్ లో ఏది ఎంచుకోవాలో తెలియక పది సెకన్ల పాటు గందరగోళానికి గురయ్యాడు. తన సమక్ష్యంలో జరిగిన దీన్నంతటినీ మ్యాచ్ రిఫరీ, టీమిండియా మాజీ పేసర్ జవగళ్ శ్రీనాథ్ చూస్తూ  నవ్వుకున్నాడు. రోహిత్ భలే తమాషా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు న్యూజిలాండ్ తో రెండో వన్డేలో వింత అనుభవం ఎదురైంది.

ఛత్తీస్ గఢ్ రాజధాని రాయ్‌పుర్‌లో వన్డే ప్రారంభానికి ముందు టాస్ సమయంలో ఈ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. టాస్‌ గెలిచిన తర్వాత ఏదో మర్చిపోయినట్లు భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తలపట్టుకున్నాడు. టాస్‌ విషయంలో ఎలా స్పందించాలనే విషయంపై జట్టు సభ్యులతో చాలా విధాలుగా చర్చించినట్లు.. అన్ని ఆలోచనలు కలిసి సందిగ్ధం ఏర్పడిందని ఆయన తర్వాత బదులిచ్చాడు. చివరకు బౌలింగ్ ఎంచుకున్నాడు. మరోవైపు టాస్ నెగ్గి ఉంటే తాము కూడా బౌలింగ్ తీసుకునేవారమని న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్ చెప్పడం గమనార్హం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News