శవాల మీద నుంచి నడుచుకుంటూ వెళ్లి సీఎం అయ్యారా?

Update: 2019-10-19 07:17 GMT
సీపీఐ నారాయణ మాటలు ఎలా ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. సూటిగా ఉండటమే కాదు.. కత్తి మొనతో గుచ్చినట్లుగా మాట్లాడటం ఆయనకు అలవాటు. చెప్పాల్సిన మాటను.. చేయాల్సిన విమర్శను కరకుగా చెప్పే ఆయన వ్యాఖ్యలు తరచూ వార్తలుగా మారుతుంటాయి. కోపం వచ్చినప్పడు నారాయణ కాస్తా నరసింహావతారం ఎత్తేస్తుంటారు. ఎదుటోళ్లు ఎవరైనా సరే.. వెనుకా ముందు చూసుకోకుండా మాటలు అనేస్తుంటారు.

తాజాగా అదే తరహాలో చెలరేగిపోయారు కామ్రేడ్.  ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆర్టీసీ సమ్మెను పరిష్కరించే విషయంలో మానవ హక్కుల సంఘం తక్షణమే జోక్యం చేసుకొని ఆర్టీసీ ఉద్యోగుల్ని ఆదుకోవాలన్నారు. ఇప్పటివరకూ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఉద్దేశించి ఎవరూ అనని తీవ్ర వ్యాఖ్య ఆయన నోటి నుంచి వచ్చింది.

తెలంగాణ కోసం బలిదానాలు చేసిన 1200 మంది విద్యార్థుల శవాలపై నడుచుకుంటూ పోయి కేసీఆర్ సీఎం అయ్యారన్నారు. కార్మికులది సెల్ఫ్ డిస్మిస్ కాదని.. కేసీఆరే రాజకీయంగా ఆత్మహత్య చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. సకల జనుల సమ్మెకు అన్ని వర్గాల ప్రజల మద్దతు లభిస్తోందన్న ఆయన.. టీఎన్జీవోలను ప్రలోభ పెట్టేందుకు కేసీఆర్ ప్రయత్నించినా.. వారంతా కార్మికులకే మద్దతు ప్రకటించారన్నారు. ఇంత తీవ్రమైన వ్యాఖ్యను చేసిన నారాయణ మాటలపై కేసీఆర్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
Tags:    

Similar News