వైసీపీలో రాయపాటి?..టీడీపీకి పెద్ద దెబ్బే!

Update: 2019-05-10 18:45 GMT
ఏపీలో అధికార పార్టీ టీడీపీకి గ‌ట్టి పట్టున్న గుంటూరు జిల్లాలో గ‌ట్టి షాక్ త‌గ‌ల‌నుంద‌న్న వార్త‌లు వినిపిస్తున్నాయి. గుంటూరు జిల్లా న‌ర‌స‌రావుపేట ఎంపీగా ఉన్న రాయ‌పాటి సాంబ‌శివ‌రావు సోద‌రుడు రాయ‌పాటి శ్రీ‌నివాస్ వైసీపీలో చేరిపోయే దిశ‌గా అడుగులు వేస్తున్నార‌న్న వార్త‌లు ఇప్పుడు పెను సంచ‌ల‌నంగానే మారిపోయాయి. ఇప్ప‌టిదాకా రాయ‌పాటి సోద‌రులు ఒక‌టే మాట‌... ఒక‌టే బాట‌గా సాగిన సంగ‌తి తెలిసిందే. అయితే ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ఎన్నిక‌ల్లో భాగంగా రాయ‌పాటి సీనియ‌ర్ త‌న సీటును మాత్ర‌మే ద‌క్కించుకోగా అవ‌కాశం కోసం వేచి చూసి విసిగిపోయిన రాయ‌పాటి జూనియ‌ర్ ఇక త‌న దారి తాను చూసుకునే దిశ‌గా సాగుతున్నారు. మొత్తంగా రాయ‌పాటి కుటుంబంలో చీలిక వ‌చ్చే ప్ర‌మాదం కూడా లేక‌పోలేద‌న్న వార్త‌లు వినిపిస్తున్నాయి.

2014 ఎన్నిక‌ల‌కు ముందు రాయ‌పాటి ఫ్యామిలీ మొత్తం కాంగ్రెస్ పార్టీలోనే ఉంది. అయితే రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురు గాలి వీచే ప్ర‌మాదాన్ని గుర్తించిన కాంగీ నేత‌లంతా ఆ పార్టీని వీడారు. ఈ జాబితాలో రాయ‌పాటి ఫ్యామిలీ కూడా ఉంది. త‌న‌యుదు రంగారావు - సోద‌రుడు శ్రీ‌నివాస్‌ - సోద‌రుడి కుమారుడు మోహ‌న్ సాయికృష్ణ‌ల‌తో క‌లిసి సాంబ‌శివరావు టీడీపీలో చేరారు. అప్ప‌టికే రాష్ట్రంలోనే బ‌ల‌మైన నేత‌గా ఉన్న రాయ‌పాటికి న‌ర‌స‌రావుపేట ఎంపీ టికెట్ ఇచ్చిన చంద్ర‌బాబు... శ్రీ‌నివాస్ కు ఏదో ఒక నామినేటెడ్ ప‌ద‌వి ఇస్తాన‌ని హామీ ఇచ్చారు. అయితే ఐదేళ్ల కాలం ముగిసిపోయినా శ్రీ‌నివాస్ కు అవ‌కాశం ద‌క్క‌లేదు. అయితే ఈ ఎన్నిక‌ల్లో అయినా త‌మ‌కు అవ‌కాశం ద‌క్కుతుంద‌ని శ్రీ‌నివాస్‌ - మోహ‌న్ సాయికృష్ణ భావించారు. మ‌రోవైపు సాంబ‌శివ‌రావు కూడా త‌న కుమారుడు రంగారావుకు అసెంబ్లీ సీటు ఆశించారు.

అయితే ఏ క్ష‌ణంలో అయినా రాయపాటి ఫ్యామిలీ మొత్తం వైసీపీలో చేరిపోయే అవ‌కాశాలున్నాయ‌న్న వాద‌న‌తో ఒక్క రాయ‌పాటికి మాత్ర‌మే ఆయ‌న సిట్టింగ్ స్థానం న‌ర‌స‌రావుపేట ఎంపీ సీటు ఇచ్చేసిన చంద్ర‌బాబు... ఇటు రంగారావుతో పాటు అటు శ్రీ‌నివాస్ - మోహ‌న సాయికృష్ణ‌ల‌కు మొండి చెయ్యే చూపారు. ఈ నేప‌థ్యంలో టికెట్లు ఖ‌రారైన నాటి నుంచే శ్రీ‌నివాస్ అసంతృప్తి వ్య‌క్తం చేస్తూ వ‌చ్చారు. అయితే ఎన్నిక‌ల‌కు రంగం సిద్ధ‌మైపోయిన వేళ పార్టీ మారినా పెద్ద‌గా ప్ర‌యోజ‌నం ఉండ‌ద‌ని భావించిన శ్రీ‌నివాస్ వేచి చూసే ధోర‌ణిని అవ‌లంబించారు. తాజాగా అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు పోలింగ్ ముగియ‌డం - త్వ‌ర‌లోనే స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు రంగం సిద్ధం అవుతున్న వేళ‌... ఇక త‌న దారి తాను చూసుకోవాల్సిందేన‌ని శ్రీ‌నివాస్‌ - ఆయ‌న త‌న‌యుడు మోహ‌న సాయికృష్ణ భావించార‌ట‌.

గ‌తంలో గుంటూరు మేయ‌ర్ గా ప‌నిచేసిన మోహ‌న సాయికృష్ణ ఇప్పుడు స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ అదే స్థానం ల‌క్ష్యంగా పావులు క‌దుపుతున్నార‌ట‌. అయితే టీడీపీ నుంచి ఈ ద‌ఫా కూడా అవ‌కాశం ద‌క్క‌ద‌న్న ఆయ‌న త‌న తండ్రి శ్రీ‌నివాస్ తో క‌లిసి వైసీపీలోకి చేరిపోవాల‌ని దాదాపుగా నిర్ణ‌యించుకున్నార‌ట‌. ఈ క్ర‌మంలోనే ఆయ‌న శుక్ర‌వారం టీడీపీని ల‌క్ష్యంగా చేసుకుని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా విష‌యంలో కాంగ్రెస్ - టీడీపీలను ఏ1 - ఏ2లుగా అభివ‌ర్ణించిన సాయికృష్ణ‌... ఏ3 - ఏ4 అంటూ జనసేన - బీజేపీపై ఆరోపణలు చేశారు. టీడీపీని టార్గెట్ చేసుకుని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తాను ఏ పార్టీతో సంబంధం లేకుండా ప్రజా సమస్యలపై గళం ఎత్తుతానని మోహన్ సాయికృష్ణ చెప్పడం హాట్‌టాపిక్ గా మారిపోయింది. టీడీపీని వీడేందుకు రంగం సిద్ధం చేసుకున్న నేప‌థ్యంలోనే ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశార‌న్న విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి.

 



Tags:    

Similar News